Begin typing your search above and press return to search.

శ్రీ‌రెడ్డి లాంటోళ్ల‌ను వంద‌మందిని తెస్తానంది!

By:  Tupaki Desk   |   10 April 2018 4:00 PM IST
శ్రీ‌రెడ్డి లాంటోళ్ల‌ను వంద‌మందిని తెస్తానంది!
X
గ‌డిచిన కొద్ది రోజులుగా టాలీవుడ్ న‌టి శ్రీ‌రెడ్డి ఇష్యూ తెలుగు మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ ఎంత హాట్ టాపిక్ గా మారిందో తెలిసిందే. ప్రింట్ మీడియాలో శ్రీ‌రెడ్డికి ఇస్తున్న ప్రాధాన్య‌త త‌క్కువే కానీ.. టీవీ ఛాన‌ళ్ల‌లో అయితే గంట‌ల కొద్దీ ఆమె ఇంట‌ర్వ్యూల‌తోనే బండి లాగిస్తున్న ఛానళ్లు క‌నిపిస్తాయి.

త‌న‌కు జ‌రిగిన అన్యాయం మీద ఇప్ప‌టికే గ‌ళం విప్పిన ఆమె.. మా స‌భ్య‌త్వం కోసం అర్థ‌న‌గ్నంగా మారిన వైనంపై సినీ ప్ర‌ముఖులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం.. ఆమెకు మా అసోసియేష‌న్ లో స‌భ్య‌త్వం ఇవ్వ‌మ‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. శ్రీ‌రెడ్డితో న‌టిస్తే వెలి వేస్తామ‌నే ఫ‌త్వాను జారీ చేయ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే శ్రీ‌రెడ్డి చాలా రిచ్ అంటూ మ‌రికొంద‌రు న‌టీమ‌ణులు ఆమెపై ఆరోప‌ణ‌లు చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. శ్రీ‌రెడ్డిపై ఓపెన్ గా మండిప‌డే క‌రాటే క‌ల్యాణి.. తాజాగా ఒక టీవీ ఛాన‌ల్ చ‌ర్చ‌లో మాట్లాడుతూ.. ఆమె చాలా సంప‌న్నురాల‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డి 144 ఎక‌రాల రియ‌ల్ ఎస్టేట్ వెంచర్ చేస్తోంద‌ని.. ఆడి.. వెర్నా కార్లు ఆమెకు ఉన్నాయ‌ని చెప్పారు.

కోటిన్న‌ర రూపాయిలు ఖ‌రీదు చేసే అపార్ట్ మెంట్ లో ఆమె ఉంటుద‌ని ఆరోపించారు. మ‌రి.. వీటికి సాక్ష్యాలు ఉన్నాయా? అంటే.. సేక‌రిస్తున్నామంటూ చెప్పిన ఆట‌లు చూస్తే.. శ్రీ‌రెడ్డి మీద కొత్త త‌ర‌హా దాడి షురూ అయ్యింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. శ్రీ‌రెడ్డితో న‌టిస్తే వెలి వేస్తామన్న ఫ‌త్వాపై మ‌హిళా సంఘాల వారు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నాయి. వారెలా డిసైడ్ చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

తాజాగా శ్రీ‌రెడ్డికి మ‌ద్ద‌తు తెలిపేలా మ‌రో చిన్న న‌టి అపూర్వ వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రిని అడిగి శ్రీ‌రెడ్డి మీద ఫ‌త్వా జారీ చేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇండ‌స్ట్రీలో వంద‌లాది మంది చిన్న చిన్న అమ్మాయిలు టాలీవుడ్ లో బాధితులుగా ఉన్నార‌న్నారు. కో డైరెక్ట‌ర్లు.. మేనేజ‌ర్లు ప‌లువురు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ప‌లువురు అమ్మాయిల్ని వాడేస్తుంటార‌ని అపూర్వ పేర్కొన్నారు. కావాలంటే తాను వంద మంది శ్రీ‌రెడ్డి లాంటి బాధిత అమ్మాయిల్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాన‌న్నారు. నిన్న‌టి వ‌ర‌కూ శ్రీ‌రెడ్డి ఒక్క‌రే ఇండ‌స్ట్రీ మీద ఫైట్ చేస్తున్నార‌నుకుంటే.. అపూర్వ లాంటి చిన్న చిన్న న‌టీమ‌ణులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తే సినీ పెద్ద‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి మొద‌లైన‌ట్లేనేమో?