Begin typing your search above and press return to search.

చివరివరకూ నన్ను బాగా టెన్షన్ పెట్టేసిన సినిమా ఇదే: శేఖర్ కమ్ముల

By:  Tupaki Desk   |   29 Sep 2021 5:30 AM GMT
చివరివరకూ నన్ను బాగా టెన్షన్ పెట్టేసిన సినిమా ఇదే: శేఖర్ కమ్ముల
X
నాగచైతన్య .. సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ ' సినిమా తెరకెక్కింది. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు ఈ ప్రేమకథా చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. నాగార్జున ముఖ్య అతిథిగా హాజరైన ఈ సినిమా వేడుకలో శేఖర్ కమ్ముల మాట్లాడాడు.

"నిజంగా ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున నాకు చాలా నెర్వస్ గా ఉంది. ఇప్పుడు కాస్త రిలీఫ్ గా .. కూల్ గా ఉంది. ఇంతవరకూ నేను ఏ సినిమాకి కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఈ సినిమాలో రెండు సెన్సిటివ్ ఇష్యూస్ ను గురించి చెప్పాను. ఆ విషయాలను బ్యాలెన్స్ చేస్తూ రాయడం .. ఒప్పించడం కష్టమైన విషయం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు జనం పెద్దగా వస్తారో లేదో అనే టెన్షన్ ఉండేది. వాటన్నింటినీ ఈ సినిమా అధిగమించింది. షూటింగు సమయంలోను .. రిలీజ్ సమయంలోను కరోనా అడ్డుపడింది. వాటిని కూడా దాటుకుని వచ్చాము.

ఈ సినిమాను థియేటర్లలోనే చేయాలనే నిర్ణయంపై నిర్మాతలు బలంగా నిలబడ్డారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా విషయంలో నాగచైతన్య .. సాయిపల్లవి ఇద్దరూ కూడా ఎంతో సహకరించారు. టెక్నీషియన్స్ ఎంతో అంకితభావంతో పని చేశారు. పవన్ సీహెచ్ సంగీతం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది. చిరంజీవిగారు ఇండస్ట్రీకి పెద్దగా ఎలా నిలబడ్డారో .. అలాగే మా సినిమాకి కూడా పెద్దగా నిలబడ్డారు.

సక్సెస్ మీట్ కి వచ్చిన నాగార్జున గారికి .. సురేశ్ బాబు గారికి నేను చాలా థ్యాంక్స్ చెబుతున్నాను.

నా డైరెక్షన్ టీమ్ పడిన కష్టం ఈ సినిమా సక్సెస్ కి కారణమని నేను భావిస్తున్నాను. దేవయాని .. ఈశ్వరీరావు .. చాలా బాగా చేశారు. వాళ్ల సీన్స్ కి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుండటం నేను చూశాను. సుద్దాల అశోక్ తేజ .. భాస్కర భట్ల గారి పాటలు సినిమాలో చాలా హెల్ప్ అయ్యాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి మంచి మార్కులు పడుతున్నాయి.

ఈ సినిమాకి సంబంధించిన చాలా సన్నివేశాలను నిజామాబాద్ జిలా 'పిప్రీ'లో చిత్రీకరించాము. అక్కడ మాకు ఏది కావాలన్నా ఆ గ్రామస్తులు వెంటనే ఏర్పాటు చేశారు. పసుపు నుంచి ట్రాక్టర్ వరకూ ఏది అడిగినా వెంటనే ఇచ్చారు. షూటింగు కోసం వాళ్ల ఇళ్లు ఇచ్చేసి, మేము షూటింగు చేస్తూ ఉంటే బయటికిపోయి కూర్చున్నారు. ఇక్కడికి వాళ్లు వచ్చారు .. మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఇంతమంది సహాయ సహకారాలు .. ప్రేక్షకుల ఆదరణ ఉండటం వల్లనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించింది" అని చెప్పుకొచ్చారు.