Begin typing your search above and press return to search.

కామ్రేడ్ రవన్న కు ధీటుగా గాడ్సే నిలబడతాడా..?

By:  Tupaki Desk   |   8 Jun 2022 2:30 AM GMT
కామ్రేడ్ రవన్న కు ధీటుగా గాడ్సే నిలబడతాడా..?
X
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ ను క్రియేట్ చేసుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్‌. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన చిత్రాలను లైన్ లో పెట్టిన సత్యదేవ్.. ఇప్పుడు ''గాడ్సే'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గోపి గణేశ్ పట్టాభి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

'బ్లఫ్ మాస్టర్' తర్వాత దర్శక హీరోలు కలసి చేసిన సినిమా ''గాడ్సే''. సీకే స్ర్కీన్స్ బ్యానర్ పై నిర్మాత సి. కల్యాణ్ నిర్మించారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే సత్యదేవ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద రానా దగ్గుబాటితో పోటీ పడాల్సి వచ్చింది.

''గాడ్సే'' చిత్రాన్ని జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే అదే రోజు రానా - సాయి పల్లవి జంటగా నటించిన ''విరాటపర్వం'' సినిమా థియేటర్లలోకి రాబోతోంది. 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం వాయిదా పడటంతో.. రానా సినిమాని అదే తేదీకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో సత్యదేవ్ కు సోలో రిలీజ్ లేకుండా పోయింది.

'నీది నాది ఒకటే కథ' ఫేమ్ ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ''విరాటపర్వం'' చిత్రం కరోనా పాండమిక్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని.. సినిమాపై అంచనాలు కలిగించింది.

1990లలో జరిగిన వాస్తవ సంఘటనల ప్రేరణతో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో 'విరాటపర్వం' చిత్రాన్ని రూపొందించారు. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించారు.

మరోవైపు అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్య‌వ‌స్థ‌ను ప్రక్షాళన చేసే కాన్సెప్ట్ తో 'గాడ్సే' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సత్యదేవ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇన్నాళ్లకు థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు.

ఇలా ఒకే రోజు రెండు కంటెంట్ ఓరియెంటెడ్ సినినాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఓ విధంగా చూసుకుంటే రానా - సాయి పల్లవి సినిమాకే కాస్త క్రేజ్ ఎక్కువ ఉంది. మరి 'విరాటపర్వం' చిత్రాన్ని ఢీకొట్టి సత్యదేవ్ 'గాడ్సే' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.