Begin typing your search above and press return to search.

‘జెర్సీ’ ఫస్ట్ సింగిల్: భావోద్వేగాలు కలబోసిన స్ఫూర్తిదాయక గీతం..!

By:  Tupaki Desk   |   2 Dec 2021 1:32 PM GMT
‘జెర్సీ’ ఫస్ట్ సింగిల్: భావోద్వేగాలు కలబోసిన స్ఫూర్తిదాయక గీతం..!
X
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కీలక పాత్రలో రూపొందిన హిందీ చిత్రం ''జెర్సీ''. తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రానికి ఇది రీమేక్. మాతృకను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాతో బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సినిమాలోని 'మెహ్రమ్' అనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు.

'మెహ్రమ్ తూహీ హే మేరా' అంటూ సాగిన ఈ పాటలో క్రికెట్లో తన కెరీర్ ను తిరిగి ప్రారంభించాలనుకునే 36 ఏళ్ల షాహిద్ కపూర్ పోరాటాన్ని స్ట్రగుల్ ని చూపించారు. కొత్త అవకాశాలు యువకులకు ఇవ్వాలి కానీ.. 36 ఏళ్ల వ్యక్తికి కాదు అనే వాయిస్ ఓవర్ తో ఈ పాట స్టార్ట్ అవుతుంది. ఆటలో జీవితంలో ఓడిపోయాననే గందరగోళ పరిస్థితుల్లో ఉన్న హీరో.. వాటిని అధిగమించడం క్రికెట్ ప్రాక్టీస్ చేయడం వంటివి ఈ పాత్రలో చూపించారు.

'మెహ్రమ్' పాటకు సచేత్-పరంపర స్వరాలు సమకూర్చారు. సచేత్ టాండన్ ఆలపించిన ఈ గీతానికి షెల్లీ సాహిత్యం అందించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

కాగా, క్రికెటర్ గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి.. 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే కథాంశంతో 'జెర్సీ' సినిమా రూపొందుతోంది. ఇందులో షాహిద్ కపూర్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. షాహిద్ తండ్రి పంకజ్ కపూర్ కీలక పాత్ర పొషించారు.

'జెర్సీ' చిత్రాన్ని అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - బ్రాట్ ప్రొడక్షన్స్ సంస్థలు రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించారు. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరించారు. 'జెర్సీ' ఒరిజినల్ వెర్షన్ 'ఉత్తమ తెలుగు చిత్రం' మరియు 'ఉత్తమ ఎడిటర్' విభాగాల్లో రెండు జాతీయ అవార్డులను అందుకుంది. మరి హిందీ జెర్సీ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.