Begin typing your search above and press return to search.

ది గ్రేట్'కి సీక్వెల్?

By:  Tupaki Desk   |   17 Jan 2021 3:30 AM GMT
ది గ్రేట్కి సీక్వెల్?
X
రవితేజ హిట్ కొట్టేశాడు .. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ, తన కెరియర్లోనే చెప్పుకోదగిన హిట్ పట్టేశాడు. చాలా కాలంగా రవితేజ వరుస ఫ్లాపులతో ఉక్కిటిబిక్కిరి అవుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి 'క్రాక్' సినిమా వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, సంక్రాంతికి థియేటర్లకు వచ్చింది. థియేటర్లకు జనం వస్తారో లేదో తెలియని ఒక సందిగ్ధంలో ఈ సినిమా విడుదలైంది. దర్శక నిర్మాతలు ధైర్యం చేసి ఈ సినిమాను బరిలోకి దింపినందుకు తగిన ప్రతిఫలం లభించింది.

రవితేజ నుంచి అసలు సిసలైన మాస్ మసాలా మూవీ వచ్చినందుకు ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయన నుంచి ఈ తరహా సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రవితేజ, అనిల్ రావిపూడి టచ్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. తెలుగులో వరుస హిట్లు ఇస్తూ వస్తున్న యువ దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి ఒకరుగా కనిపిస్తాడు. ఇంతకుముందు ఆయన రవితేజతో 'రాజా ది గ్రేట్' చేశాడు. అప్పటివరకూ ఫ్లాపులతో విసిగెత్తి ఉన్న రవితేజకు ఈ సినిమా ఎంతో ఊరటను ఇచ్చింది. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన హిట్ గా నిలిచింది.

అందువలన తమ కాంబినేషన్లో మరో సినిమా చేద్దామనే విషయాన్ని రవితేజ ప్రస్తావించగా, అందుకు అనిల్ రావిపూడి ఆనందంగా అంగీకరించాడని అంటున్నారు. ఆల్రెడీ రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' చేయడానికి రవితేజ సిద్ధమైపోయాడు. రమేశ్ వర్మ స్టైల్ వేరు .. తన రేంజ్ కి తగిన ఎంటర్టైనర్ కావాలంటే అనిల్ రావిపూడి వల్లనే అవుతుందనే ఉద్దేశంతోనే ఆయనను రవితేజ కదిలించాడని అంటున్నారు. ప్రస్తుతం 'ఎఫ్ 2' సినిమాకి సీక్వెల్ చేస్తున్న అనిల్ రావిపూడి, రవితేజతో 'రాజా ది గ్రేట్'కి సీక్వెల్ చేస్తాడా? లేదంటే కొత్త కథతో రంగంలోకి దిగుతాడా? అనేది చూడాలి.