Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: స్కామ్ స్ట‌ర్స్ ని హీరోల్ని చేస్తున్నారు!

By:  Tupaki Desk   |   24 Nov 2020 4:00 PM IST
ట్రెండీ టాక్‌: స్కామ్ స్ట‌ర్స్ ని హీరోల్ని చేస్తున్నారు!
X
మంచో చెడో ..ఏదైతేనేం అది సెన్సేష‌న్ అయితే చాలు. దానిపై సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ వేడెక్కించేస్తున్నారు మ‌న క్రియేటివ్ డైరెక్ట‌ర్స్. నిజానికి మంచి కంటే చెడును తెర‌పై చూపిస్తేనే ఎక్కువ ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. క్రైమ్ ఏదైనా ప్ర‌జ‌ల్లో అమితాస‌క్తిని క‌లిగించేదిగా ఉంటోంది. ముఖ్యంగా వైట్ కాల‌ర్ నేర‌గాళ్లు వారి బినామీ ఆస్తులు.. ఐటీ కుంభ‌కోణాలు అంటే ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది. ఎమోష‌న్ ని చూపించే విధానాన్ని బ‌ట్టి కూడా ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.

ఇక వీట‌న్నిటికీ భిన్నంగా ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనంపై తీసిన `ఆకాశం నీ హ‌ద్దురా` (సురారై పొట్రు) ఇటీవ‌ల ఓటీటీలో రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సూర్య హీరోగా సుధ కొంగ‌ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇక‌పోతే దీనికి విరుద్ధంగా స్కామ్ స్ట‌ర్స్ పై ఇప్ప‌టికే మూడు నాలుగు సినిమాలు ఒక సిరీస్ తెర‌కెక్కుతున్నాయి.

1990ల నాటి స్కామ్ స్ట‌ర్ అంటూ ఇప్ప‌టికే ఆయా సినిమాలు వేడెక్కించేస్తున్నాయి. వీటిలో స్టాక్ బ్రోక‌ర్ హ‌ర్ష‌ద్ మెహ‌తా కుంభ‌కోణంపై ప‌లువురు ఫిలింమేక‌ర్స్ దృష్టి సారించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. స్టాక్ మార్కెట్ కుంభ‌కోణంలో కీల‌క సూత్ర‌ధారి అయిన హ‌ర్ష‌ద్ మెహ‌తా ఒక సామాన్యుడు. త‌న‌దైన తెలివితేట‌ల‌తో మార్కెట్ మాయాజాలంతో కోటీశ్వ‌రుడ‌గా ఎదిగి అదే మార్కెట్ ని ముంచేసిన ఘ‌నుడిగా దొరికిపోయి జైలుపాల‌య్యారు.

ఇంచుమించు ఇదే క‌థ‌తో ది బిగ్ బుల్ పేరుతో అభిషేక్ బ‌చ్చ‌న్ -ర‌కుల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అజ‌య్ దేవ‌గ‌న్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఐటీ స్కామ్ నేప‌థ్యంలో ఓ సినిమా పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కుతోంది. మంచు వ‌విష్ణు- కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అమెరికాలో ఐటీ స్కామ్ నేప‌థ్యంలో `మోస‌గాళ్లు` పేరుతో ఇదే త‌ర‌హాలో వేరొక మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ది గ్రేట్ ప‌రేష్ రావ‌ల్ నిర్మాత‌గా.. 1990 ల సూపర్ స్టార్-స్కామ్ స్ట‌ర్ హర్షద్ మెహతా కుంభ‌కోణం వెబ్ సిరీస్ తెర‌కెక్క‌నుంది. హన్సాల్ మెహతా ఈ సిరీస్ కి క‌ర్త క‌ర్మ క్రియ‌. ఇప్ప‌టికే కాస్టింగ్ ఎంపిక‌లు సాగుతున్నాయి. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ హర్షద్ మెహతా పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిసింది. అయితే నిజానికి ఈ బయో పిక్ ని సినిమాగా తీయాల‌ని భావించినా చివ‌రికి వెబ్ సిరీస్ గా మ‌లిచార‌ని తెలుస్తోంది.

ఇంత‌కుముందు హర్షద్ మెహతాపై స్కామ్ 1992 పేరుతో ఓ వెబ్ సిరీస్ చేయ‌గా.. ప్రతిక్ గాంధీ మెహ‌తా పాత్ర‌లో న‌టించి మెప్పించారు. ప్రతీక్ గాంధీ - శ్రేయా ధన్వంతరి.. తార‌లుగా హన్సాల్ మెహతా రూపొందించిన వెబ్ సిరీస్ ఓటీటీలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది.