Begin typing your search above and press return to search.

స‌మ్మ‌ర్ ర‌ఫ్ఫాడిస్తుంటే శీతాకాలం అంటాడేంటి?

By:  Tupaki Desk   |   9 Jun 2022 1:41 PM GMT
స‌మ్మ‌ర్ ర‌ఫ్ఫాడిస్తుంటే శీతాకాలం అంటాడేంటి?
X
యంగ్ ట్యాలెంటెడ్ హీరో స‌త్య‌దేవ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతిమంగా గ‌మ్యాన్ని చేరే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. స్టార్ డ‌మ్ గ్రాఫ్ ని నెమ్మ‌దిగా పైకి తీసుకెళుతున్నాడు. సత్య దేవ్ న‌టించిన రెండు సినిమాలు త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇందులో స‌త్య‌దేవ్- తమన్నా భాటియా జంట‌గా నటించిన `గుర్తుందా సీతకాలం` రిలీజ్ డేట్ తాజాగా లాక్ అయ్యింది. కన్నడ హిట్ చిత్రం లవ్ మాక్ టైల్ కి అధికారిక తెలుగు రీమేక్ ఇది.

ఇంత‌కుముందు విడుద‌లైన ట్రైలర్ కూల్ అండ్ లవ్లీ యాంబియెన్స్ తో ఆక‌ట్టుకుంది. సత్య దేవ్ తన కెరీర్ వివిధ దశలలో భిన్న‌మైన ప్రేమకథల‌ను న‌డిపిస్తాడు. ఆశ్చర్యకరంగా అతడు నటించిన‌ ప్రతి ప్రేమకథ శీతాకాలంతో ముడిపడి ఉంటుంది. ఈ చిత్రంలో తమన్నా భాటియా- మేఘా ఆకాష్- కావ్య శెట్టి లాంటి టాప్ క్లాస్ హీరోయిన్ల‌తో అత‌డు రొమాన్స్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. భామ‌ల‌తో ప్రేమలో ప‌డే కుర్రాడిగా స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సత్య హెగ్డే రిచ్ విజువల్స్ .. లక్ష్మీ భూపాల డైలాగ్స్ ఈ సినిమాకి ప్ల‌స్ కానున్నాయి.

తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్ర‌క‌టించారు. జూలై 15న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. నాగశేఖర్ ఆర్ దర్శకత్వంలో భావన రవి- నాగశేఖర్ -రామారావు చింతపల్లి నిర్మించారు. అగ్గి రాజేస్తున్న స‌మ్మ‌ర్ లో గుర్తుందా శీతాకాలం అంటూ స‌త్య‌దేవ్ అండ్ టీమ్ ప‌ల‌క‌రింపు ఆశ్చ‌ర్యం క‌లిగించేదే. రోహిణి కార్తె.. అగ్నికార్తెలో రోళ్లు బ‌ద్ధ‌లు కొట్టే ఎండ‌ల‌తో భూమండ‌లం మండుతోంది.  ఇలాంటి స‌మ‌యంలో ఏసీ థియేట‌ర్ల‌లో కూల్ గా శీతాకాలాన్ని ఆస్వాధించే వెసులుబాటు క‌ల్పిస్తున్నార‌ని అనుకోవచ్చు.

ఈ చిత్రం 2020 శాండల్ వుడ్ హిట్ చిత్రం లవ్ మాక్ టైల్ కి రీమేక్.  ప్రేమించిన యువ‌తిలో నిజమైన ప్రేమను కనుగొనడం కోసం సాగించే  ప్ర‌యాణంలో అనేక సార్లు హార్ట్  బ్రేక్ అయ్యే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రయాణానికి సంబంధించిన క‌థ ఇది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే క‌థాంశం క్యూరియ‌స్ గా సాగుతుంది. పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. త‌మ‌న్నా లాంటి సీనియ‌ర్ న‌టితో స‌త్య‌దేవ్ రొమాన్స్ ఎలా ఉండ‌నుందో తెరపైనే చూడాలి. ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం ఓ  కీల‌క పాత్ర‌లో నటించారు. మేఘా ఆకాష్ అతిధి పాత్రలో కనిపించనుందని సమాచారం.
ట్రైల‌ర్ స‌హా విజువ‌ల్స్ కి ఇప్ప‌టికే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. శ్రీ వేదాక్షర మూవీస్ సహకారంతో నాగశేఖర్ మూవీ- మణికంఠ ఎంటర్ టైన్ మెంట్స్  బ్యాన‌ర్ల‌పై భావన రవి- నాగశేఖర్-రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్యోతి లక్ష్మి- బ్లఫ్ మాస్టర్- బ్రోచేవారెవరురా- ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రాల‌తో న‌టుడిగా నిరూపించిన స‌త్య‌దేవ్ ఈ సినిమాతో పాటు గాడ్సే చిత్రంలోనూ న‌టిస్తున్నారు.  హిందీ చిత్రం రామ్ సేతులోను న‌టిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. మ‌రోవైపు తమన్నా న‌టించిన‌ F3 ఇటీవ‌లే విడుద‌లై విజ‌యం అందుకుంది.  బోలే చుడియాన్- ప్లాన్ ఎ ప్లాన్ బి- భోలా శంకర్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది.