Begin typing your search above and press return to search.

మహేష్ ను ఢీకొట్టబోతున్న డాన్..!

By:  Tupaki Desk   |   14 April 2022 2:32 PM GMT
మహేష్ ను ఢీకొట్టబోతున్న డాన్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ కానుకగా 2022 మే 12న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే సోలోగా రావాలనుకున్న మహేష్ కు పోటీగా ఇప్పుడు తమిళ హీరో బరిలో దిగుతున్నాడు.

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన తాజా చిత్రం ''డాన్''. శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే RRR సినిమా కోసం వాయిదా వేసుకున్నారు.

నేడు తమిళ న్యూ ఇయర్ సందర్భంగా 'డాన్' రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. 2022 మే 13న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శివ కార్తికేయన్ నటించిన 'రెమో' 'వరుణ్ డాక్టర్' వంటి సినిమాలు తెలుగులోనూ ఆదరణ దక్కించుకున్నాయి. అందుకే ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు మూవీ కూడా చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 'డాన్' చిత్రాన్ని ఇక్కడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

అంటే 'సర్కారు వారి పాట' విడుదలైన ఒక్క రోజు తర్వాత 'డాన్' సినిమా థియేటర్లలోకి రాబోతోందన్నమాట. మహేష్ బాబు లాంటి అగ్ర కథానాయకుడుకి తమిళ హీరో సినిమాని పోటీగా భావించకపోవచ్చు. కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం గతంలో 'బ్రహ్మోత్సవం' సినిమా రిలీజ్ టైంలో వచ్చిన 'బిచ్చగాడు' ఎలాంటి విజయాన్ని అందుకుందనే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.

'డాన్' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ మరియు శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందించారు. శుభాస్కరన్ - శివ కార్తికేయన్ నిర్మాతలు. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో ఎస్.జె. సూర్య కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

మరోవైపు 'సర్కారు వారి పాట' సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని - వై రవి శంకర్ - రామ్ ఆచంట - గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన SVP ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత మహేష్ నుంచి రాబోతున్న 'సర్కారు వారి...' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి దీనికి పోటీగా 'డాన్' సినిమా ఏమాత్రం నిలబడుతుందో చూడాలి.