Begin typing your search above and press return to search.

సర్కారు వారి మాస్ సాంగ్ షూట్.. మహేష్ మళ్లీ మైండ్ బ్లాక్ చేస్తారా..?

By:  Tupaki Desk   |   18 April 2022 10:03 PM IST
సర్కారు వారి మాస్ సాంగ్ షూట్.. మహేష్ మళ్లీ మైండ్ బ్లాక్ చేస్తారా..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ''సర్కారు వారి పాట''. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఏర్పాటు చేసిన మాసివ్ సెట్ లో ఓ మాస్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సర్కారు వారి పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి చార్ట్‌ బస్టర్ ఆల్బమ్‌ ను అందించారు. ఇప్పటికే విడుదలైన 'కళావతి' 'పెన్నీ' పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పాట ఒక మాస్ డ్యాన్స్ నంబర్ అని తెలుస్తోంది.

తాజాగా సెట్ లో BTS ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ను మహేష్ బాబు - కీర్తి సురేష్ మరియు డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్నారు. ఇందులో మహేష్ మోకాలి కిందకు కర్చీఫ్ కట్టుకొని.. మాస్ స్టెప్పులతో అలరించబోతునట్లు తెలుస్తోంది.

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో 'మైండ్ బ్లాక్' పాటలో తన మాస్ డ్యాన్స్‌ లతో మహేష్ బాబు తన అభిమానులను మంత్రముగ్ధులను చేసాడు. ఇప్పుడు, 'సర్కారు వారి పాట' కోసం అదే కొరియోగ్రాఫర్ తో కలిసి మైండ్ బ్లాక్ చేయనున్నారని తెలుస్తోంది.

''సూపర్ స్టార్ మహేష్ తన మాస్సియెస్ట్ బెస్ట్‌ తో ఈరోజు సెట్స్ లో అదరగొట్టాయి. ఈ మాస్ పాటను థియేటర్లలో ఆడియన్స్ కు చూపించడానికి ఆగలేకపోతున్నాం'' అని SVP టీమ్ పేర్కొంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా నిర్వహిస్తున్నారు.

రాబోయే రోజుల్లో ప్రమోషన్స్‌ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'సర్కారు వారి పాట' చిత్రాన్ని 2022 మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.