Begin typing your search above and press return to search.

సంక్రాంతి బెర్త్ కోసం ట్రై చేస్తోన్న సీనియర్ హీరో..!

By:  Tupaki Desk   |   2 Nov 2021 10:30 AM GMT
సంక్రాంతి బెర్త్ కోసం ట్రై చేస్తోన్న సీనియర్ హీరో..!
X
2022 సంక్రాంతి సీజన్ కోసం పోటీపోటీగా కర్చీపులు వేసి పెట్టారు కానీ.. ఫైనల్ గా బరిలో ఎవరెవరు నిలుస్తారో అనే దాని మీద స్పష్టత రావడం లేదు. జనవరి 12న 'భీమ్లా నాయక్' - 13న 'సర్కారు వారి పాట' - 14న 'రాధే శ్యామ్' చిత్రాలను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో అప్పటివరకు పండక్కి రావాలని చూసిన 'ఎఫ్ 3' వెనక్కి తగ్గింది. అయితే మధ్యలో రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని జనవరి 7న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేయడంతో మిగతా చిత్రాల విడుదలలో కూడా మార్పులు చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

RRR వచ్చినా ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలసి వచ్చినా సరే పాన్ ఇండియా స్థాయిలో 'రాధే శ్యామ్' చిత్రాన్ని చెప్పిన సమయానికే రిలీజ్ చేస్తామని ప్రభాస్ ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. కాకపోతే మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల మీదే క్లారిటీ రావడం లేదు. 'సర్కారు వారి పాట' వాయిదా పడటం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'భీమ్లానాయక్' ప్రతీ అప్డేట్ మీద రిలీజ్ డేట్ మెన్షన్ చేస్తున్నా.. ఆ సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే సందేహాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ రెండు పెద్ద సినిమాల డేట్స్ మీద మరోసారి స్పష్టత వస్తే కానీ.. సంక్రాంతి పుంజులు ఏవో తేలే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సీనియర్ హీరో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ పెద్ద పండక్కి రావాలనే ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

'కల్కి' సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. ప్రస్తుతం తన కెరీర్ లో 91వ సినిమా ''శేఖర్'' షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారట. పెద్ద సినిమాల మధ్య థియేటర్లు దొరికితే పోటీకి దిగాలని రాజశేఖర్ ఆలోచిస్తున్నారట. అదే సమయంలో అక్కినేని నాగార్జున - నాగచైతన్య కలిసి నటిస్తున్న 'బంగార్రాజు' చిత్రాన్ని కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అందువల్లనే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పుడు రాజశేఖర్ కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

'శేఖర్' చిత్రాన్నిలలిత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇందులో అను సితార - ముస్కాన్ కూబ్ చాందిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ & పెగాసస్ సినీ కార్పొరేషన్ బ్యానర్స్ పై ఎంఎల్వి సత్యనారాయణ - శివాని శివాత్మిక - వెంకట శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్మీ భూపాల స్టోరీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇది మలయాళ హిట్ సినిమా 'జోసెఫ్' కు రీమేక్ అని టాక్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ ఆకట్టుకున్నాయి.