Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'సవ్యసాచి'

By:  Tupaki Desk   |   2 Nov 2018 8:59 AM GMT
మూవీ రివ్యూ: సవ్యసాచి
X
చిత్రం : 'సవ్యసాచి'

నటీనటులు: అక్కినేని నాగచైతన్య - నిధి అగర్వాల్ - మాధవన్ - భూమిక చావ్లా - రావు రమేష్ - కౌసల్య - వెన్నెల కిషోర్ - ఆనంద్ - సత్య - షకలక శంకర్ - భరత్ తదితరులు
సంగీతం: కీరవాణి
ఛాయాగ్రహణం: యువరాజ్
నిర్మాతలు: రవిశంకర్ - నవీన్ - మోహన్
రచన - దర్శకత్వం: చందూ మొండేటి

తొలి సినిమా ‘కార్తికేయ’తోనే తన ప్రత్యేకతను చాటుకున్న యువ దర్శకుడు చందూ మొండేటి.. ఆ తర్వాత ‘ప్రేమమ్’ రీమేక్ తోనూ మెప్పించాడు ఇప్పుడతను తన సొంత కథతో నాగచైతన్య హీరోగా తెరకెక్కించిన ‘సవ్యసాచి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విభిన్నమైన కథాంశం.. ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ‘సవ్యసాచి’ అంచనాల్ని అందుకున్నాడో లేదో చూద్దాం పదండి.

కథ:

విక్రమ్ (నాగచైతన్య) ఒక చిత్రమైన లక్షణంతో పుట్టిన కుర్రాడు. అతడి ఎడమ చేయి తన మాట వినదు. కవల సోదరుడిగా పుట్టాల్సిన వాడు.. అతడి శరీరంలో ఒక చేయిగా మారతాడు. ఆ చేతికి స్పర్శ వేరు. దాని ఆలోచనలు వేరు. ఈ చేతి వల్ల విక్రమ్ తరచుగా ఇబ్బందులు పడుతుంటాడు. దాన్ని అసహ్యించుకుంటూ ఉంటాడు. ఇలాగే పెరిగి పెద్దయిన విక్రమ్.. కాలేజీలో తన జూనియర్ అయిన చిత్రను ప్రేమిస్తాడు. అనుకోని కారణాలతో ఆమెకు దూరమైన విక్రమ్.. ఆరేళ్ల తర్వాత తిరిగి ఆమెను కలుస్తాడు. మళ్లీ ఆమెకు చేరువ అవుతాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న సమయంలో అతడి జీవితంలో పెద్ద అలజడి మొదలవుతుంది. ఒక ప్రమాదంలో అతడి బావ చనిపోయి.. అక్క ఆసుపత్రి పాలవుతుంది. విక్రమ్ ప్రాణంలా చూసుకునే అతడి మేనకోడలు కనిపించకుండా పోతుంది. దీని వెనుక ఒక అజ్ఞాతవ్యక్తి ఉన్నాడని విక్రమ్ కు తెలుస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. అతడిని విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు.. తన మేనకోడలిని ఎలా కాపాడుకున్నాడు.. ఇందుకు అతడి ఎడమ చేయి ఎలా సహకరించింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హీరో ఎడమ చేయి అతడి మాట వినదు. అది వేరే మనిషి. దాని ఆలోచన వేరు. దాని ప్రవర్తన వేరు. వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే కాన్సెప్ట్ ఇది. ‘సవ్యసాచి’ ఆరంభంలో ఈ కాన్సెప్ట్ ను పరిచయం చేస్తూ కన్విన్స్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. మరి ఈ వినూత్నమైన ఆలోచన చుట్టూ దర్శకుడు కథను ఎలా అల్లుతాడా.. సన్నివేశాల్ని ఎలా నడిపిస్తాడా అని ఎంతో ఆసక్తిగా చూస్తాం. కానీ ఆరంభంలో ఉన్న క్యూరియాసిటీకి.. ఆ తర్వాత నడిచే వ్యవహారానికి సంబంధం ఉండదు. ‘సవ్యసాచి’లో యునీక్ గా అనిపించిన.. ఎంతో ఆసక్తికరంగా అనిపించిన పాయింట్ గురించి గంట గడిచాక పూర్తిగా మరిచిపోతాం. కథకు కీలకమైన పాయింట్ ను పక్కన పెట్టేసి ఒక సగటు లవ్ స్టోరీ.. కామెడీ ట్రాక్ చూపిస్తాడు చందూ. ఈమాత్రం దానికి ఈ పాయింట్ ఎంచుకోవడం దేనికి అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రేక్షకుల్ని చివరిదాకా సస్పెన్సులో ఉంచి.. కొంచెం లేటుగా అసలు విషయాలన్నీ రివీల్ చేసి థ్రిల్ చేద్దామనే ఆలోచన సరైన ఫలితాన్నివ్వలేదు. స్క్రీన్ ప్లే ఒక తీరుగా సాగకపోవడం.. మధ్య మధ్యలో దారి తప్పి ఎక్కడెక్కడికో వెళ్లిపోవడంతో.. ‘సవ్యసాచి’కి ఎక్కడకిక్కడ బ్రేకులు పడుతూనే ఉంటాయి. కాన్సెప్ట్.. హీరో-విలన్ పాత్రలు బాగున్నా.. అక్కడక్కడా కొన్ని మెరుపులు ఉన్నా.. ఓవరాల్ గా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో అయితే ‘సవ్యసాచి’ లేదు.

‘సవ్యసాచి’కి స్క్రీన్ ప్లే ఎలా అడ్డంకిగా మారిందో ఒక ఉదాహరణ చూద్దాం. ద్వితీయార్ధంలో హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్ నడుస్తుంటుంది. హీరోను ముప్పుతిప్పలు పెడుతుంటాడు విలన్. అతడికి పెద్ద ఛాలెంజ్ విసురుతాడు. ఆ సన్నివేశం కొంచెం సీరియస్ గా.. ఇంటెన్స్ గా సాగాక.. ఆ ఛాలెంజ్ ను హీరో ఎలా స్వీకరిస్తాడు.. విలన్ని ఎలా ఎదుర్కొంటాడు అని చూస్తే.. ఉన్నట్లుండి హీరోయిన్ లైన్లోకి వస్తుంది. వెంటనే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోతాడు హీరో. కాలేజీ రోజుల్లో ఒక కామెడీ డ్రామా.. దాని తర్వాత ఒక పాట వస్తాయి. అప్పటిదాకా సినిమా నడుస్తున్న మూడ్ వేరు. ఈ ఎపిసోడ్ వేరు. థ్రిల్లర్ సినిమాల్లో మూడ్.. ఉత్కంఠను క్యారీ చేయడం కీలకం. కానీ ఇక్కడ మాత్రం దర్శకుడు విచిత్రంగా ఈ మూడ్.. ఉత్కంఠను కొనసాగించకుండా కామెడీ ట్రాక్.. పాట పెట్టాడు. మధ్యలో ఇలా ‘రిలీఫ్’ కోసం ఎందుకాలోచించాడో అర్థం కాదు. దీని వల్ల సినిమా ఫ్లోనే దెబ్బ తింది. అలాగని ఆ డ్రామాలో కామెడీ లేదని కాదు.. ఆ పాట ఎంగేజ్ చేయదని కాదు. కానీ అవి వచ్చిన టైమింగ్ తోనే సమస్య.

ప్రథమార్ధంలోనూ దాదాపుగా ఇదే సమస్య కనిపిస్తుంది. సినిమాను ఆసక్తికరంగా ఆరంభించాక.. ఒక రొటీన్ లవ్ స్టోరీ.. కామెడీ ట్రాక్ లతో ‘సవ్యసాచి’ గాడి తప్పుతుంది. మనం మొదట్లో చూసిన కాన్సెప్ట్ కి.. ఆ తర్వాత నడిచే వ్యవహారానికి సంబంధం ఉండదు. ఒకట్రెండు సీన్లలో ఎడమచేయి ప్రస్తావన ఉంటుంది కానీ.. మిగతా అంతా ఒక మామూలు సినిమా చూస్తున్న భావనే కలిగిస్తుంది. సాధారణంగా సాగే లవ్ స్టోరీ ఆసక్తి సన్నగిల్లిపోయేలా చేస్తుంది. ఇంటర్వెల్ ముంగిట విలన్ పాత్ర రంగప్రవేశంతో కానీ మళ్లీ కథ పట్టాలెక్కదు. ఇంటర్వెల్ మలుపు ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో హీరో-విలన్ మైండ్ గేమ్ అంత ఎగ్జైటింగ్ గా లేకపోయినప్పటికీ.. కథనం కొంత ఆసక్తికరంగానే నడుస్తుంది. స్పీడ్ బ్రేకుల్లా వచ్చిన డ్రామా ఎపిసోడ్.. లగాయత్తు పాట తర్వాత ‘సవ్యసాచి’ ఎంగేజ్ చేస్తుంది. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్.. ‘సవ్యసాచి’ బెస్ట్ పార్ట్స్ అని చెప్పొచ్చు. విలన్ పాత్ర తాలూకు సస్పెన్స్ చాలా లేటుగా రివీలవుతుంది. అలాగే హీరో ఎడమచేతిని కూడా చివరి ఎపిసోడ్ లలోనే హైలైట్ చేశారు. చివరి అరగంటలోని మెరుపులు.. మలుపులు.. అంతకు ముందే ఉంటే ‘సవ్యసాచి’ రేంజ్ వేరుగా ఉండేది. న్ ప్లే ఒక తీరుగా సాగకపోవడం.. నిస్సారమైన కొన్ని ఎపిసోడ్లు సినిమాను పక్కదారి పట్టించాయి. చందూ తొలి సినిమా ‘కార్తికేయ’లో కనిపించి బిగి ఇందులో మిస్సయింది. కాన్సెప్ట్ కోసం.. హీరో-విలన్ పాత్రల కోసం ‘సవ్యసాచి’ ఒకసారి చూడొచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లయితే సినిమా లేదు.

నటీనటులు:

నాగచైతన్య తన కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రలో రాణించాడు. ప్రథమార్ధం వరకు అతడి పాత్ర మామూలుగా అనిపించినా.. ద్వితీయార్ధంలో ప్రత్యేకత చాటుకుంటుంది. ఈ పాత్రలోని ఇంటెన్సిటీని చూపించే సన్నివేశాల్లో చైతూ ఆకట్టుకున్నాడు. చైతూ లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. మాధవన్ తన ప్రత్యేకత చూపించాడు. కెరీర్లో తొలిసారి పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ చేసిన మాధవన్.. తన పాత్రకు వెయిట్ తీసుకొచ్చాడు. అలవోకగా ఈ క్యారెక్టర్ చేసుకుపోయాడు. ఐతే మాధవన్ స్థాయికి అతడి పాత్ర ఇంకా బాగుండాలని ఆశిస్తాం. హీరోయిన్ నిధి అగర్వాల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమె అందంగా ఉన్నప్పటికీ.. నటన పరంగా చెప్పుకోవడానికేమీ లేదు. తన పాత్రలోనూ ఏ ప్రత్యేకతా లేదు. భూమికది కూడా మామూలు క్యారెక్టరే. ఆమె నటన ఓకే. వెన్నెల కిషోర్.. సత్య.. సప్తగిరి అక్కడక్కడా నవ్వించారు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

కీరవాణి సంగీతం ఓకే. సవ్యసాచి థీమ్ సాంగ్.. ఒక్కరంటే ఒక్కరు.. వైనాట్ పాటలు బాగున్నాయి. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. ప్రథమార్ధం వరకు నేపథ్య సంగీతం మామూలుగా అనిపించినా.. ద్వితీయార్ధంలో ప్రత్యేకత చాటుకుంటుంది. కథకు కీలకమైన సన్నివేశాల్ని బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు కీరవాణి. యువరాజ్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా అంతా రిచ్ గా కనిపిస్తుంది. ఇక దర్శకుడు చందూ మొండేటి విషయానికి వస్తే.. అతను ఎంచుకున్న కథ బాగుంది. కొత్తగా అనిపిస్తుంది. ఐతే హీరో ఎడమచేయి అతడి మాట వినకపోవడం అనే యునీక్ పాయింట్ ను సినిమాలో సరిగ్గా వాడుకోలేకపోయాడు చందూ. దర్శకుడిగా అతను అక్కడక్కడా మెరుపులు చూపించాడు. ప్రధాన పాత్రల్ని బాగానే తీర్చిదిద్దుకున్నాడు. కానీ ఈ కొత్త కథకు తగ్గ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే రాసుకోలేదు.

చివరగా: సవ్యసాచి.. కాన్సెప్ట్ బాగుంది కానీ..!

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre