Begin typing your search above and press return to search.

మోహన్ బాబు ప్రశ్నల వర్షం.. ‘మా’ సర్వసభ్య సమావేశంలో సంచలనం

By:  Tupaki Desk   |   22 Aug 2021 12:31 PM GMT
మోహన్ బాబు ప్రశ్నల వర్షం.. ‘మా’ సర్వసభ్య సమావేశంలో సంచలనం
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ('మా') సర్వసభ్య సమావేశం ఈ రోజు (ఆదివారం) జరుగుతోంది. ఎన్నికల్ని ఎప్పుడు నిర్వహించాలనే అంశం మీద సంస్థ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన జరిగింది. కరోనా నేపథ్యంలో ఈ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఊహించని విధంగా తెర మీదకు వచ్చిన సీనియర్ నటులు మోహన్ బాబు సంచలనంగా మారారు. ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

మా కోసం గతంలో ఒక భవనం కొని అమ్మేశారని.. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఆ బిల్డింగ్ ను తక్కువ ధరకే ఎలా అమ్మేశారని సూటిగా ప్రశ్నించారు. అసోసియేషన్ భవనం అమ్మకం మీద ఎవరైనా మాట్లాడారా? అని నిలదీసిన ఆయన.. అసోసియేషన్ బిల్డింగ్ అంశం తనను ఎంతో కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 'మా' ఒక భవనాన్ని కొనుగోలు చేయటం.. దాన్ని నాగబాబు హయాంలో అమ్మేయటం తెలిసిందే. ఈ వివాదం ఈ మధ్యనే తెర మీదకు వచ్చింది.
మెగా వర్గం తరఫున ప్రకాశ్ రాజ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన వేళ.. ఆ పదవికి తాను కూడా పోటీ పడుతున్నట్లుగా మంచు విష్ణు ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే. మరో ఇద్దరు.. ముగ్గురు కూడా పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పటికు పలు మలుపులు తిరిగిన మా ఎన్నికల అంశం.. ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ లో 'మా' భవనం గురించి చర్చకు రావటం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఎన్నికల నిర్వహణపై మా సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు, మురళీమోహన్ లు మాట్లాడుతూ.. వారంలోగా ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. ఇదిలా ఉంటే.. మా అసోసియేషన్ భేటీ జరిగిన 21 రోజుల్లో ఎన్నికల్ని నిర్వహించాలని.. అయితే సెప్టెంబరు 12 కానీ 19 కానీ ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. ఇక.. ప్రస్తుతం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న నరేశ్ సైతం.. ఎన్నికల్ని ఎంత త్వరగా పెడితే అంత మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి.. క్రమశిక్షణ సంఘం 'మా' ఎన్నికల తేదీని ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.