Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ స్టూడియోని రౌండ‌ప్ చేసిన షారూక్ ఫ్యాన్ బ‌ల‌గాలు

By:  Tupaki Desk   |   18 Nov 2020 5:30 PM GMT
ప్ర‌ముఖ స్టూడియోని రౌండ‌ప్ చేసిన షారూక్ ఫ్యాన్ బ‌ల‌గాలు
X
వ‌రుస ప‌రాజ‌యాలు.. ఆస్తుల వివాదాలు.. నిందారోప‌ణ‌లు వగైరా వ‌గైరా కింగ్ ఖాన్ షారూక్ కి ఊపిరాడ‌నివ్వ‌ని సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన కాలంలో రెడ్ చిల్లీస్ పేరుతో అత‌డు ఆడే ఆట‌కు ఓ రేంజులోనే బ్రేక్ ప‌డింది. ఇటీవ‌ల షారూక్ ఆట‌లు ఏవీ సాగ‌లేదు. ముఖ్యంగా అప‌జ‌యం అత‌డిని బాగా కుంగ‌దీసింది.

2018 లో రిలీజైన‌ `జీరో` మూవీ పరాజయం తరువాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. వాస్తవానికి ఎస్.‌ఆర్.‌కెకు గత ఐదేళ్లలో సరైన బ్లాక్ బస్టర్ లు లేవు. అతను ‘జీరో’ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఊహించ‌ని రీతిలో నిరాశే ఎదురైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫ‌ల‌మైంది. ఇది ఖాన్ ని ఒక రేంజులోనే కలవరపెట్టింది. 2018 త‌ర్వాత సుదీర్ఘ‌ విరామం త‌ప్ప‌లేదు. 2019 లో అతను ఒక్క‌ చిత్రానికీ సంతకం చేయకుండా వేచి చూశాడంటే అర్థం చేసుకోవాలి. ఈ రెండేళ్ల‌లో ఒక్క విడుదల కూడా లేదు. అదే దృశ్యం 2020 లోనూ రిపీట‌వుతోంది. ఈ గ్యాప్ ‌లో.. షారూక్ దాదాపు 20 స్క్రిప్ట్ లను తిరస్కరించార‌ట‌. కింగ్ ఖాన్ అభిమానులు మాత్రం కొత్త ప్రాజెక్టుపై ఒక ప్రకటన చేస్తారని ఆతృతగా ఎదురు చూశారు. షారూక్ తన త‌దుప‌రి సినిమాల గురించి ఎలాంటి హ‌డావుడి చేయ‌కుండా సైలెంట్ గా ప‌ని పూర్తి చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మునుపటిలా కాకుండా.. ఈసారి నిశ్శబ్దంగా ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక చిత్రానికి సంతకం చేసేశాడు. ఈ చిత్రానికి ‘పఠాన్’ అని టైటిల్ ని నిర్ణ‌యించారు. ఇది యాక్షన్ ఎంటర్ టైనర్.

బుధవారం నాడు ఈ చిత్రం షూటింగ్ ముంబైలో ప్రసిద్ధ యష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో ప్రారంభమైంది. దీని గురించి తెలుసుకున్న SRK అభిమానులు పెద్ద సంఖ్యలో ఫిల్మ్ స్టూడియో చుట్టూ గుమిగూడారు. అతను స్టూడియోలోకి ప్రవేశించిన చిత్రాలు వైరల్ అయ్యాయి. ఇప్ప‌టికే # ప‌ఠాన్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ‘పఠాన్’ లో దీపికా పదుకొనే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. జాన్ అబ్రహం నెగెటివ్ రోల్ పోషిస్తున్నార‌ని స‌మాచారం. కింగ్ ఖాన్ కి ఇక‌నైనా స‌రైన విజ‌యం ద‌క్కేనా? అన్న‌ది వేచి చూడాలి.