Begin typing your search above and press return to search.

చిరంజీవి ఇంట్లో దొంగ‌త‌నం..మిస్ట‌రీ వీడింది!

By:  Tupaki Desk   |   7 Nov 2017 11:32 AM GMT
చిరంజీవి ఇంట్లో దొంగ‌త‌నం..మిస్ట‌రీ వీడింది!
X

జూబ్లీహిల్స్ లో ఉన్న చిరంజీవి ఇంట్లో నుంచి దాదాపు రూ. 10 లక్షల నగదు దొంగ‌త‌నానికి గురైన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి ఇంట్లో ప‌ని మ‌నిషి చెన్న‌య్య ఈ దొంగ‌త‌నం చేశాడ‌ని అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. చిరంజీవి మేనేజ‌ర్ గంగాధ‌ర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చెన్న‌య్య‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ జ‌ర‌ప‌గా విస్తుపోయే వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇంటి దొంగ ను ఈశ్వ‌రుడైనా ప‌ట్ట‌లేడు...అన్న‌ సామెత‌ను చెన్న‌య్య‌ నిజం చేశాడు. అంద‌రూ అనుకున్న‌ట్లుగానే ఆ ఇంటిదొంగ చెన్న‌య్యేన‌ని పోలీసులు నిర్ధారించారు. ఆ ఇంట్లో 10 సంవ‌త్స‌రాలుగా ప‌ని చేస్తున్న చెన్న‌య్య దుర్భుద్ధితో విడ‌త‌ల వారీగా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డ్డాడ‌ని వారు తెలిపారు. గ‌త రెండు నెల‌ల కాలంలో చెన్న‌య్య దాదాపు రూ.16 ల‌క్ష‌ల డ‌బ్బును దొంగిలించిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఆ సొమ్ముతో చెన్న‌య్య న‌గ‌ర శివార్ల‌లో స్థ‌లాన్ని కొనుగోలు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచార‌ణ‌లో చెన్న‌య్య త‌న నేరాన్ని అంగీక‌రించాడు.

చిరంజీవి ఇంట్లో చెన్న‌య్య 10 సంవ‌త్స‌రాలుగా ప‌ని చేస్తున్నాడు. ఆ ఇంట్లో అణువ‌ణువు చెన్న‌య్య‌కు తెలుసు. డ‌బ్బు, విలువైన వ‌స్తువులు ఎక్క‌డెక్క‌డ దాచిపెడ‌తారన్న సంగ‌తి అత‌డికి బాగా తెలుసు. త‌న‌పై ఆ కుటుంబం ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేసిన చెన్న‌య్య దుర్బుద్ధితో దొంగ‌త‌నం చేయడం ప్రారంభించాడు. రెండు నెల‌ల‌కాలంలో దాదాపు 16 ల‌క్ష‌ల‌కు దొంగిలించాడు. చివ‌ర‌గా చెన్న‌య్య ఒకేసారి రూ.2 ల‌క్ష‌ల రూపాయ‌లు దొంగ‌త‌నం చేయ‌డంతో చిరు కుటుంబ స‌భ్యుల‌కు చెన్న‌య్య‌పై అనుమానం వ‌చ్చింది. దీంతో, చిరు మేనేజ‌ర్ గంగాధ‌ర్ జూబ్లీహిల్స్ పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చాడు. విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు చెన్న‌య్య‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ జ‌రిపారు. పోలీసులు త‌మ‌దైన శైలిలో విచార‌ణ జ‌ర‌ప‌డంతో చెన్న‌య్య దొంగ‌త‌నం చేసిన‌ట్లు అంగీక‌రించాడు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్రత ఉన్న‌ప్ప‌టికీ త‌మ ఇంట్లో దొంగ‌త‌నం జ‌ర‌గ‌డం, ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్న ప‌నిమ‌నిషి చెన్న‌య్య దొంగ‌త‌నానికి పాల్ప‌డ‌డంతో చిరు ఫ్యామిలీ షాక్ కు గురయ్యారని తెలుస్తోంది.