Begin typing your search above and press return to search.

సెన్సేషనల్ పిక్: మరికొన్ని గంటల్లో 'రోర్ ఆఫ్ RRR'..!

By:  Tupaki Desk   |   14 July 2021 8:51 AM GMT
సెన్సేషనల్ పిక్: మరికొన్ని గంటల్లో రోర్ ఆఫ్ RRR..!
X
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - ఇద్దరు హీరోల స్పెషల్ టీజర్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో క్రేజీ ప్రాజెక్ట్ నుంచి రేపు (జులై న్15) మరో సర్ప్రైజింగ్ గ్లిమ్స్ రాబోతోంది. 'రోర్‌ ఆఫ్‌ RRR' పేరుతో ఓ మేకింగ్‌ వీడియోని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర బృందం మరో పోస్టర్ ని రిలీజ్ చేస్తూ.. రేపు రాబోయే ''రోర్‌ ఆఫ్‌ RRR'' వీడియో టైమింగ్ ని గుర్తు చేసింది. ఈ పోస్టర్ లో విజనరీ డైరెక్టర్ రాజమౌళి - RRR సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ కనిపిస్తున్నారు. ఇద్దరూ సన్నివేశం గురించి డీప్ డిస్కషన్ లో ఉన్నట్లు ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది. ఎస్.ఎస్. రాజమౌళి - సెంథిల్ కుమార్ కలయిక 'సై' సినిమాతో ప్రారంభమైంది. ఆ తర్వాత 'యమదొంగ' 'మగధీర' 'ఈగ' 'ఛత్రపతి' 'బాహుబలి - ది బిగినింగ్' 'బాహుబలి - ది కంక్లూషన్' వంటి అద్భుతమైన చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న 8వ సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. ఇది కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.

ఇకపోతే మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ''రోర్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్'' సినీ అభిమానులు ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియోని టీజర్ - ట్రైలర్ లెవల్ లో ఎక్స్ ట్రార్డినరీగా.. గూస్ బమ్స్ తెప్పించేలా జక్కన్న కట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీని కోసం సెంథిల్ కుమార్ - సంగీత దర్శకుడు కీరవాణి తో కలసి రాజమౌళి స్పెషల్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ కి తోడు.. ప్రముఖ ర్యాపర్ బ్లాజే ఈ వీడియో కోసం వర్క్ చేస్తున్నట్లు సమాచారం. 'రోర్ ఆఫ్ RRR' వీడియో అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. ఏదేమైనా మేకింగ్ వీడియోకే ఈ రేంజ్ హైప్ తీసుకురావడం రాజమౌళి కే చెల్లిందని చెప్పవచ్చు.

కాగా, ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న 'ఆర్ ఆర్ ఆర్' లో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. వీరికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ - ఒలివియా మోరిష్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ - సముద్రఖని - శ్రీయ - రాహుల్ రామకృష్ణ లతో పాటుగా హాలీవుడ్ నటులు అలిసన్ డూడీ - రే స్టీవెన్‌ సన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ దర్శక రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. దీనికి సంబంధించి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. లైకా ప్రొడక్షన్స్ - పెన్ స్టూడియోస్ వంటి ప్రముఖ సంస్థలు RRR చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయనున్నాయి.