Begin typing your search above and press return to search.

రాజమండ్రిలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన శంకర్!

By:  Tupaki Desk   |   6 Feb 2022 12:30 PM GMT
రాజమండ్రిలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన శంకర్!
X
శంకర్ అంటే కాన్ఫిడెంట్ .. శంకర్ సినిమా అంటే భారీతనం. ఈ రెండూ లేకుండా శంకర్ సినిమాలు కనిపించవు. కథాకథనాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేయడంలో శంకర్ సిద్ధహస్తుడు.

ఆయన సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది .. ఆ యాక్షన్ అంతా కూడా బలమైన ఎమోషన్ తో ముడిపడి ఉంటుంది .. ఆ ఎమోషన్ వెనుక లవ్ ఉంటుంది .. ఈ మూడింటిని కలుపుకుని కామెడీ నడుస్తుంది. అందువలన అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన సినిమాలను ఆదరిస్తుంటారు.

ఇక శంకర్ సినిమాల్లో కథాకథనాలు ఒక ఎత్తు .. పాటలు ఒక ఎత్తు అన్నట్టుగా ఉంటాయి. అంతవరకూ ఎవరూ వెళ్లని లొకేషన్స్ లో .. అంతవరకూ ఎవరూ పెట్టని ఫ్రేమ్స్ లో అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరించటం ఆయన ప్రత్యేకత. ఒక పాట కోసమే కోట్ల రూపాయలను ఖర్చు చేయించగలడు .. అంతకంటే ఎక్కువ రాబట్టగలడు. ఆయనపై ఆయనకున్న నమ్మకాన్ని చూసిన నిర్మాతలు కూడా వెనుకాడరు. రజనీ .. కమల్ వంటి సీనియర్ స్టార్ హీరోలకు ఎదురుగా నిలబడి షాట్ చెప్పడం .. వాళ్ల కెరియర్ లోనే పెద్ద హిట్లను తెచ్చి పెట్టడం శంకర్ వలన మాత్రమే అయింది.

అలాంటి శంకర్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో చరణ్ సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా దిల్ రాజుకి 50వ సినిమా. శంకర్ చాలా వేగంగా ఈ సినిమాను పట్టాలెక్కించాడు. చకచకా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది కూడా. ఈ రెండు షెడ్యూల్స్ లో కూడా చరణ్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక మూడవ షెడ్యూల్ ను ఈ నెల 8వ తేదీన మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 3వ షెడ్యూల్ ను రాజమండ్రిలో ప్లాన్ చేశారట. 20 రోజుల పాటు అక్కడ ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనుందని అంటున్నారు.

ముఖ్యమైన పాత్రధారులు ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అద్వాని అందాల సందడి చేయనుంది. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో 'వినయ విధేయ రామ' వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ .. సునీల్ .. నవీన్ చంద్ర .. జయరామ్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మెగా అభిమానులంతా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.