Begin typing your search above and press return to search.

ఒక్క నటుడు.. 94 రేప్ సీన్లు!

By:  Tupaki Desk   |   30 Dec 2022 2:30 AM GMT
ఒక్క నటుడు.. 94 రేప్ సీన్లు!
X
ఇటీవలే హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు సీనియర్ నటుడు చలపతిరావు. ఆరోగ్యంగా ఉంటూ సినిమాల్లో కూడా నటిస్తున్న చలపతిరావు ఇలా హఠాత్తుగా కన్నుమూయడం టాలీవుడ్‌కు పెద్ద షాక్. నటుడిగా అనేక రకాల పాత్రలతో ఆయన ఆకట్టుకున్నారు. ఐతే ఆయన విలనీ అందులో ప్రత్యేకం. టాలీవుడ్ ఎంతోమంది విలన్లను చూసింది.

అందులో చలపతి రావు చాలా భిన్నం. ఆయన తన కెరీర్లో ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలు చేసింది తక్కువ. ఎక్కువగా విలన్ దగ్గర పని చేసే అసిస్టెంట్ రౌడీ పాత్రలే చేసేవారు. ఆ పాత్ర ప్రత్యేకత ఏంటంటే.. హీరోయిన్లు లేదా హీరో చెల్లెలి పాత్రలను రేప్ చేయడం.

పదో ఇరవయ్యో కాదు.. ఏకంగా 94 రేప్ సీన్లు చేశారంటే చలపతిరావు ఆ సీన్లకు ఎలా పేరుపడ్డారో అర్థం చేసుకోవచ్చు. 70, 80 దశకాల్లో ఏ సినిమాలో రేప్ సీన్ పెట్టాలని ఆలోచన వచ్చినా ఆటోమేటిగ్గా చలపతిరావుకు వేషం ఫిక్స్ అయిపోయేది. రేప్ సీన్‌లో కర్కశత్వాన్ని పండించడంలో ఆయన్ని మించిన వారు లేరనే పేరుండేది.

చలపతిరావును బయట చూసిన ఆడవాళ్లు ఎక్కడ రేప్ చేస్తాడో భయపడే స్థాయిలో ఆయనకు రేప్ స్పెషలిస్టుగా పేరు పడిపోయింది. హీరోయిన్లు సైతం ఆయన్ని చూసి భయపడేవారట. ఈ రేప్ సీన్ల అనుభవం గురించి చలపతిరావు ఓ సందర్భంలో మాట్లాడారు. ‘‘నేను హీరోగా ‘కథానాయకుడు’ అనే సినిమా మొదలైనట్లే మొదలై ఆగిపోయింది. తర్వాత హీరో వేషాలు రాలేదు. విలన్ వేషాలు వేద్దామంటే సత్యనారాయణ, త్యాగరాజు లాంటి పేరుమోసిన విలన్లున్నారు. అలాంటి టైంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫిక్సయిపోయా.

అన్ని రకాల పాత్రలూ చేయాలనుకున్నా. రౌడీ పాత్రలు చేసినపుడల్లా రేప్ సీన్లు చేయాల్సి వచ్చేది. నా కెరీర్లో 94 రేప్ సీన్లు చేశా. కానీ రేప్ సీన్లు చేయడం అంత సులువు కాదు. నేను కూడా చాలా ఇబ్బంది పడుతూనే ఆ సీన్లు చేసేవాడిని. నాతో రేప్ సీన్లు చేసిన హీరోయిన్లు చాలామంది పెద్ద రేంజికి వెళ్లారు. నా భార్యకు ఓ సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం తర్వాత రేప్ సీన్లు చేయడం మానేశా. ఇంకో ఆరు రేప్ సీన్లు చేసి వంద రేప్‌ల రికార్డును పూర్తి చేయాలనుకున్నా కానీ.. కుదర్లేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.