Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: '7'

By:  Tupaki Desk   |   6 Jun 2019 9:54 AM GMT
మూవీ రివ్యూ: 7
X
చిత్రం : '7'

నటీనటులు: హవీష్ - రెజీనా కసాండ్రా - అనీషా ఆంబ్రోస్ - నందిత శ్వేత - త్రిధా చౌదరి - పూజిత పొన్నాడ - రెహమాన్ తదితరులు
సంగీతం: చేతన్ భరద్వాజ్
మాటలు: మహర్షి
కథ - స్క్రీన్ ప్లే - నిర్మాణం: రమేష్ వర్మ
ఛాయాగ్రహణం - దర్శకత్వం: నిజార్ షఫి

‘నువ్విలా’ సినిమాతో పరిచయమైన హవీష్ హీరోగా నిలదొక్కుకోవడానికి అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. తొలి సినిమా తర్వాత ఇప్పటికే రెండు మూడు సార్లు అతడి రీలాంచ్ జరిగింది. ఇప్పుడు ‘7’ సినిమాతో రీలాంచ్ అయ్యాడతను. ‘భలే భలే మగాడివోయ్’.. ‘మహానుభావుడు’ లాంటి సినిమాలకు ఛాయాగ్రహణం అందించిన నిజార్ షఫి దర్శకుడిగా పరిచయమైన సినిమా ఇది. రమేష్ వర్మ స్క్రిప్టు సమకూర్చడంతో పాటు సినిమాను నిర్మించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకునేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

కార్తీక్ (హవీష్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. అతనే తమ భర్త అని.. కొన్ని రోజులుగా కనిపించడం లేదని.. ఒకరికి ముగ్గురు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. విచారణ జరిపిన పోలీసులు.. ఆ ముగ్గురు అమ్మాయిల్ని కార్తీక్ ప్రేమ పేరుతో మోసం చేశాడని నిర్ధారణకు వస్తారు. కానీ కార్తీక్ మాత్రం వాళ్లెవరో తెలియదంటాడు. ఇంతలో మరో అమ్మాయి కార్తీక్ తన భర్త అంటూ వస్తుంది. దీంతో పోలీసులు తీవ్ర అయోమయంలో పడిపోతారు. ఇంతకీ కార్తీక్ నిజంగానే ఆ అమ్మాయిల్ని మోసం చేశాడా.. లేక ఇంకెవరైనా అతడిని ఇరికించారా అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

పేపర్ మీద అద్భుతంగా.. థ్రిల్లింగ్ అనిపించే కథలన్నీ తెరమీద అంతే బాగా వస్తాయని గ్యారెంటీ లేదు. ప్రెజెంటేషన్ లో తేడా కొట్టి పూర్తిగా గాడి తప్పిన సినిమాలు చాలానే ఉన్నాయి. ‘7’ కూడా ఆ కోవలోకే చేరేదే. దర్శకుడిగా పేలవమైన ట్రాక్ రికార్డున్న రమేష్ వర్మ.. ‘క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్’ లాంటి కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది ‘7’ కోసం ఆసక్తికర లైన్ అయితే సిద్ధం చేశాడు. కానీ దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్టుగా మలచడంలో దారుణమైన తప్పులు చేశాడు. దాన్ని సినిమాటోగ్రాఫర్ టర్న్ డ్ డైరెక్టర్ నిజార్ షఫి తెరపై ఎంత పేలవంగా తీయాలో అంత పేలవంగా తీశాడు. ఎండ్ టైటిల్స్ పడ్డాక ప్రేక్షకులు ఈ సినిమానే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో చాలా ఎబ్బెట్టుగా ఫేస్ పెట్టి థియేటర్ నుంచి బయటికి వస్తే అది రచయత.. దర్శకుల వైఫల్యమే.

పైన చెప్పుకున్నట్లు ఒకట్రెండు లైన్లలో తేల్చేస్తే ‘7’ కథ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కానీ ఆ కథ లోతుల్లోకి వెళ్తే మాత్రం అది జీర్ణం కావడం చాలా కష్టం. రేపో మాపో పోయేలా కనిపించే ఒక ముసలావిడ.. యుక్త వయసులో ఉండగా తన ప్రేమను ఒప్పుకోకుండా మరో పెళ్లి చేసుకున్న వ్యక్తిని అతడి కుటుంబాన్ని హతమార్చేసి ఉంటుంది. కానీ అతడి కొడుకు బతికున్నాడని తనకు వృద్ధాప్యం వచ్చాక తెలిసి అతడిని చంపడానికి ప్లాన్ చేస్తుంది. అందుకోసం ముగ్గురు అమ్మాయిల పై తనే రేప్ అటెంప్ట్ చేయించి.. తనే వాళ్లను కాపాడి.. తిరిగి తనకు సాయం చేయడానికి సిద్ధ పడ్డ ముగ్గురు అమ్మాయిల్ని ఆ కుర్రాడి మీదికి ఉసిగొల్పుతుందట. ఆ ముగ్గురూ కలిసి హీరోను ట్రాప్ చేస్తారట. వినడానికే ఏమాత్రం నమ్మశక్యంగా లేని సీక్వెన్స్ ఇది. దీన్ని తెరపై మరీ పేలవంగా చూపించి ‘7’ సినిమాను నేరుగార్చేశాడు నిజార్ షఫి. ఒకటో రెండో డౌట్లు వస్తే.. ఎక్కడో ఒకచోట అన్ కన్విన్సింగ్ అనిపిస్తే ఓకే కానీ.. సినిమా అయ్యేసరికి కుప్పలు కుప్పలుగా సందేహాలు వచ్చి పడి.. అసలు జీర్ణం కాని విషయాలు వెంటాడుతుంటే ప్రేక్షకుడి ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పేదేముంది?

హీరో పని చేసే ఆఫీసులోనేే చేరిన ముగ్గురమ్మాయిలు.. తమను హీరో ప్రేమిస్తున్నట్లుగా వేర్వేరుగా ఒక్కో బ్యాచ్ ను నమ్మించడం అన్నది సినిమాలో అసలేమాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. సినిమాలో అత్యంత కీలకమైన ఈ ఎపిసోడే తేలిపోయింది. ఇక యుక్త వయసులో రెజీనాను చూపించి.. ఆమె వృద్ధురాలిగా చూపించాలనుకున్నపుడు మేకప్‌ తో మేనేజ్ చేసే ప్రయత్నం చేయాలి కానీ.. ఆ స్థానంలో జూనియర్ ఆర్టిస్టు స్థాయి నటిని తెచ్చి పెట్టడంతో ‘7’ అనే థ్రిల్లర్ మూవీ కాస్తా కామెడీగా తయారైపోయింది. రెజీనా స్థానంలో ఆమెను చూడటమే చాలా ఎబ్బెట్టుగా ఉంటే.. భయం భయంగా కనిపించే ఆవిడ హత్యలు చేస్తూ - కన్నింగ్ ప్లాన్లు వేస్తున్నట్లు చూపించేసరికి ‘7’ ఒక సిల్లీ ఎఫర్ట్ గా మిగిలిపోయింది. ఇది చాలదన్నట్లు హీరో పాత్రలో హవీష్ నట విన్యాసాలు ‘7’లో సీరియస్ నెస్ ను మరింత తగ్గించేశాయి. ప్రథమార్ధంలో సస్పెన్స్ మెయింటైన్ చేయడం.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు నిజార్ కొంత వరకు ఎంగేజ్ చేయగలిగాడు. మిగతా సినిమాను భరించడం చాలా కష్టమే. కాస్తయినా నమ్మశక్యం కాని అంశాల వల్ల ‘7’ పూర్తిగా నీరుగారిపోయింది. రెండు గంటల లోపు నిడివి ఉన్నా కూడా ఈ సినిమా బాగా ఫ్రస్టేట్ చేస్తుంది.

నటీనటులు:

హవీష్ ను ఏ ధైర్యంతో ‘7’ సినిమాలో హీరోగా పెట్టుకున్నారో అర్థం కాదు. రవిబాబు దర్శకత్వంలో నటించిన ‘నువ్విలా’లో పర్వాలేదనిపించిన హవీష్.. సినిమా సినిమాకూ నటనలో కిందికి దిగిపోతున్నాడు. ‘7’లో అతడి హావభావాలు.. డైలాగ్ డెలివరీ హారిబుల్ అంటే హారిబుల్. ప్రధాన పాత్రలో అతను కనిపించడం వల్లే అసలు సినిమాలో సీరియస్ గా ఇన్ వాల్వ్ కాలేం. కీలకమైన సన్నివేశాల్లో అతను పూర్తిగా తేలిపోయాడు. హీరోయిన్లలో రెజీనా మాత్రమే తన ప్రత్యేకత చాటుకుంది. ఆమె ప్రతిభను కూడా పూర్తిగా వాడుకోలేకపోయారు. నందితా శ్వేత పర్వాలేదు. అనీషా ఆంబ్రోస్ గ్లామర్ పరంగా కొంతమేర మార్కులు వేయించుకుంది. త్రిధా చౌదరి.. పూజిత పొన్నాడ గురించి చెప్పడానికేమీ లేదు. రెహమాన్ పాత్రను ఆరంభంలో చూస్తే ‘16’ సినిమా తరహాలో ప్రత్యేకమైన పాత్రేమో అనిపిస్తుంది. కానీ మొదట్లో బిల్డప్ ఇచ్చి తర్వాత దాన్ని తేల్చేశారు. వృద్ధురాలి పాత్రలో చేసిన నటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

సాంకేతికవర్గం:

‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించడాడంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. ‘ఆర్ ఎక్స్’లో అన్నిటికంటే దిగువన ఉండే పాట స్థాయిలో కూడా ఇందులోని బెస్ట్ సాంగ్ లేదు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. దర్శకుడే సమకూర్చుకున్న ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు. రచయిత రమేష్ వర్మ ఎంచుకున్న లైన్ వరకు బాగుంది. కానీ కథా విస్తరణలో అది చెడిపోయింది. దర్శకుడిగా నిజార్ షఫి పూర్తిగా తేలిపోయాడు. ఒక్క సన్నివేశాన్ని కూడా బిగితో చెప్పలేకపోయాడు. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లేనే ప్రాణం. అందులో నిజార్ ఏమాత్రం పట్టు చూపించలేదు. నటీనటుల ఎంపికలో లోపాలు.. కథను చెప్పడంలో తడబాటు.. అనేక లూప్ హోల్స్ ఉన్న స్క్రీన్ ప్లేతో నిజార్ ‘7’ సిల్లీ మూవీగా తయారు చేశాడు.

చివరగా: 7.. తలా తోకా లేని థ్రిల్లర్

రేటింగ్-1.25/5

isclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre