Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాట రిలీజ్ గందరగోళంకు తెర పడేది అప్పుడేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2022 12:02 PM GMT
సర్కారు వారి పాట రిలీజ్ గందరగోళంకు తెర పడేది అప్పుడేనా?
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సర్కారు వారి పాట సంక్రాంతికి విడుదల చేస్తామని దాదాపు ఏడాది పాటు ఊరించిన మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్‌ సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో సంక్రాంతి బరి నుండి తప్పుకున్నారు. సంక్రాంతికి కరోనా థర్డ్‌ వేవ్ కారణంగా ఆ సినిమాలు కూడా విడుదల కాలేదు. ఏప్రిల్‌ 1న సర్కారు వారి పాట రిలీజ్‌ డేట్ ను రీ షెడ్యూల్‌ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ తేదీపై కూడా గందరగోళం నెలకొంది. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా ను ఏప్రిల్‌ 1న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. సర్కారు వారి పాట సినిమా విడుదల ఉండక పోవడం వల్లే ఆచార్య ను ఆ తేదీన విడుదల చేసేందుకు సిద్ధం అయ్యి ఉంటారు అంటూ చర్చ జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుకుని ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. అయితే సర్కారు వారి పాట సినిమా విడుదల విషయంలో మార్పు లేదు అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమాను ఏప్రిల్‌ 1న ముందుగా అనుకున్నట్లుగా విడుదల చేసేందుకు దర్శకుడు పరశురామ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. ఒక వేళ ఏప్రిల్‌ 1వ తారీకున సినిమాను విడుదల చేయకుంటే ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాలు పాన్‌ ఇండియా సినిమాలు ఇతర భాషల సినిమాలు విడుదల కాబోతున్నాయి. తద్వారా సర్కారు వారి పాటకు సరైన తేదీ దొరికే అవకాశం లేదు. అందుకే సర్కారు వారి పాట సినిమాను ఖచ్చితంగా ఏప్రిల్‌ 1న విడుదల చేయాలని అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. సినిమా చిత్రీకరణ కు ఎక్కువ సమయం పట్టదని.. ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి చివరి వరకు షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కనుక విడుదల తేదీని మార్చే అవకాశం లేదని అంటున్నారు.

ఒకవేళ సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్‌ 1 నే విడుదల చేయాలని భావిస్తే ఆచార్య సినిమా ను రీ షెడ్యూల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. సినిమా షూటింగ్ ప్రస్తుతం మహేష్ బాబు లేకుండానే జరుగుతుంది. ఒకటి రెండు వారాల్లో మహేష్ బాబు కూడా జాయిన్ అవుతాడట. చివరి షెడ్యూల్‌ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపేందుకు ఇప్పటికే దర్శకుడు పరశురామ్‌ ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. సర్కారు వారి పాట చిత్రీకరణ ముగిసిన వెంటనే ఆలస్యం లేకుండా విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు. 2020 సంవత్సరం సంక్రాంతికి మహేష్‌ బాబు సినిమా వచ్చింది. తదుపరి సినిమాకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.. ఇంకా ఆలస్యం చేయకుండా సమ్మర్ లో సర్కారు వారి పాట విడుదల చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న సినిమా నుండి మొదటి సాంగ్‌ విడుదల కాబోతుంది. ఆ సమయంలో విడుదల తేదీపై స్పష్టత వస్తుందని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. సర్కారు వారి పాట విడుదల తేదీ విషయంలో నెలకొన్న గందరగోళం కు మొదటి పాట తో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.