Begin typing your search above and press return to search.

శంకర్.. వాళ్లిద్దరికీ మళ్లీ లైఫ్ ఇస్తున్నాడు

By:  Tupaki Desk   |   14 March 2016 5:00 PM IST
శంకర్.. వాళ్లిద్దరికీ మళ్లీ లైఫ్ ఇస్తున్నాడు
X
శంకర్ దర్శకుడిగా దేశం మొత్తానికి పరిచయం. ఐతే తమిళ ఇండస్ట్రీ వరకు అతను మంచి నిర్మాత కూడా. ‘ఎస్ పిక్చర్స్’ అనే బేనర్ పెట్టి తన అసిస్టెంట్లకు, ప్రతిభావంతులైన యువ దర్శకులకు అవకాశాలిస్తూ అద్భుతమైన సినిమాలు నిర్మించాడీ లెజెండరీ డైరెక్టర్. ప్రేమిస్తే - 376వ గదిలో దేవుడు - 23వ పులకేసి - వైశాలి లాంటి సినిమాల్ని నిర్మించింది శంకరే. ఇందులో 376వ గదిలో దేవుడు - 23వ పులకేసి సినిమాలకు దర్శకుడు ఒకడే. అతడి పేరు చింబుదేవన్. శంకర్ దగ్గర చాన్నాళ్లు పని చేశాడితను. ఫాంటసీ సినిమాలకు పెట్టింది పేరైన చింబు దేవన్.. ఈ మధ్యే విజయ్ హీరోగా ‘పులి’ పేరుతో ఓ భారీ బడ్జెడ్ సినిమా తీశాడు. అది పెద్ద డిజాస్టర్ అయి.. చింబుకున్న పేరంతా పోగొట్టింది.

ఇప్పుడు చింబుదేవన్ కు అవకాశాలు ఇచ్చేవాళ్లు లేరు. ఇలాంటి టైంలో మళ్లీ శంకరే అతడికి లైఫ్ ఇవ్వబోతున్నాడు. ఇంతకుముందు చింబుదేవన్ దర్శకత్వంలో వడివేలు హీరోగా ‘23వ పులకేసి’ సినిమాను నిర్మించిన శంకర్.. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్లోనే సినిమా తీయబోతున్నాడు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన వడివేలు పరిస్థితి కూడా గత కొన్నేళ్లుగా ఏమీగా బాగా లేదు. విజయ్ కాంత్, జయలలితలతో పెట్టుకుని పూర్తిగా కెరీర్ ను నాశనం చేసుకున్నాడు వడివేలు. ఈ మధ్యే హీరోగా ‘తెనాలిరామన్’ అనే సినిమా చేశాడు కానీ.. అది ఆడలేదు. కమెడియన్ గా కూడా వేషాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్.. వడివేలు హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో సినిమా తీయబోతుండటం విశేషమే.