Begin typing your search above and press return to search.

ప‌ఠాన్ కి సెగ‌.. క‌ల్చ‌ర్ విధ్వంశం అంటూ పోస్ట‌ర్ల‌ను త‌గుల‌బెట్టారు!

By:  Tupaki Desk   |   15 Dec 2022 10:32 AM GMT
ప‌ఠాన్ కి సెగ‌.. క‌ల్చ‌ర్ విధ్వంశం అంటూ పోస్ట‌ర్ల‌ను త‌గుల‌బెట్టారు!
X
ఇటీవ‌లి కాలంలో మ‌నోభావాల పేరుతో సినీప‌రిశ్ర‌మ‌ల‌పై వేధింపులు పెరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్ పై ఇలాంటి దాడులు రాజ‌కీయ రంగును పులుముకోవ‌డం భ‌య‌కంపితుల‌ను చేస్తోంది. ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ ని ఈ సెగ తాకింది. ఉత్త‌రాది రాష్ట్రంలోని ప్ర‌ధాన న‌గ‌రం ఇండోర్ లో 'బ్యాన్ పఠాన్' పిలుపులు ఎక్కువయ్యాయి. నిరసనకారులు షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వీర్ శివాజీ గ్రూప్ కార్యకర్తలు 'పఠాన్'కు వ్యతిరేకంగా ఇండోర్ వీధుల్లోకి వచ్చి చిత్ర‌క‌థానాయ‌కుడు షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేయ‌డ‌మే గాక‌... వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేసారు.

ఇటీవ‌లే విడుద‌లైన‌ 'బేషారం రంగ్' పాటలోని కంటెంట్ హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసిందని నిరసనకారులు ఆరోపించారు. తాజా ఆరోప‌ణ‌ల‌తో ఈ పాట సందిగ్ధంలో పడింది. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సహా పలువురు పాటలో దీపిక ధ‌రించిన‌ దుస్తులకు రంగులు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎంపీలో పఠాన్ పై నిషేధం?

అంతకుముందు రోజు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా 'పఠాన్' పాటలో దీపిక‌ పదుకొనే వేషధారణపై తీవ్ర‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పదుకొణె - షారూఖ్ ఖాన్ వేషధారణపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని 'సరిదిద్దాలని' పిలుపునిచ్చారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకుంటే సినిమాపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. అంతకుముందు సంస్కృతి బచావో మంచ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ కూడా 'బేషరమ్ రంగ్' పాటపై నిరసన వ్యక్తం చేశారు. అతని బృందంలోని సభ్యులు ప్రధాన తార‌లపై నిరసన వ్యక్తం చేశారు. బేషరం రంగ్ పాట‌లో దీపిక పొట్టి దుస్తులు ఎక్స్ పోజింగ్ పై సాంస్కృతిక వాదులు తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు.

చంద్రశేఖర్ తివారీ మాట్లాడుతూ, ''ఇది మా కాషాయ వేషం.. దీనిని సంస్కృతి బచావో మంచ్ సహించదు. షారుక్ ఖాన్,... హిందువులు మీ చిత్రాన్ని బహిష్కరించడం ప్రారంభించినప్పుడు మీకు వైష్ణో దేవి గుర్తుకు వచ్చింది. మీ చిత్రం విడుదలకు ముందు మీరు వైష్ణోదేవి గుడికి వెళుతున్నారు. మీరు హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలి.

భారతదేశ ప్రజలు మిమ్మల్ని సూపర్ స్టార్ గా మార్చారు కాబట్టి ఈ చిత్రం నుండి పాటను తొలగించాలి. షారుక్ ఖాన్ మీరు ఎల్లప్పుడూ ఇలాంటి పనులు చేస్తూ మీ ఇమేజ్ ను ఎందుకు దిగజార్చుకుంటున్నారు? మీరు సనాతన ధర్మాన్ని నమ్మే వారందరికీ క్షమాపణలు చెప్పాలి'' అని వ్యాఖ్యానించారు. 'పఠాన్‌'ను చూడటానికి డబ్బు ఇవ్వడం కంటే ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడం మంచిద‌ని ఇటీవ‌ల‌ షారూఖ్ ఖాన్- దీపికపై మండిప‌డుతూ బీజేపీ ఎమ్మెల్యే దూషించ‌డం మ‌రో కొస‌మెరుపు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్ష‌న్ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిందిజ‌ ఈ చిత్రంలో జాన్ అబ్రహం ఓ కీల‌క పాత్ర‌లో నటించారు. పఠాన్ జనవరి 25న హిందీ- తమిళం- తెలుగు భాషల్లో విడుదల కానుంది. కింగ్ ఖాన్ అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తుండ‌గా తాజా వివాదాలు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. మ‌రోవైపు ఈ సినిమాని ఎలా అయినా ఫ్లాప్ చేయాల‌ని వివాదాస్ప‌ద క్రిటిక్ కేఆర్కే చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.