Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘సర్దార్ గబ్బర్ సింగ్’

By:  Tupaki Desk   |   8 April 2016 7:19 AM GMT
మూవీ రివ్యూ : ‘సర్దార్ గబ్బర్ సింగ్’
X
చిత్రం : ‘సర్దార్ గబ్బర్ సింగ్’

నటీనటులు: పవన్ కళ్యాణ్-కాజల్ అగర్వాల్-శరద్ ఖేల్కర్-ముఖేష్ రుషి-ఊర్వశి-బ్రహ్మానందం-ఆలీ-నర్రా శీను- కబీర్ సింగ్- బ్రహ్మాజీ-తనికెళ్ల భరణి-రఘుబాబు-సుమన్ శెట్టి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: ఆర్థర్ విల్సన్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: శరత్ మరార్-సునీల్ లుల్లా
కథ-స్క్రీన్ ప్లే: పవన్ కళ్యాణ్
దర్శకత్వం- కె.ఎస్.రవీంద్ర (బాబీ)

సర్దార్ గబ్బర్ సింగ్.. ప్రత్యేకంగా ఉపోద్ఘాతం అక్కర్లేని సినిమా. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

భైరవ్ సింగ్ (శరద్ ఖేల్కర్) అనే దుర్మార్గుడి అరాచకాలకు అల్లాడిపోతుంటుంది రతన్ పూర్ గ్రామం. రాజ కుటుంబానికి చెందిన అర్షి దేవి (కాజల్ అగర్వాల్) భైరవ్ వల్ల తన తల్లిదండ్రుల్ని కోల్పోతుంది. భైరవ్ కన్ను ఆమె మీద కూడా పడుతుంది. దీంతో రాజకుటుంబానికి విధేయుడైన హరినారాయణ (ముఖేష్ రుషి).. అర్షిని కాపాడటానికి.. భైరవ్ కు అడ్డుకట్ట వేయడానికి సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్)ను రప్పిస్తాడు. ముందు అల్లాటప్పాగా కనిపించిన సర్దార్.. ఆ తర్వాత భైరవ్ కు తలపోటులా తయారవుతాడు. సర్దార్ తన కార్యకలాపాలకు అడ్డుపడటంతో పాటు అర్షికి దగ్గరవడంతో భైరవ్ తట్టుకోలేకపోతాడు. సర్దార్ ను అదను చూసి దెబ్బ కొడతాడు. మరి సర్దార్ ఆ దెబ్బ నుంచి కోలుకుని.. భైరవ్ ఆట ఎలా కట్టించాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘సర్దార్ గబ్బర్ సింగ్’ టైటిల్స్ లోనే ‘‘ఈ చిత్రం నా అభిమానులకు అంకితం’’ అని వేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ మాట అక్షరాలా నిజం.‘సర్దార్..’ పవన్ తన అభిమానుల కోసమే చేసిన సినిమా. పవన్ అల్లరి వేషాలు.. అతడి మేనరిజమ్స్.. అతడి డ్యాన్సులు.. అతడి ఫైట్లు.. అతడి విన్యాసాలు నచ్చేవారికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బాగానే అనిపిస్తుంది. ఐతే సగటు ప్రేక్షకుడికి మాత్రం ‘సర్దార్’ సగటు చిత్రంలాగే అనిపిస్తుంది.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ కథేంటన్నది ట్రైలర్లోనే విప్పేశారు. ఒకరకంగా కొత్త కథమీ ఆశించొద్దని ట్రైలర్ తోనే హింట్ ఇచ్చేశారు. ఐతే కథ ఎలా ఉన్నప్పటికీ కథనం బాగుంటే ప్రేక్షకులు ఎంగేజ్ అయిపోతారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో అదే మిస్సయింది. కేవలం పవన్ విన్యాసాలతోనే ప్రేక్షకుల్ని రెండు గంటల 43 నిమిషాలు కూర్చోబెట్టాలనుకోవడం దుస్సాహసం. పవన్ హీరోగా తన అభిమానుల్ని ఎంతగా ఎంటర్టైన్ చేయాలో అంతగా చేశాడు. కానీ రచయితగా మాత్రం పవన్ సక్సెస్ కాలేకపోయాడు. అతడు అందించిన కథాకథనాలే ‘సర్దార్’కు పెద్ద మైనస్ పాయింట్స్.

గబ్బర్ సింగ్.. పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించిన సినిమా. ఐతే పవన్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూనే సగటు ప్రేక్షకుడిని కూడా అలరించింది ఆ చిత్రం. ‘గబ్బర్ సింగ్’ స్ఫూర్తితో తెరకెక్కిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పవన్ అభిమానుల్ని అలరించే విషయంలో మాత్రమే విజయవంతమైంది. అభిమానుల్ని దృష్టిలో ఉంచుకునే రకరకాల ఆకర్షణలు జోడించే ప్రయత్నం చేశారు కానీ.. కథాకథనాల మీద మాత్రం పవన్ కానీ.. దర్శకుడు బాబీ కానీ.. పెద్దగా దృష్టిపెట్టినట్లు కనిపించదు.

చెప్పుకోదగ్గ కథంటూ ఏమీ లేకపోయినా.. ప్రథమార్ధం వరకు పవన్ పంచే వినోదంతో - మాస్ మసాలా అంశాలతో బండి బాగానే నడిచిపోతుంది. ఇంట్రడక్షన్ సీన్ నుంచే పవన్ డ్రైవర్ సీట్లోకి వచ్చేసి.. వన్ మ్యాన్ షో మొదలుపెట్టేస్తాడు. కాజల్ తో అతడి రొమాన్స్ వర్కవుట్ కావడం.. తౌబా తౌబా.. సుబానల్లా లాంటి మంచి పాటలు పడటం.. ఇంటర్వెల్ ముందు సినిమాకు హైలైట్ అనదగ్గ యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకోవడంతో ఫస్టాఫ్ వరకు పైసా వసూల్ అనిపిస్తుంది ‘సర్దార్ గబ్బర్ సింగ్’.

ఐతే ద్వితీయార్ధానికి వచ్చేసరికి కథనం ఓ తలా తోకా లేకుండా సాగుతుంది. ఏ సన్నివేశం ఎందుకొస్తుందో తెలియనట్లు గందరగోళానికి గురి చేస్తూ.. ఒకదాని తర్వాత ఒకటి సంబంధం లేని సీన్స్ వచ్చి పడుతుంటాయి. అసలే సన్నివేశాల్లో పస లేదంటే.. హడావుడి ఎడిటింగ్ కారణంగా చాలా సన్నివేశాలు అర్ధంతరంగా ముగిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రథమార్ధం వరకు కథంటూ ఏమీ లేకపోయినా చెల్లిపోయింది కానీ.. ద్వితీయార్ధంలో కూడా అలాగే నడిపించేసరికి కథనం నత్తనడకన సాగుతుంది. హీరో-విలన్ మధ్య సంఘర్షణ అన్నదే లేకుండా ఏకపక్షంగా కథనాన్ని నడిపించడంతో ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ఓ దశలో విలన్ పాత్ర పూర్తిగా పక్కకు వెళ్లిపోయి.. కథనంతో సంబంధం లేని సన్నివేశాలు వచ్చిపోతుంటాయి.

హీరోకు ఏదో ఒక సమస్య పెట్టాలి తప్పదు అన్నట్లు క్లైమాక్స్ ముందు హడావుడిగా అతణ్ని ఇబ్బందులు సృష్టించినట్లుంది తప్ప.. హీరో-విలన్ వైరాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరో కేసులో ఇరుక్కోవడం.. హీరోయిన్ విలన్ తో పెళ్లికి ఒప్పుకోవడం.. ఇవన్నీ కూడా డ్రమటిగ్గా అనిపిస్తాయి. అభిమానుల్ని అలరించడం కోసం ‘సంగీత్’ ఎపిసోడ్ కూడా బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. ఐతే ఇందులో వీణ స్టెప్పుతో పాటు పవన్ డ్యాన్సులు - మేనరిజమ్స్ అన్నీ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయి. ఓవరాల్ గా చూస్తే.. పవన్ అభిమానుల వరకు వినోదానికి ఢోకా లేని సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’.

నటీనటులు:

సందేహం లేదు.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పవన్ వన్ మ్యాన్ షో. ప్రతి సన్నివేశంలోనూ తన అభిమానుల్ని అలరించడం కోసం పవన్ వంద శాతం ప్రయత్నం చేశాడు. అతడి మేనరిజమ్స్.. డైలాగులు.. డ్యాన్సులు.. ఫైట్లు.. అన్నీ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయి. యువరాణి పాత్రలో కాజల్ ఒదిగిపోయింది. ఆమె అందం, అభినయం రెండూ ఆకట్టుకుంటాయి. విలన్ శరద్ ఖేల్కర్ ఓకే అనిపిస్తాడు. అతడికి డబ్బింగ్ కుదర్లేదు. వాయిస్-లిప్ సింకవ్వలేదు. ఈ పాత్రలో కూడా పెద్దగా విశేషమేమీ లేదు. బ్రహ్మానందం ఓ మోస్తరుగా నవ్వించాడు. ఊర్వశి కూడా బాగా చేసింది. ముఖేష్ రుషి ఆకట్టుకున్నాడు. కబీర్ సింగ్ ది చాలా మామూలు పాత్ర. ఆలీ-నర్రా శీను-బ్రహ్మాజీ-రఘుబాబు.. వీళ్లందరికీ కూడా తమ టాలెంట్ చూపించే అవకాశమేమీ రాలేదు.

సాంకేతికవర్గం:

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇంతకుముందు పవన్ తో చేసిన సినిమాలన్నింటితో పోలిస్తే.. ఇదే వీక్ ఔట్ పుట్ అని చెప్పాలి. తౌబా తౌబా పాట ఒక్కటే ప్రత్యేకంగా అనిపిస్తుంది. సుభానల్లా.. నీ చేపకళ్లు.. పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ఐతే తౌబా తౌబా మినహాయిస్తే.. పాటల చిత్రీకరణ పేలవం. హడావుడిగా.. మొక్కుబడిగా చుట్టేసినట్లు అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలుగా ఉంది. ఆర్థర్ విల్సన్ ఛాయాగ్రహణం బాగుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్లో కెమెరా పనితనం కనిపిస్తుంది. సాంకేతిక నిపుణుల్లో అందరికంటే ఎక్కువ కష్టం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలిదే. సినిమాలో ప్రతి సన్నివేశంలో ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది. విడుదలకు ముందు ‘సర్దార్’ టీం పడ్డ హడావుడి ప్రభావం సినిమా మీద పడింది. ఎడిటింగ్ గందరగోళంగా తయారైంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయిమాధవ్ బుర్రా మంచి మాటలు రాశాడు. ‘‘ప్రతి వాడూ భూమి నా సొంతం అనుకుంటాడు.. కానీ ఈ భూమికే ప్రతి ఒక్కడూ సొంతం’’ లాంటి ఫిలసాఫికల్ డైలాగులతో పాటు.. పంచ్ డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ బాబీ పవన్ స్క్రిప్టుకు కమర్షియల్ ముద్ర వేసే ప్రయత్నం చేశాడు కానీ.. దర్శకుడిగా తన ముద్రంటూ ఏమీ చూపించలేకపోయాడు. అతను దాదాపుగా పవన్ ఆలోచనలకు తగ్గట్లే పని చేశాడు.

చివరగా: సర్దార్ గబ్బర్ సింగ్.. పవన్ అభిమానులకు మాత్రమే.

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre