Begin typing your search above and press return to search.

సేనాపతి: థియేటర్లలో పడాల్సిన బొమ్మ

By:  Tupaki Desk   |   10 Jan 2022 2:30 AM GMT
సేనాపతి: థియేటర్లలో పడాల్సిన బొమ్మ
X
ఓటీటీల్లో కొత్త సినిమాలకు బాగా అలవాటు పడ్డారు మన ప్రేక్షకులు. ఐతే కొన్ని చిత్రాలను థియేటర్లలో చూసినపుడు.. ఇది ఓటీటీకైతే బాగుండేది అన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే కొన్ని సినిమాలను ఓటీటీల్లో చూసినపుడు.. ఇది థియేటర్లలో రిలీజవ్వాల్సిన సినిమా కదా అన్న ఫీలింగ్ వస్తుంది. తాజాగా 'ఆహా' ఓటీటీలో నేరుగా రిలీజైన 'సేనాపతి' సినిమా రెండో కోవకు చెందిన చిత్రమే. '8 తొట్టకల్' అనే తమిళ చిత్రం ఆధారంగా యువ దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన చిత్రమిది. ఇందులో సేనాపతిగా లీడ్ రోల్ చేసింది సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కావడం విశేషం. 'మత్తు వదలరా'లో హీరో ఫ్రెండుగా నెగెటివ్ రోల్‌లో ఆకట్టుకున్న అగస్త్య కీలక పాత్ర పోషించాడు.

చేయని నేరానికి చిన్నతనంలో జులై శిక్ష అనుభవించిన కుర్రాడు.. తనకు ప్రోత్సాహం అందించిన జైలర్ అండతో పోలీస్ అయి.. ఐపీఎస్ కావాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తుండగా తన సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకోవడం.. ఆ తర్వాత ఆ రివాల్వర్ వల్ల వరుసగా నేరాలు జరిగి కొందరి ప్రాణాలు పోవడం.. దీంతో తన ఉద్యోగం, భవిష్యత్ ప్రమాదంలో పడి ఆ రివాల్వర్ కోసం ఆ యంగ్ ఎస్ఐ వెతుకులాట ప్రారంభించడం.. ఇలా మొదలయ్యే కథ ఇది. ఈ రివాల్వర్ ఒక మధ్య వయస్కుడి చేతికి చిక్కడం.. దాంతో అతను ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని బ్యాంకు దోపిడీ చేయడం.. ఈ క్రమంలో కొందరి ప్రాణాలు తీయడం జరుగుతుంది. మరి ఆ ఎస్ఐ ఈ మధ్య వయస్కుడిని పట్టుకోగలిగాడా.. ఆ వ్యక్తి నేపథ్యం ఏంటి... అతనెందుకిలా చేస్తున్నాడన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

ఇది రీమేక్ మూవీ అయినప్పటికీ.. హైదరాబాద్ నేటివిటీకి తగ్గట్లుగా కథాకథనాల్ని, కొంత మార్చి.. ఆసక్తికరంగానే సినిమాను నడిపించాడు పవన్ సాధినేని. మరీ ఉత్కంఠభరితంగా ఉందని అనలేం కానీ.. ఆద్యంతం ఆసక్తికరంగానే సాగుతుంది. రాజేంద్ర ప్రసాద్ పాత్ర, ఆయన నటన సినిమాకు మేజర్ హైలైట్. ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ.. ఏ రసాన్నయినా ఎంత బాగా పండిస్తారో ఈ చిత్రం తెలియజేస్తుంది. ఒక సన్నివేశంలో సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా పండించారో మాటల్లో చెప్పలేం. ఆ సన్నివేశం చూస్తేనే అర్థమవుతంది. అదే సమయంలో రౌద్ర రసాన్నీ అంత బాగా పండించారు. పాత్ర తాలూకు ఇంటెన్సిటీని భలేగా క్యారీ చేశారు. అగస్త్య, మిగతా ఆర్టిస్లు కూడా బాగా చేశారు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పరిమిత వనరుల్లోనే మంచి క్వాలిటీ చూపించారు. క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి 'సేనాపతి' బాగా నచ్చుతుంది. అలాగని నెట్ ఫ్లిక్స్, ప్రైమ్‌లో వచ్చే హాలీవుడ్ థ్రిల్లర్ రేంజిలో ఊహించుకోకండి.