Begin typing your search above and press return to search.

50 ఏళ్ల ఏజ్ లో వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ.. ఇస్పెషల్ లెజెండ్ శరవణన్!

By:  Tupaki Desk   |   28 July 2022 10:36 AM GMT
50 ఏళ్ల ఏజ్ లో వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ.. ఇస్పెషల్ లెజెండ్ శరవణన్!
X
ఈ మధ్యన 'లెజెండ్ శరవణన్' పేరుతో పోస్టర్లు భారీగా దర్శనమిస్తున్నాయి. ఈ రోజే విడుదలైన ఈ మూవీ మీద కాసింత ఆసక్తి వ్యక్తమవుతోంది. ట్రైలర్ ను చూసినంతనే భారీతనం ఉట్టిపడేలా ఉన్న ఈ మూవీలో.. హీరో పాత్రధారిని చూసింది లేదు. పరిచయం కూడా లేదు. చూసినంతనే కాస్త సిత్రంగా ఉన్న ఈ హీరో గురించి ఆరా తీస్తే రోటీన్ కు భిన్నం ఈ మూవీ అని చెప్పాలి.

ఇక.. హీరో విషయానికి వస్తే.. అతగాడి సినిమా సంగతి తర్వాత.. అతడి రియల్ లైఫ్ కాస్తంత సినిమాటిక్. అలాంటి అతడు యాభై ఏళ్ల వయసులో.. వెండితెర మీద మెరిసిపోవాలన్న లక్ష్యంతో సొంత డబ్బులతో తీసిందే ఈ మూవీ. లెజెండ్ శరవణన్ సినిమా సంగతి పక్కన పెడితే.. ఈ మూవీ హీరో లైఫ్ మరింత ఆసక్తికరంగా చెప్పాలి.

భారీ ప్రమోషన్స్ మధ్య విడుదలైన ఈ మూవీ హీరో ఎవరో కాదు.. తమిళనాడుతోనూ.. చెన్నై మహానగరంతో ఏ మాత్రం లింకులు ఉన్నా తెలిసే పేరు 'శరవణన్ స్టోర్'.దాని యజమానే ఈ మూవీ హీరో. వేల కోట్ల రూపాయిలకు అధిపతి అయిన శరవణన్ స్టోర్ యజమాని తన చిరకాల కోరిక.. సినిమాలో నటించాలని. దానని సాకారం చేసుకోవటానికి స్వీయ నిర్మాణ సంస్థతో ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీలో తన సరసన ఊర్వశి రౌటేలా కథానాయికగా ఎంపిక చేసుకున్నారు.

భారీతనం ఉట్టిపడేలా.. ఆసక్తికరకథనంతో సినిమాను నిర్మించటమే కాదు.. నటీనటుల ఎంపికలోనూ భారీ సినిమాకు ఏ మాత్రం తగ్గని రీతిలో నిర్మించటం విశేషం. టెక్స్‌టైల్స్‌, జ్యువెలరీ స్టోర్స్‌తో పాటు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, నగలు ..ఏదైనా సరే శరవణన్ స్టోర్స్ లో దొరకనిదే లేదన్న పేరున్న దీని యజమానే అరుళ్ శరవణన్. శరవణన్ స్టోర్ వ్యవస్థాపకుడు శరవణన్ సెల్వరత్నమ్ కుమారుడే ఈ అరుళ్. 1970లో చెన్నైలో జన్మించిన ఇతడు వ్యాపారవేత్తగా సుపరిచితుడు. చదువు పూర్తైన వెంటనే వ్యాపారంలోకి వచ్చేసిన ఇతడు.. బిజినెస్ లో తలమునకలైపోయాడు.

వ్యాపారంలో భాగంగా స్టోర్స్ ప్రమోషన్ కోసం మోడల్ గా నటించి.. అందరిని ఆకర్షించాడు. నటన మీద తనకున్న మక్కువను తీర్చుకోవటం కోసం సినిమా చేయాలన్న అతడి కల తాజా మూవీతో నెరవేరింది. బిజినెస్ యాడ్స్ లో అగ్రతారలైన తమన్నా.. హన్సికలతో అతడు చేసిన ప్రచార చిత్రాలు హాట్ టాపిక్ అయ్యేలా చేశాయి.

సినిమాల్లో నటించాలన్న తపనతో ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో చేరి కోర్సు పూర్తి చేసిన అతడు.. జె.డి. జెర్రీ దర్శకత్వంలో తాజా మూవీని ప్లాన్ చేశాడు. గతంలో ఈ దర్శకుడు అజిత్ తో ఉల్లాసం మూవీని తీసి తన సత్తా చాటారు. ప్రచార చిత్రాల్ని చూసినప్పుడు.. హీరోగారి ఫేస్ ను ఎక్కువగా హైలెట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్న వైనం చూస్తే.. దర్శకుడు ఈ మూవీ కోసం చాలానే కసరత్తు చేశారనిపించక మానదు. సైంటిస్టుగా నటిస్తున్న ఈ వ్యాపారవేత్త కమ్ హీరో వెండితెర మీద ఎంతమేర వెలుగుతారో చూడాలి.