Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ గారికి ఆ మాట చెప్పాలి: సీనియర్ హీరోయిన్

By:  Tupaki Desk   |   8 Jun 2022 10:00 AM IST
త్రివిక్రమ్ గారికి ఆ మాట చెప్పాలి: సీనియర్ హీరోయిన్
X
నిన్నటితరం కథానాయికగా ఇంద్రజకి మంచి పేరు ఉంది. తెలుగు నుంచి ఆమె ఖాతాలో కొన్ని హిట్స్ ఉన్నాయి. కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె, ఆ తరువాత కొంతకాలం పాటు సినిమాలకి దూరంగా ఉన్నారు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. తన ఇమేజ్ కి తగిన పాత్రలు వస్తే చేస్తూ వెళుతున్నారు. ఒక వైపున ఆమె సినిమాలు చేస్తూనే .. టీవీ షోస్ లోను సందడి చేస్తున్నారు. అలా ప్రేక్షకులకు ఆమె అందుబాటులో ఉన్నారు. తాజా  ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ 'ఖలేజా' సినిమాను గురించి ప్రస్తావించారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో 'ఖలేజా' ఒకటి. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'అతడు' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. 2005లో వచ్చిన ఈ సినిమా మహేశ్ బాబు కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఆ సినిమా తరువాత కొంతకాలానికి .. అంటే 2010లో 'ఖలేజా' సినిమా వచ్చింది. ఈ సినిమాను తన మార్క్ కి భిన్నంగా త్రివిక్రమ్ తెరకెక్కించారు. కథలో ఏ అంశాన్ని తీసుకున్నా అది త్రివిక్రమ్ మార్కుకి దూరంగా ఉంటుంది. మహేశ్ బాబును దేవుడిగా చూపించడమనే పాయింట్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.

అందువలన ఆ సినిమా అంతగా ఆడలేదు. 'అతడు'లాంటి హిట్ వచ్చిన ఈ కాంబినేషన్లోనే భారీ ఫ్లాప్ పడింది. అలాంటి సినిమాను గురించి  తాజా ఇంటర్వ్యూలో ఇంద్రజ ప్రస్తావించింది. ఆమె మాట్లాడుతూ .. త్రివిక్రమ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుంది. ఇలా ఒక విషయాన్ని చెప్పడం .. చూపించడం ఆయనకి మాత్రమే సాధ్యమని అనిపిస్తుంది. 'ఖలేజా' సినిమా ద్వారా త్రివిక్రమ్ గారు ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు అని చెప్పారు. 'అహం బ్రహ్మాస్మి' అనేది నాకు బాగా నచ్చింది. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది.

ఆ సినిమా నాకు బాగా నచ్చిందనే విషయాన్నే నేను త్రివిక్రమ్ గారికి చెప్పాలనుకుంటున్నాను. ''సార్ .. ఈ సినిమా ఎందుకు ఆడలేదో తెలియదు .. కానీ నాకు మాత్రం చాలా ఇష్టం. నా దృష్టిలో మాత్రం అది చాలా వండర్ఫుల్ సినిమా అనేసి చెప్పాలని ఉంది" అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది. కానీ ఎప్పుడో పుష్కర కాలం క్రితం విడుదలైన ఈ సినిమాను గురించి ఇంద్రజ ఇప్పుడు త్రివిక్రమ్ కి చెప్పాలనుకోవడమే చిత్రంగా అనిపిస్తోంది. ఆల్రెడీ త్రివిక్రమ్  - మహేశ్ బాబు కాంబినేషన్లో మరో సినిమా కూడా సెట్స్ పైకి వెళుతోందాయే!