Begin typing your search above and press return to search.

సరిలేరు స్పీడ్ మాములుగా లేదే

By:  Tupaki Desk   |   7 Aug 2019 8:46 AM GMT
సరిలేరు స్పీడ్ మాములుగా లేదే
X
మహేష్ బాబు 26వ సినిమాగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ యమా స్పీడ్ గా జరుగుతోంది. చేతిలో కేవలం 5 నెలలు మాత్రమే టైం ఉండటంతో అంతా పక్కా ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో కీలకమైన పోర్షన్ ని షూట్ చేస్తున్నారు. కర్నూల్ కొండారెడ్డి బురుజు ప్రాంతాన్ని పోలిన సెట్ ని అచ్చుగుద్దినట్టు తీర్చిదిద్ది అక్కడ కీలక తారాగణం అంతా పాల్గొనగా కొన్ని సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నారు.

కథలో కీలకమైన మలుపులు వచ్చే పార్ట్ కాబట్టి ఖర్చు గురించి లెక్క చేయకుండా దీని కోసమే భారీ బడ్జెట్ కేటాయించారు. కాశ్మీర్ షెడ్యూల్ లో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా ఉన్న ఎపిసోడ్స్ ని పూర్తి చేసిన టీమ్ సీమలో ఏం చేస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు . నిజానికి ఇది కొండారెడ్డి ప్రాంతంలో ఒక్కడు తరహాలో రియల్ షూటింగ్ చేద్దామని తొలుత అనుకున్నారట.

కానీ ఎక్కువ రోజులు రద్దీని కంట్రోల్ చేస్తూ సాగించడం జరిగే పని కాదని తేలడంతో ఇలా సెట్ ఐడియాకు వచ్చారు. విజయశాంతి సీన్స్ కూడా ఇందులోనే ఉంటాయని తెలిసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న సరిలేరు నీకెవ్వరుకు అప్పుడే క్రేజీ బిజినెస్ డీల్స్ వస్తున్నాయట. అనిల్ సుంకర-దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంక్రాంతి సీజన్ ని లాక్ చేశారు కానీ డేట్ ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది