Begin typing your search above and press return to search.

సంక్రాంతి డప్పు మామూలుగా లేదే

By:  Tupaki Desk   |   13 Jan 2020 6:02 AM GMT
సంక్రాంతి డప్పు మామూలుగా లేదే
X
సంక్రాంతి పందెం ర‌క్తి క‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా భారీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా నేనా?అంటూ పోటీప‌డుతున్నాయి. వ‌రుస సెల‌వులు ఈ సినిమాల‌కు పెద్ద ప్ల‌స్ కానున్నాయి. ఆ క్ర‌మంలోనే ఏ సినిమా ఎంత వ‌సూలు చేసింది? ఏ హీరో ఏ రికార్డ్ ను బ్రేక్ చేశారు? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక వ‌సూళ్ల లెక్క‌ల‌ గురించి బ‌య‌ట‌కు మాట్లాడలేం అంటూనే కొంద‌రు ఇంత వ‌సూలు చేసింది అంత వ‌సూలు చేసింది అంటూ లీకులివ్వ‌డం ఫిలింస‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

తాజాగా సంక్రాంతి సంద‌ర్భంగా మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు....బ‌న్నీ న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ద‌ర్బార్ రిలీజైనా ఆ సినిమా విష‌యంలో ఎలాంటి హ‌డావుడి లేదు కానీ.. ఈ రెండు సినిమాల విష‌యంలో కాస్త హంగామా ఎక్కువ‌గానే ఉంది. ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా డిబేట్లు వేడెక్కిస్తున్నాయి. మావాడి క‌లెక్ష‌న్ ఇంత అంటే మా వాడు ఇంత వ‌సూలు చేశాడు అంటూ ఫేక్ క‌లెక్ష‌న్ల రిపోర్టులు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రెండు సినిమాల‌కు మంచి ఓపెనింగ్ లు ద‌క్కాయి. ప్రీమియ‌ర్ల ద్వారా భారీగానే వ‌సూలైన‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం వెడెక్కింది. ఇది కేవ‌లం సోష‌ల్ మీడియాలో జ‌రిగే ప్ర‌చారం మాత్రమే. ఈ రెండు సినిమా యూనిట్ల‌ లో ఎవ‌రూ ఇంకా ఏ ఏరియా నుంచి ఎంత వ‌సూళ్లు సాధించాయి? అన్న‌ది ప్ర‌క‌టించ‌లేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ప్ర‌చారం ఠారెత్తిపోతుంది.

ఎవ‌రికి న‌చ్చిన అంకెలు వాళ్లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. స‌రిలేరు ఇప్పటికే 40 కోట్లు గ్రాస్ తెచ్చింద‌ని ఒక‌రు... లేదు 66 కోట్లు అని మ‌రి కొంద‌రు... ఇంకొక‌రు ఇది పాన్ ఇండియా సినిమా 70 కోట్లుపై మాటేన‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం చేసేస్తున్నారు. ఇది ఒక బాలీవుడ్ సినిమాకి అయినా సాధ్యంకానిది. అయితే ట్రేడ్ మాత్రం స‌రిలేరు తొలి రోజు 40 కోట్ల వ‌సూళ్లకు త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తోంది. అటు అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి సంబందించిన లెక్క‌లు తేలాల్సి ఉందింకా. అయితే ఫ్యాన్స్ లో మాత్రం ఇంత అంత అంటూ ఇప్ప‌టికే ప్ర‌చార‌మ‌వుతోంది. మ‌రి సోష‌ల్ మీడియాల్లో ఇలాంటి ఉత్తితి ప్ర‌చారాల‌కు పుల్ స్టాప్ పెడుతూ చిత్ర‌బృందాలు అధికారికంగా క‌లెక్ష‌న్ల రిపోర్ట్ చెబుతారేమో చూడాలి. ఇక‌పై సంక్రాంతి సినిమాల‌కు 100 కోట్ల క్ల‌బ్ అంటూ పోస్ట‌ర్లు బ‌య‌ట‌ప‌డే వీలుంద‌నే అంతా భావిస్తున్నారు. తొలి వీకెండ్ రిపోర్ట్ వ‌స్తే కానీ ఏదీ క్లారిటీగా తేల‌దు. ఇక కంటెంట్ ఉన్న సినిమాలు మాత్ర‌మే ఆడ‌తాయి త‌ప్ప పోస్ట‌ర్లపై క‌లెక్ష‌న్ల లెక్క‌లు వేస్తే ఆడ‌వ‌ని ఇప్ప‌టికే ప్రూవైంది. ఆ కార‌ణం చేత‌నూ కొంద‌రు లెక్క‌లు చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఫ్యాన్స్ లో త‌ప్పుడు ప్ర‌చారం ఆగాలంటే క‌న్ఫ్యూజ‌న్ పోవాలంటే అధికారిక లెక్క‌లు తెలియాల్సి ఉంటుంది.