Begin typing your search above and press return to search.

ఆల‌స్య‌మేన‌ని నాక్కూడా తెలుసు కానీ..

By:  Tupaki Desk   |   3 March 2022 2:30 AM GMT
ఆల‌స్య‌మేన‌ని నాక్కూడా తెలుసు కానీ..
X
బాలీవుడ్ బాద్ షాగా పేరున్న షారుక్ ఖాన్ నుంచి సినిమా వ‌చ్చి చాలా కాల‌మే అవుతోంది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన షారుక్ దాదాపు మూడేళ్లు గా సినిమాల‌కు దూరంగా వుంటున్నారు. ఆయ‌న న‌టించిన చిత్రం `జీరో`. 2018లో ప్రేక్ష‌కుల ముందుకుకొచ్చిన ఈ చిత్రం ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది.

దీంతో మారిన ప్రేక్ష‌కుల అభిరుచికి అనుగుణంగా ఎలాంటి చిత్రాలు చేయాలా? అని షారుక్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. 1992లో దివ్య‌భార‌తి, రిషి క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన `దీవానా` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన షారుక్ దాదాపు మూడు దాశాబ్దాలుగా బాలీవుడ్ లో వున్నారు.

అలాంటి హీరో నుంచి సినిమా రాక‌పోవ‌డం.. మూడున్న‌రేళ్లుగా సినిమాల‌కు దూరంగా వుండ‌టంతో అభిమానులు షారుక్ ఇక సినిమాల్లో న‌టించ‌డా అని ఒక ద‌శ‌లో అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. 2018 నుంచి ఆయ‌న ఈ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నారంటే లేదు లేదు ఈ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నారంటూ వార్త‌లు షికారు చేశాయి. అయినా ఈ వార్త‌ల‌పై షారుక్ స్పందించ‌లేదు. ఎలాంటి సినిమాతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ఆలోచ‌న చేస్తూనేవున్నాడు.

ఫైన‌ల్ గా షారుక్ రీ ఎంట్రీకి సినిమా ఫిక్స్ అయింది అదే `ప‌ఠాన్‌`. సిద్ధార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌త ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం కావ‌డంతో తాజాగా చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న‌ విడుద‌ల చేస్తున్నామంటూ చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఓ వీడియోని కూడా విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ కి జోడీగా దీపికా ప‌దుకునే న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో జాన్ అబ్ర‌హం, అశుతోష్ రాణా, గౌత‌మ్ రోడ్‌, ఏక్తా కౌల్ న‌టిస్తున్నారు.

ప్ర‌త్యేక అతిథి పాత్ర‌లో స‌ల్మాన్ ఖాన్ క‌నిపించ‌నున్నారు. బుధ‌వారం సోస‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా షారుక్ ఖాన్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేశారు. `ప‌ఠాన్‌` నుంచి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియోని షేర్ చేసిన షారుక్ `ఆల‌స్య‌మేన‌ని నాక్కూడా తెలుసు..కానీ `ప‌ఠాన్‌` టైమ్ ఇప్పుడే మొద‌లైంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న థియేట‌ర్ల‌లో క‌లుద్దాం` అని ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట సంద‌డి చేస్తోంది.

యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో షారుక్ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్ తో స‌రికొత్త మేకోవ‌ర్ తో రా ఏజెంట్ సికంద‌ర్ ప‌ఠాన్ గా క‌నిపించ‌బోతున్నారు. య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీతో పాటు ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది.

https://twitter.com/OTTCINEMAUP/status/1498952382201294850?s=20&t=t98gDpYbiyEHQW_nxwVU8A