Begin typing your search above and press return to search.

'ది లెజెండ్' మినీ రివ్యూ: ట్రోలర్స్ కు కావాల్సినంత స్టఫ్ ఇచ్చే మూవీ!

By:  Tupaki Desk   |   28 July 2022 11:31 AM GMT
ది లెజెండ్ మినీ రివ్యూ: ట్రోలర్స్ కు కావాల్సినంత స్టఫ్ ఇచ్చే మూవీ!
X
లెజెండ్ శరవణన్ గా పిలవబడుతున్న శరవణ స్టోర్స్ అధినేత అరుల్ శరవణన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చిన్నప్పటి నుంచే నటనపై మక్కువ పెంచుకున్న ఈ బిజినెస్ మ్యాన్.. తన వ్యాపార ప్రకటనల్లో తనే నటిస్తూ వచ్చాడు. స్టార్ హీరోయిన్లు తమన్నా భాటియా - హన్సిక మోత్వానిలతో ఆయన రూపొందించిన యాడ్స్ అప్పట్లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.. అంతుకుమించి ట్రోల్స్ ఎదుర్కొన్నాయి.

ఎలా అయితేనేం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ రావడంతో ఎలాగైనా నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు లెజెండ్ శరవణన్. అందుకోసం చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోర్సు కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. ఇన్నాళ్లూ వ్యాపారవేత్తగా రాణించిన ఆయన.. నటనకు ఏజ్ అడ్డంకి కాదంటూ 50ఏళ్ల వయసులో ''ది లెజెండ్'' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసాడు.

25 ఏళ్ల కెరీర్ లో కేవలం రెండు సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసిన దర్శకద్వయం జేడీ- జెర్రీ.. లెజెండ్ ని హీరోగా లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ తో అగ్ర హీరోలకు ఏమాత్రం తగ్గని రీతిలో 'ది లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరికీ క్లారిటీ వచ్చేసింది.

రిలీజ్ కు ముందే అందరి దృష్టిని ఆకర్షించిన 'ది లెజెండ్' సినిమా ఈరోజు గురువారం థియేటర్లలోకి వచ్చింది. కేవలం తమిళ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కథ విషయానికొస్తే.. ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన డా. శరవణన్.. తన ఆవిష్కరణలతో మాతృ భూమికి పుట్టిన గ్రామానికి సేవ చేయాలని నిర్ణయించుకుంటాడు. విదేశాల నుంచి తన గ్రామానికి తిరిగి వచ్చి.. తాను అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తాడు. కానీ స్థానిక రాజకీయ నాయకులు మరియు డ్రగ్స్ మాఫియా అతని అనేక అడ్డంకులు సృష్టిస్తారు. శరవణన్ వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అతని కలను ఎలా సాకారం చేసుకున్నాడు? అనేది 'ది లెజెండ్' కథ.

స్టోరీ లైన్ వింటుంటేనే గతంలో తెలుగు తమిళ భాషల్లో ఎన్నోసార్లు చూసిన కమర్షియల్ సినిమాలు గుర్తుకు రాకమానదు. ముఖ్యంగా 'శివాజీ: ది బాస్' 'మెర్సల్' (అదిరింది) వంటి సినిమాలను కలిపి తీసారా అనే సందేహాలు కలుగుతాయి. సినిమా చూసిన వారికి 'KGF' 'అఖండ' వంటి పలు వంటి సౌత్ ఇండియన్ కమర్షియల్ చిత్రాల్లోని సీన్స్ ప్రేక్షకులకు గుర్తు చేస్తాయి. దర్శకులు జేడీ- జెర్రీ ఎంతో సాధారణమైన పాత కథను ఏమాత్రం కొత్తదనం లేకుండా లెజెండ్ తో తీశారని స్పష్టం అవుతోంది.

పక్కా కమర్షియల్‌ చిత్రానికి కావాల్సిన పాటలు - డాన్సులు - ఫైట్స్ వంటి అంశాలతో ఈ సినిమాని రూపొందించారు. ఎక్కువ భాగం ఫైట్ సీక్వెన్స్‌లు - పాటలు - బిల్డ్ అప్‌ షాట్స్ కోసం కేటాయించారు. అవి కూడా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కాకపోతే స్క్రీన్ మీద సీరియస్ గా చేసిన కొన్ని సీన్స్ మాత్రం ఆడియన్స్ కామెడీగా తీసుకుంటే నవ్వుతూ ఎంజాయ్ చేయెచ్చు.

లెజండ్ సినిమాలో హీరోయిన్‌ - విలన్ దగ్గర నుంచి కమెడియన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టుల వరకు అంతా బాగా పేరున్న వారే ఉన్నారు. శరవణన్ సరసన గీతికా - అందాల భామలు ఊర్వశీ రౌతెల హీరోయిన్లుగా నటిస్తే.. రాయ్ లక్ష్మీ - యాషికా ఆనంద్ సాంగ్స్ లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. సుమన్ విలన్ గా నటించగా.. ప్రభు - నాజర్ - విజయ్ కుమార్ - లత - మన్సూర్ అలీఖాన్ - యోగిబాబు - వివేక్ - రోబో శంకర్ వంటి ప్రముఖ నటీనటులు ఇతర పాత్రలు పోషించారు.

అంతమంది యాక్టర్స్ ఉన్నా నటనకు పెద్దగా స్కోప్ లేదు. దీనికి కారణం సినిమా అంతా శరవణన్ వన్ మ్యాన్ షో గా ఉండటమే. సినిమాలో మైనస్ పాయింట్స్ లో మొదటగా హీరోనే అని చెప్పాలి. శరవణన్ చాలా సన్నివేశాల్లో పూర్తిగా ఎలాంటి హావభావాలు లేకుండా.. చాలా సీన్స్ లో ఒక బొమ్మలా కనిపిస్తాడు. అంతేకాదు చాలా వరకు తన అభిమాన హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ ను అనుకరించే ప్రయత్నం చేసాడు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే 'ది లెజెండ్' సినిమాని నిలబెట్టింది వాళ్లే అని చెప్పాలి. విజువల్ గా చాలా గ్రాండ్‌ గా ప్రెజెంట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ హారిస్‌ జయరాజ్‌ స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు. వేల్‌ రాజ్‌ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రూబెన్‌ ఎడిటింగ్‌ కూడా గొప్పగానే ఉంది. నిర్మాత కూడా శరవణనే కాబట్టి.. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఆ విషయంలో లెజండ్ ఎక్కడా తగ్గలేదు.

మొత్తం మీద 'ది లెజెండ్' అనేది ఏమాత్రం కొత్తదనం లేని రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ట్రోలర్స్ కు కావాల్సినంత స్టఫ్ ఇచ్చే మూవీ. అలానే బీహీరో కావడానికి వయసుతో సంబంధం లేదు కానీ.. డబ్బుతో పాటుగా టాలెంట్‌ కూడా ఉండాలని తెలియజెప్పే సినిమా ఇది. లాంగ్ వీకెండ్ లో 'విక్రాంత్ రోణా' ని తట్టుకొని ఏమాత్రం వసూళ్ళు రాబడుతుందో చూడాలి.