Begin typing your search above and press return to search.

అమీర్ ను కాచుకోమంటున్న షారుఖ్

By:  Tupaki Desk   |   3 Nov 2015 1:30 PM GMT


బాలీవుడ్ అంటే ఖాన్స్.. ఖాన్స్ అంటే బాలీవుడ్. అమితాబ్ శకం అయిపోయాక ఖాన్ త్రయానిదే హవా. మధ్యలో హృతిక్ లాంటి వాళ్లు వచ్చారు కానీ.. ఈ ముగ్గురి జోరు ముందు నిలవలేకపోయారు. నెంబర్ వన్ కుర్చీ రేసు ఎప్పుడూ వీళ్లిద్దరి మధ్యే ఉంటుంది. ఐతే ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి స్టామినా వారిది. ఐతే గత దశాబ్ద కాలంలో అమీర్ ఖాన్ మిగతా ఇద్దరినీ దాటుకుని ముందుకెళ్లిపోయాడు. విభిన్నమైన సినిమాలు చేస్తూనే తన స్టేజర్ అంతకంతకూ పెంచుకోవడమే కాదు.. ఇండియన్ బాక్సాఫీస్ లో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. షారుఖ్ - సల్మాన్ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసిన వాళ్లే కానీ.. వాళ్ల సినిమాల విషయంలో చాలా విమర్శలున్నాయి. కేవలం కలెక్షన్ల గురించి ఆలోచిస్తారు కానీ.. చెత్త సినిమాలు చేస్తున్నారని వాళ్ల మీద చాలా విమర్శలున్నాయి.

ఐతే ఈ మధ్యే సల్మాన్ ఖాన్ ‘భజరంగి భాయిజాన్’ సినిమాతో తన మీద అపప్రద తొలగించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమా అతడికి మంచి పేరు తేవడమే కాదు, కలెక్షన్లు కూడా కొల్లగొట్టింది. ఇప్పుడిక షారుఖ్ వంతు వచ్చింది. తన కొత్త సినిమా ‘ఫ్యాన్’తో అమీర్ కు సవాలు విసరబోతున్నాడు షారుఖ్. ఇది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినపుడే అర్థమైంది. తాజాగా షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో షారుఖ్ తనకు తనే ఫ్యాన్ గా నటిస్తుండటం విశేషం. ఆర్యన్ అనే సినిమా హీరో అంటే పడి చచ్చే గౌరవ్ అనే అభిమాని కథతో తెరకెక్కింది ఈ సినిమా. ఆ హీరో షారుఖే.. ఆ అభిమానీ షారుఖే. అభిమాని పాత్ర కోసం ఓ డిఫరెంట్ మేకప్ ట్రై చేశాడు షారుఖ్. టీజర్ చూస్తుంటే చాలా వెరైటీగా అనిపిస్తూ.. ఈ సినిమాతో షారుఖ్ సెన్సేషన్ క్రియేుట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో షారుఖ్ కి హీరోయినే లేకపోవడం విశేషం.