Begin typing your search above and press return to search.

హాట్ సమ్మర్ లో కూల్ గా రాబోతున్న 'సర్కారు వారి పాట'

By:  Tupaki Desk   |   31 Jan 2022 8:38 PM IST
హాట్ సమ్మర్ లో కూల్ గా రాబోతున్న సర్కారు వారి పాట
X
హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇది వరకు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చిత్రాల రిలీజ్ డేట్స్ ని రీషెడ్యూల్ చేస్తున్న నేపథ్యంలో.. మహేశ్ సినిమా కోసం మరో కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు.

''సర్కారు వారి పాట'' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2022 మే 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఎవరితో ఇబ్బంది లేకుండా తీరిగ్గా థియేటర్లలో యాక్షన్ తో పాటుగా ఆక్షన్ ను చూపించబోతున్నారన్నమాట. ఈ సందర్భంగా ఆవిష్కరించిన మహేష్ బాబుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో సూపర్ స్టైలిష్ గా ఉన్న మహేష్.. కూల్ గా ఓ చోట కళ్ళు మూసుకొని పడుకొని రిలాక్స్ అవుతున్నారు.

వాస్తవానికి 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ కోసం ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసుకున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మే 12వ తేదీకి షిఫ్ట్ అయ్యారు. గతంలో ఏప్రిల్ లో విడుదలైన మహేష్ బాబు సినిమాలు చాలా వరకు ఘనవిజయం సాధించాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

కాగా, 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా సిద్ధం చేస్తున్నారు. ఇందులో వింటేజ్ మహేష్ బాబు కనిపించబోతున్నారనే విషయం ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి అర్థం అవుతోంది. సముద్ర ఖని - ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ - జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే 'సర్కారు వారి పాట' చిత్రానికి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. కరోనా నుంచి కోలుకున్న మహేష్ బాబు వచ్చే వారం నుంచి చిత్రీకరణలో పాల్గొననున్నారు.