Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘శమంతకమణి’

By:  Tupaki Desk   |   14 July 2017 9:07 AM GMT
మూవీ రివ్యూ: ‘శమంతకమణి’
X
చిత్రం : ‘శమంతకమణి’

నటీనటులు: నారా రోహిత్ - సుధీర్ బాబు - సందీప్ కిషన్ - ఆది - రాజేంద్ర ప్రసాద్ - చాందిని చౌదరి - అనన్య - జెన్నీ - తనికెళ్ల భరణి - హేమ - ఇంద్రజ - రఘు కారుమంచి - సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

తెలుగులో మామూలుగానే మల్టీస్టారర్లు తక్కువ. అందులోనూ నలుగురు హీరోలు కలిసి నటించడం అంటే అరుదే. ‘భలే మంచి రోజు’తో మంచి గుర్తింపు సంపాదించిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.. ఈ అరుదైన కలయికతో ‘శమంతకమణి’ని రూపొందించాడు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కోటీశ్వరుడి కొడుకైన కృష్ణ (సుధీర్ బాబు) తన తండ్రి మీద కోపంతో ఆయన రూ.5 కోట్లు పెట్టి వేలంలో కొన్న ‘శమంతకమణి’ అనే వింటేజ్ కారు తీసుకుని పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీ పూర్తి చేసుకుని బయటికి వచ్చేసరికి అక్కడ కారుండదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఈ కేసును ఎస్సై రంజిత్ కుమార్ (నారా రోహిత్) టేకప్ చేస్తాడు. పార్టీకి వచ్చిన శివ (సందీప్ కిషన్).. కార్తీక్ (ఆది).. ఉమామహేశ్వరరావు (రాజేంద్ర ప్రసాద్)లతో పాటు కృష్ణను కూడా అతను అనుమానిస్తాడు. అందరినీ విచారిస్తాడు. మరి వారి నుంచి రంజిత్ ఏం సమాచారం రాబట్టాడు.. ఇంతకీ ఆ కారు దొరికిందా లేదా అన్నది తెరమీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

శమంతకమణి అనే టైటిల్.. నలుగురు యువ కథానాయకుల కలయిక.. క్రియేటివ్ ప్రోమోలు.. ఇలా ‘శమంతకమణి’ సినిమాకు సంబంధించి అనేక అంశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. దీని ట్రైలర్ ఒక రేసీ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ చూడబోతున్న అంచనాలు రేకెత్తించింది. కానీ ‘శమంతకమణి’ మీద మరీ అంత అంచనాలు పెట్టుకుంటే కష్టం. ఇది ఓ మోస్తరుగా అనిపించే క్రైమ్ కామెడీ మూవీ. వేర్వేరు వ్యక్తుల్ని పరిచయం చేసి.. వాళ్లందరినీ ఒకచోటికి తీసుకొచ్చి.. కామన్ ఇష్యూ క్రియేట్ చేసి.. అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టి.. చివరికి సమస్యను పరిష్కరించే మల్టీ స్టోరీ థ్రిల్లర్లు తెలుగులో ఇంతకుముందే కొన్ని చూసి ఉంటారు. ‘శమంతకమణి’ కూడా ఆ కోవలోని సినిమానే. ఇలాంటి సినిమాల్లో ప్రధానంగా ఎంటర్టైన్మెంట్.. థ్రిల్ ఆశిస్తాం. శ్రీరామ్ ఆదిత్య కొంత వరకు ఎంటర్టైన్ చేసినా.. చివర్లో థ్రిల్ చేసినా.. ప్రేక్షకులు ఆశించే స్థాయిలో మాత్రం డోస్ అందించలేకపోయాడు.

ప్రోమోల్లో ‘శమంతకమణి’ కారుతో పాటు ఒక్కో పాత్రకు ఇచ్చిన బిల్డప్ చూసి ఏదో ఆశిస్తాం. కానీ తెరమీద ఆ కారు సహా ప్రతి పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు.. వాటిని బిల్డ్ చేసిన తీరు చాలా మామూలుగా అనిపిస్తుంది. ముందుగా శమంతకమణి గురించే మాట్లాడుకుందాం. కథ మొత్తం ఈ కారు చుట్టూనే తిరిగినపుడు దాన్ని అపురూపంగా.. అత్యంత విలువైనదిగా చూపించడం కీలకం. దానికి ఏదో ఒక ప్రత్యేకతను ఆపాదించడం అవసరం. కానీ ఆ కారు స్పెషాలిటీ ఏంటన్నదే సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. కారు చుట్టూ ఒక బిల్డప్ లేదు. అదో అపురూపమైన వాహనం అన్న భావనే కలిగించదు. దీంతో ప్రేక్షకులు ఈ కారు దొంగతనం విషయంలో ఉత్కంఠకు లోనయ్యే అవకాశమే ఉండదు.

ఇలాంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ల నుంచి ప్రేక్షకులు ప్రధానంగా ఆశించేది.. వేగం. పాత్రలు ప్రత్యేకంగా ఉండాలని.. కథనం పరుగులు పెట్టాలని కోరుకుంటారు. కానీ ‘శమంతకమణి’ సగం వరకు నత్తనడకనే సాగుతుంది. ఆరంభ సన్నివేశం ఆసక్తి రేకెత్తించి.. సినిమా కొత్తగా ఉండబోతోందన్న ఆశలు కలిగించినా.. ఆ తర్వాతి తతంతమంతా నిరాశ పరుస్తుంది. ఇందులో ఒకటికి ఐదు ప్రధాన పాత్రలుండటంతో ఆ పాత్రల పరిచయం చేసి.. వాళ్ల నేపథ్యాల్ని చూపించి.. కథకు కేంద్రమైన ప్రదేశానికి తీసుకొచ్చేసరికే పుణ్యకాలం గడిచిపోతుంది. పోనీ ఆ పాత్రలేమైనా ప్రత్యేకంగా ఉన్నాయా అంటే అదీ లేదు. దర్శకుడు ఈ పాత్రలకు సంబంధించిన కథల్ని మార్చి మార్చి చూపించే క్రమంలో స్క్రీన్ ప్లే పరంగా క్రియేటివిటీ అయితే చూపించాడు కానీ.. ఆ పాత్రల్ని మాత్రం వైవిధ్యంగా తీర్చిదిద్దలేకపోయాడు. దీంతో ప్రధమార్ధం వరకు ‘శమంతకమణి’ ఏమంత ప్రత్యేకంగా అనిపించదు.

ఐతే ద్వితీయార్ధం నుంచి అసలు కథ చెప్పడం మొదలుపెట్టాక దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా కథనం సాగుతుంది. ఒక్కో పాత్ర ద్వారా జరిగిన సంఘటనల్ని ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక్కడ శ్రీరామ్ స్క్రీన్ ప్లే టెక్నిక్ బాగా పని చేసింది. చివరి దాకా సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో.. ఆఖర్లో థ్రిల్ చేయడంలో అతను విజయవంతమయ్యాడు. నారా రోహిత్ పాత్రకు సంబంధించి చివర్లో వచ్చే కొసమెరుపు నవ్విస్తుంది. కారుకు సంబంధించిన ట్విస్టు మరీ థ్రిల్ చేసేయకపోయినా ఓకే అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో కూడా ఎంటర్టైన్మెంట్ డోస్ ఆశించిన స్థాయిలో లేకపోయినా.. మలుపులు ఆసక్తి రేకెత్తిస్తాయి. కథతో ట్రావెల్ అయ్యేలా చేస్తాయి. ప్రథమార్ధంలో ‘శమంతకమణి’పై కలిగిన ఇంప్రెషన్.. సినిమా అయ్యేసరికి మారుతుంది కానీ.. పూర్తి సంతృప్తి అయితే ఉండదు. పేలని కామెడీ.. పండని సెంటిమెంటు.. రొటీన్ పాత్రలు.. నెమ్మదిగా సాగే ప్రథమార్ధం ‘శమంతకమణి’కి మైనస్ అయినా.. నటీనటుల ప్రతిభ.. సాంకేతిక అంశాలు.. ద్వితీయార్ధం ‘శమంతకమణి’ని కొంత వరకు నిలబెట్టాయి.

నటీనటులు:

హీరోలు నలుగురూ బాగానే చేశారు. నారా రోహిత్‌ కు పోలీస్ క్యారెక్టర్లు కొట్టిన పిండే కాబట్టి ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ పాత్రను అలవోకగా చేసుకెళ్లిపోయాడు. ఈ తరహా పాత్రలు చేయడంలో రోహిత్ అనుభవం.. ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో అతడి నటన మెప్పిస్తుంది. చాలా వరకు సీరియస్ గా సాగిన ఈ పాత్ర.. కొన్ని చోట్ల నవ్వించింది. సందీప్ కిషన్ కూడా తనకు అలవాటైన జులాయి కుర్రాడి పాత్రలో మెప్పించాడు. అతడి నటన సహజంగా సాగింది. సుధీర్ బాబు కొంచెం భిన్నంగా.. ఎక్కువగా సీరియస్ గా సాగే పాత్ర చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. ఐతే ఎప్పట్లాగే అతడికి వాయిస్ మైనస్ అయింది. ఆది బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో కనిపించాడు. అక్కడక్కడా అతను చూపించిన అత్యుత్సాహం కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా ఓకే అనిపిస్తాడు ఆది. రాజేంద్ర ప్రసాద్ ఉన్నంతలో బాగా చేశారు కానీ.. ఆయన పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. సుమన్ పాత్రకు తగ్గట్లుగా నటించాడు. లేడీ క్యారెక్టర్లకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. చాందిని చౌదరి కొన్ని చోట్ల అందంగా కనిపించింది. నటనకు పెద్దగా అవకాశం లేదు. ఇంద్రజకు కూడా పెద్దగా రోల్ లేదు. జెన్నీ.. అనన్యల గురించి చెప్పడానికేం లేదు. తనికెళ్ల భరణి.. హేమ.. రఘు కారుమంచి తమకున్నతక్కువ స్కోప్ లోనే నవ్వించే ప్రయత్నం చేశారు.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గా ‘శమంతకమణి’ బాగానే అనిపిస్తుంది. మణిశర్మ సినిమాకు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. నేపథ్య సంగీతం విషయంలో తన ప్రత్యేకత ఏంటో మరోసారి చాటుకున్నాడు. సినిమాలో ఉన్నది ఒకటే పాట. అది పర్వాలేదనిపిస్తుంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం సినిమాకు మరో పెద్ద ప్లస్. జానర్ కు తగ్గట్లుగా స్టైలిష్ విజువల్స్ తో సమీర్ రెడ్డి మెప్పించాడు. నిర్మాణ విలువలు ఇంకా మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తన మీద పెట్టుకున్న అంచనాల్ని నిలబెట్టుకోలేకపోయాడు. అతను కథ కంటే స్క్రీన్ ప్లేకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడని.. దాని మీదే సినిమాను నడిపిస్తాడని తొలి సినిమాతోనే తేలిపోయింది. ఈసారి కూడా అదే స్టయిల్లో సినిమాను నడిపించాడు. ఐతే ఇక్కడ కథ మరీ పలుచనైపోయింది. కథలో స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడం మైనస్ అయింది. స్క్రీన్ ప్లే విషయంలో తనకున్న గ్రిప్ మరోసారి చూపించాడు కానీ.. కథనాన్ని అనుకున్నంత ఎంటర్టైనింగ్ గా.. రేసీగా మలచలేకపోయాడు. ప్రథమార్ధాన్ని ఇంకొంచెం మెరుగ్గా తీర్చిదిద్దుకుని ఉంటే ‘శమంతకమణి’ ప్రత్యేకంగా ఉండేది.

చివరగా: శమంతకమణి.. కొంచెం ఫన్.. కొంచెం థ్రిల్!

రేటింగ్: 2.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre