Begin typing your search above and press return to search.

నయనతార భర్త పాత్రలో సత్యదేవ్ ఖాయమేనా

By:  Tupaki Desk   |   21 Nov 2021 2:30 PM GMT
నయనతార భర్త పాత్రలో సత్యదేవ్ ఖాయమేనా
X
చిరంజీవి చాలా తక్కువ సమయంలో మూడు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేశారు. ఈ మూడింటిలో ఒకటి మలయాళ రీమేక్ అయితే, మరొకటి తమిళ రీమేక్. ముందుగా ఆయన 'లూసిఫర్' తెలుగు రీమేక్ గా 'గాడ్ ఫాదర్' చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చెల్లెలి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. హీరో .. ఆయన చెల్లెలు .. ఆ చెల్లెలి భర్త పాత్ర చాలా కీలకం. మలయాళంలో చెల్లెలి పాత్రను మంజూ వారియర్ చేయగా, ఆమె భర్త పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించాడు.

హీరో చెల్లెలి భర్తనే ఈ సినిమాలో విలన్ .. అందువలన ఆ పాత్రలో వివేక్ ఒబెరాయ్ అదరగొట్టేశాడు. ఇక మంజూ వారియర్ నటనను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. తెలుగు రీమేక్ లో చెల్లెలి పాత్ర కోసం నయనతారను తీసుకున్నారు. మొన్న నయనతార బర్త్ డే స్పెషల్ గా అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. ఆమె భర్త పాత్ర కోసం సత్యదేవ్ ను అనుకున్నారు. అయితే ఈ పాత్ర ఎంపికలో నయనతార అసంతృప్త్తిని వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తమ కాంబినేషన్ కరెక్టుగా అనిపించడం లేదనీ, ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటే చూడమని ఆమె చెప్పినట్టుగా ఒక టాక్ వచ్చింది.

ఇక బయట కూడా దాదాపు అదే విధమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కన్నడ స్టార్ సుదీప్ అయితే ఆ పాత్రకి బాగా సెట్ అవుతాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. తమిళం నుంచే వేరెవరినైనా తీసుకుంటే బాగుంటుందనేది మరికొందరి అభిప్రాయం. కానీ ఈ సినిమా టీమ్ మాటలు వింటుంటే మాత్రం సత్యేదేవ్ నే ఖాయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకైతే ఆయనే లైన్లో ఉన్నాడు. ఇక ముందు పరిమాణాలు ఎలా ఉంటాయనేది మాత్రం చెప్పలేం. ఒక ఆర్టిస్టుగా సత్యేదేవ్ కి వంక బెట్టవలసిన పనిలేదు. కాకపోతే నయనతార సీనియారిటీని తట్టుకుని నిలబడాలంతే.

ప్రస్తుతం నయనతార 'కాతువాకుల రెండు కాధల్' సినిమా చేస్తోంది. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి దర్శకుడు మాత్రమే కాదు .. నిర్మాణ భాగస్వామి కూడా. ఈ మధ్య వీరి సొంత బ్యానర్ నుంచి నిర్మితమయ్యే సినిమాల సంఖ్య పెరుగుతూ ఉండటం విశేషం. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార, ఏ మాత్రం అవకాశం దొరికినా మలయాళంలోగానీ .. తెలుగులోగాని చేస్తోంది. అలాగే ఆమె 'గాడ్ ఫాదర్' సినిమాను ఒప్పుకుంది. 'సైరా' తరువాత చిరంజీవితో ఆమె చేస్తున్న సినిమా ఇదే. 'సైరా'లో తన పాత్ర నిడివిని తగ్గించినందుకు ఆమె అలిగినట్టుగా అప్పట్లో చెప్పుకున్నారు. 'గాడ్ ఫాదర్' రీమేక్ గనుక, ఇక ఇప్పుడు ఆ ఛాన్స్ లేనట్టే!