Begin typing your search above and press return to search.

అప్పుడు 'బ్రహ్మోత్సవం'.. ఇప్పుడు కళ్యాణం

By:  Tupaki Desk   |   12 Aug 2018 4:30 AM GMT
అప్పుడు బ్రహ్మోత్సవం.. ఇప్పుడు కళ్యాణం
X
ఒక జానర్లో ఒక సినిమా బాగా ఆడిందంటే చాలు.. ఇక అదే తరహాలో సినిమాలు వరుస కట్టేస్తాయి. కొందరు దర్శకులు కూడా తాము అందించిన సక్సెస్ ఫార్ములాలో తామే చిక్కుకుని ఇబ్బంది పడుతుంటారు. రామ్ గోపాల్ వర్మ.. పూరి జగన్నాథ్.. శ్రీను వైట్ల.. తేజ లాంటి డైరెక్టర్లు ఇలాగే ఒక రకమైన మూసలో చిక్కుకుపోయారు. తమ సినిమాల్ని తామే కాపీ కొట్టుకుంటూ ఎదురు దెబ్బలు తిన్నారు. ఏదైనా తొలిసారి చూసినపుడు కొత్తగా అనిపించే ఒక విషయం.. ఆ తర్వాత ఇంకోసారి చూస్తే మామూలుగా అనిపిస్తుంది. మళ్లీ మళ్లీ చూస్తే మొహం మొత్తుతుంది. ఈ విషయం గ్రహించలేక దర్శకులు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుంటారు. చూపించిందే మళ్లీ చూపిస్తే.. ప్రేక్షకులకు ఎంత చిరాకొస్తుందో చెప్పడానికి చాలా రుజువులే ఉన్నాయి.

అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘బ్రహ్మోత్సవం’ గురించి మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మంచి ఫ్యామిలీ సినిమాను అందించాడు శ్రీకాండ్ అడ్డాల. అందులో కుటుంబ బంధాలు.. ఆప్యాయతల గురించి చక్కగా చర్చించాడు. ఐతే ఇంకోసారి మహేష్‌ తో సినిమా చేసే అవకాశం వచ్చినపుడు అతను వైవిధ్యం చూపించాల్సింది. ఇంకో రకమైన కథ కోసం ట్రై చేయాల్సింది. కానీ మళ్లీ ‘సీతమ్మ..’ స్టైల్లోకి వెళ్లాడు. అందులో చూపించిన విషయాల్నే ఈసారి డోస్ పెంచాడు. ప్రేక్షకులకు ఏదో మంచి చెప్పాలన్న ప్రయత్నంలో హద్దులు దాటిపోయాడు. ‘మంచితనం’ డోస్ పెరిగిపోయింది. అదే పనిగా క్లాస్ పీకేశాడు. జనాలకు చిరాకొచ్చింది. ఇప్పుడు సతీశ్ వేగేశ్న కూడా అదే తప్పు చేశాడు. ‘శతమానం భవతి’ ఆడింది కదా అని.. అదే స్టయిల్లో ‘శ్రీనివాస కళ్యాణం’ తీశాడు. పల్లెటూరి అనుబంధాలు.. ఆప్యాయతల నేపథ్యంలో ‘శతమానం భవతి’ తీసిన సతీశ్.. ఈసారి పెళ్లి మీద ‘శ్రీనివాస కళ్యాణం’ చేశాడు. శ్రీకాంత్ స్టయిల్లోనూ అతను కూడా తన గత సినిమా ఫార్ములానే అప్లై చేశాడు. ఈసారి డోస్ కూడా పెంచేశాడు. పెళ్లి మీద అదే పనిగా క్లాస్ పీకాడు. అది జనాలకు రుచించలేదు. ‘బ్రహ్మోత్సవం’ లాంటి భయపెట్టలేదు కానీ.. ‘శ్రీనివాస కళ్యాణం’ సైతం ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేస్తున్న మాట మాత్రం వాస్తవం.