Begin typing your search above and press return to search.

అప్పట్లో ఇలాగే ఉండేది కదా...

By:  Tupaki Desk   |   6 Feb 2018 5:26 AM GMT
అప్పట్లో ఇలాగే ఉండేది కదా...
X
తెలుగు వారెప్పుడూ మరిచిపోలేని.. మరిచిపోరాని మణిమకుటం వంటి మహానటి సావిత్రి. బ్లాక్ వైట్ అండ్ రోజుల్లో హీరోలకు దీటయిన స్టార్ స్టేటస్ దక్కించుకున్న మహానటి ఆమె. సావిత్రి నటనలో ఎంత గొప్పతనం ఉందో.. పోషించిన పాత్రల్లో ఎంత జీవం ఉందో.. అంతకుమించిన నాటకీయత ఆమె నిజ జీవితంలో దాగుంది.

అందుకే సావిత్రి జీవిత గాథతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా తెరకెక్కిస్తున్న మహానటి సినిమా అందరి దృష్ఠినీ ఆకర్షిస్తోంది. యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ లీడ్ రోల్ చేస్తోంది. మహానటి షూటింగ్ ప్రారంభమై ఈ సినిమాకు సంబంధించి ఒక్కో విశేషం బయటపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. సావిత్రి నటనా జీవితంలో అత్యధిక భాగం బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల్లోనే గడిచింది. అందుకే మహానటి సినిమా కోసం ఆనాటి రోజులను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా వింటేజ్ లుక్ తో సెట్లు వేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర పోషిస్తున్న విజయ్ దేవరకొండ సినిమాలో ఆఫీస్ సెట్ ఒకటి షేర్ చేశాడు. దర్బారు లాంటి పెద్ద హాల్లో వైరు కుర్చీలు.. పాతకాలం సొరుగులతో కూడిన చెక్క టేబుళ్లు.. వేళ్లాడే లైట్లు..ఆనాటి రోజుల్లోనే కనిపించే బండ సీలింగ్ ఫ్యాన్లు.. అబ్బో మొత్తానికి ఈ ఒక్క ఫొటో చూస్తే 80ల్లో ఆఫీసుల్లో పనిచేసిన వారికి తమ పాత రోజులు గుర్తుకు రాక మానవు.

ఇంతకుముందు మహానటి సినిమాకు సంబంధించి పాత మోపెడ్... ఆనాటి క్వార్టర్స్ లో నివాసంతో ఓ ఫొటో బయటకొచ్చింది. ఈ ఫొటోలు చూస్తే మహానటి యూనిట్ సెట్ రూపకల్పనలో ప్రతి చిన్నవిషయాన్ని చాలా జాగ్రత్త తీసుకున్నట్లే కనిపిస్తోంది. వారి కష్టం ఫలించి నలభై ఏళ్ల క్రితం నాటి వాతావరణం కళ్లకు కట్టినట్టే ఉంది.