Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: సరైనోడు

By:  Tupaki Desk   |   22 April 2016 10:49 AM GMT
మూవీ రివ్యూ: సరైనోడు
X
చిత్రం : ‘సరైనోడు’

నటీనటులు: అల్లు అర్జున్ - రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ థ్రెసా - ఆది పినిశెట్టి - శ్రీకాంత్ - జయప్రకాష్ - బ్రహ్మానందం - సుమన్ - ప్రదీప్ రావత్ - సురేఖా వాణి - విద్య - అన్నపూర్ణ - ఎల్బీ శ్రీరామ్ - ఆదర్శ్ బాలక‌ృష్ణ తదితరులు
సంగీతం: తమన్
మాటలు: రత్నం
ఛాయాగ్రహణం: రిషి పంజాబి
నిర్మాత: అల్లు అరవింద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను

అల్లు అర్జున్ కొంచెం క్లాస్. బోయపాటి శ్రీను ఊర మాస్. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే కొంచెం ఆశ్చర్యపోయారు జనాలు. మాస్.. ఊర మాస్.. అంటూ టీజర్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు బన్నీ-బోయపాటి. మాస్ ప్రేక్షకులకు ట్రీట్ లాగా కనిపించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గణ (అల్లు అర్జున్) ఎప్పుడూ గొడవలతో సావాసం చేసే రకం. ఆర్మీ ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసి వచ్చేసిన గణ.. తనను కొడుకులాగా చూసుకునే లాయర్ బాబాయి (శ్రీకాంత్)కి సంబంధించిన కేసుల్ని తనదైన శైలిలో డీల్ చేసి పరిష్కరిస్తుంటాడు. మరోవైపు సీఎం కొడుకైన వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) మాఫియా తరహాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటాడు. అరాచకాలకు పాల్పడుతుంటాడు. ఐతే తన జీవితంలోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిల కారణంగా అనుకోని విధంగా గణ.. ధనుష్ ను ఢీకొట్టాల్సి వస్తుంది. గణ కారణంగా ధనుష్ అహం దెబ్బ తిని.. అతను పగతో రగిలిపోతాడు. పగ తీర్చుకోవడానికి ధనుష్ ఏం చేశాడు.. గణ అతడిని ఎలా ఎదుర్కొని విజయం సాధించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

బోయపాటి సినిమాలన్నింటినీ పరిశీలిస్తే అతడి కథలన్నీ దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. అత్యంత దుర్మార్గుడైన ఓ విలన్.. అడ్డు అదుపు లేకుండా అరాచకాలకు పాల్పడుతుంటాడు. అతడి ధాటికి జనం అల్లాడిపోతుంటారు.. తమను రక్షించేవాడి కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. అప్పుడు వీరత్వానికి మరోపేరైన హీరో రంగంలోకి దిగుతాడు. విలన్ని గట్టి దెబ్బ తీస్తాడు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగుతుంది. చివరికి విలన్ మీద హీరో పైచేయి సాధిస్తాడు. ఈ సన్నటి లైన్ చుట్టూనే అతడి కథలన్నీ సాగుతుంటాయి.

‘సరైనోడు’ కూడా దాదాపుగా అదే ఫార్మాట్లో సాగేదే. ఏమాత్రం కొత్తదనం లేని.. విషయం లేని కథ ‘సరైనోడు’కు పెద్ద మైనస్. కాకపోతే ఎప్పట్లాగే హీరో-విలన్ పాత్రల్ని బలంగా తీర్చిదిద్దుకోవడం.. ఇద్దరి మధ్య పోరును ఆసక్తికరంగా నడిపించడం.. తన నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలకు లోటు లేకుండా చూసుకోడం.. అల్లు అర్జున్-ఆదిల స్క్రీన్ ప్రెజెన్స్.. ఇలాంటి సానుకూలతలు సినిమాను చాలా వరకు నిలబెట్టాయి. మాస్ ను ఉర్రూతలూగించే సినిమా అవుతుందన్న అంచనాల్ని అందుకోవడంలో ‘సరైనోడు’ సక్సెస్ అయింది. ఇది పక్కా బోయపాటి మార్కు సినిమా. అతను ఇప్పటిదాకా బాలయ్యతో తీసిన కథల్లోనే బన్నీని రీప్లేస్ చేశాడంతే. అల్లు అర్జున్ అందులో బాగానే ఒదిగిపోయినప్పటికీ.. బన్నీ సినిమాల నుంచి సహజంగా ఆశించే రొమాన్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. ఎంటర్టైన్మెంట్.. డోస్ సరిగా పడకపోవడంతో ‘సరైనోడు’ వీక్ గా అనిపిస్తుంది.

విలన్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత బాగా పండుతుందంటూ ఆది క్యారెక్టర్ గురించి బోయపాటి చాలా చెప్పాడు కానీ.. నిజంగా ఆ పాత్ర ఆ మాటలకు తగ్గట్లుగా లేదు. ఆది ఆ పాత్రకు సూటయ్యాడు.. బాగానే పెర్ఫామ్ చేశాడు కానీ.. ఆ క్యారెక్టర్ని బోయపాటి బలంగా తీర్చిదిద్దలేకపోయాడు. హీరోయిజం ఏకపక్షంగా సాగిపోవడం.. హీరో-విలన్ ఎదురుపడ్డానికి చాలా సమయం పట్టడంతో ప్రేక్షకులు నీరసించి పోతారు. ముందు నుంచి ఇద్దరికీ నేరుగా వైరం పెట్టి.. ఎత్తులు పై ఎత్తులతో కథనాన్ని నడిపించి ఉంటే వ్యవహారం వేరుగా ఉండేది. వీళ్లిద్దరూ తొలిసారి ఎదురు పడ్డ కాసేపటికే నేరుగా క్లైమాక్స్ వచ్చేస్తుంది. 2 గంటల 40 నిమిషాల నిడివిలో హీరో-విలన్ మధ్య డైరెక్ట్ వార్ చూడ్డానికి ప్రేక్షకులు 2 గంటలు ఎదురు చూడాల్సి రావడం చిత్రం.

హీరోయిజం పండించే విషయంలో బోయపాటి తన ముద్రను మరోసారి చూపించినప్పటికీ.. బన్నీ సినిమా నుంచి ఆశించే రొమాన్స్.. ఎంటర్టైన్మెంట్ కోసం అతను చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. కేథరిన్ థ్రెసాను కొంచెం వెరైటీగా ఎమ్మెల్యే పాత్రలో చూపించి.. తనకు బన్నీకి మధ్య రొమాంటిక్ ట్రాక్ ఒకటి నడిపించాడు కానీ.. అది అంతగా ఆకట్టుకోదు. తమిళ అమ్మాయి విద్యతో చేయించిన సాంబార్ కామెడీ పర్వాలేదు. బ్రహ్మానందం రెండు మూడు సన్నివేశాల్లో కొన్ని పంచ్ లు పేల్చాడు.

పాత్రల పరిచయం.. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్.. కాస్త కామెడీ కలగలిపి అలా అలా ప్రథమార్ధాన్ని నడిపించేసిన బోయపాటి.. ఎప్పట్లాగే భారీ ఇంటర్వెల్ బ్యాంగ్ సెట్ చేసి పెట్టుకున్నాడు. ఈ సన్నివేశం ‘లెజెండ్’ సినిమాను తలపిస్తుంది. బోయపాటిలోని అసలైన దర్శకుడు నిద్ర లేచేది అక్కడే. ద్వితీయార్ధంలో హీరో- విలన్ తొలిసారి ఎదురుపడే సీన్ పేలింది. కానీ అంతకుముందు వచ్చే సన్నివేశాలు మాత్రం సాగతీతలా అనిపిస్తాయి. సినిమాలో కనీసం 20 నిమిషాలైనా కోత పెట్టాల్సింది. విషయం లేని కథతో ఇంత పెద్ద సినిమా తీయడం సాహసమే. క్లైమాక్స్ అనుకున్న స్థాయిలో లేదు. ‘రేసుగుర్రం’ స్టయిల్లో సినిమాను ముగించాలని పెట్టిన సీన్ సిల్లీగా అనిపిస్తుంది.

సినిమాలో చాలా సన్నివేశాలు.. చివరికి క్లైమాక్స్ కూడా ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. అంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించే విలన్.. తనను దెబ్బ కొట్టిన వాడు ఎవడో తెలుసుకోకపోవడం.. హీరోయిన్ అతడి నుంచి తప్పించుకుని పరుగెత్తుకుంటూ వచ్చేయడం.. లాజికల్ గా అనిపించవు. డీజీపీని అతడి ఆఫీస్ లోనే కాల్చేయడం.. విలన్ తన అరాచకాల్ని సాగించే తీరు కూడా అతిగా అనిపిస్తాయి. ఐతే బోయపాటి సినిమాల్లో ఇలాంటి ‘అతి’ సహజం అని సరిపెట్టుకోవాలి. యాక్షన్ ప్రియులకు.. మాస్ ప్రేక్షకులకు ‘సరైనోడు’ సరైన సినిమాగా అనిపించినా.. కథలో కొత్తదనం లేకపోవడం.. బన్నీ నుంచి ఆశించే క్లాస్ ఎంటర్టైన్మెంట్ మిస్ కావడం సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్ లు.

నటీనటులు:

‘సన్నాఫ్ సత్యమూర్తి’లో అల్లు అర్జున్ ను చూసి.. ‘సరైనోడు’లో అతణ్ని చూస్తే షాకవడం ఖాయం. అతను మాస్ పాత్రలోకి ఈజీగానే ట్రాన్స్ ఫామ్ అయిపోయాడు. పాత్రకు తగ్గట్లే బలంగా తయారై.. తన బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకుని.. తొలిసారి తనను తాను పూర్తి స్థాయి మాస్ హీరోగా ఆవిష్కరించుకున్నాడు బన్నీ. యాటిట్యూడ్ చూపించే సన్నివేశాల్లో అతడి నటన బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో చాలా బాగా చేశాడు. ఇక డ్యాన్సులు.. ఫైట్లలోనూ ఎప్పట్లాగే ఆకట్టుకున్నాడు. బన్నీకి దీటుగా విలన్ పాత్రలో అదరగొట్టాడు ఆది పినిశెట్టి. సినిమా చూశాక బన్నీ కంటే కూడా ఆది పాత్రే ఎక్కువ గుర్తుంటుందంటే అతిశయోక్తి కాదు. అంత బాగా వైరం ధనుష్ పాత్రలో ఒదిగిపోయాడతను. హీరోయిన్లు రకుల్.. కేథరిన్.. పాటలకు ఉపయోగపడ్డారు. వారి పాత్రల్ని సరిగా తీర్చిదిద్దలేదు. శ్రీకాంత్ పాత్ర పర్వాలేదు. అతడి నటనా బాగుంది కానీ.. ఇది అతను చేయాల్సినంత ప్రత్యేకమైన పాత్రయితే కాదు. హీరో తండ్రిగా తమిళ నటుడు జయప్రకాష్ బాగా చేశాడు. బ్రహ్మానందం ఓ మోస్తరుగా నవ్వించాడు. కమెడియన్ విద్య అరవ కామెడీతో బాగానే ఎంటర్టైన్ చేసింది. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

‘సరైనోడు’కు సాంకేతిక విభాగాలన్నీ దన్నుగా నిలిచాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మాస్ సీన్స్ ఎలివేట్ కావడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటల్లో ‘తెలుసా.. తెలుసా’ వినసొంపుగా ఉంది. మిగతావి మాస్ ప్రేక్షకుల్ని అలరించే మామూలు పాటలే. బ్లాక్ బస్టర్ పాట రాంగ్ టైమింగ్ లో రావడంతో అనుకున్న స్థాయిలో పేలలేదు. రిషి పంజాబి ఛాయాగ్రహణం కూడా సినిమాకు ప్లస్ అయింది. యాక్షన్ సన్నివేశాల్లో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా యాక్షన్ సీన్స్ తీర్చిదిద్దారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సినిమాకు హైలైట్.

బోయపాటి శ్రీను ఆస్థాన రచయిత రత్నం.. దర్శకుడి టేస్టుకు తగ్గట్లే మాటలు రాశాడు. ‘‘న్యాయం నాలుగు కాళ్ల మీద నడవాలి.. అన్యాయానికి అసలు కాళ్లే ఉండకూడదు’’ లాంటి డైలాగులు బాగా పేలాయి. ఐతే ఒక మూసలో సాగే కొన్ని డైలాగులు బోరింగ్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువల విషయంలో అల్లు అరవింద్ ఎక్కడా రాజీ పడలేదు. ఆయన పెట్టిన ఖర్చు తెరమీద కనిపిస్తుంది. ఇక దర్శకుడు బోయపాటి తన నుంచి జనాలు ఆశించే సినిమానే అందించాడు. తనకు అలవాటైన ఫార్మాట్లోనే.. తన పరిమితుల్లోనే సినిమా తీశాడు. హీరో-విలన్ క్యారెక్టరైజేషన్లు.. వీళ్ల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో బోయపాటి ముద్ర కనిపిస్తుంది. మాస్ జనాలు విజిల్స్ కొట్టేలా సన్నివేశాలు తీర్చిదిద్దాడు. ఐతే కథ పరంగా బోయపాటి నిరాశ పరిచాడు. సింహా దగ్గర్నుంచి వరుసగా మూడో సినిమాలోనూ ఒకే కథను చూపించాడు.

చివరగా: మాస్ కు మాత్రమే ‘సరైనోడు’

రేటింగ్- 2.75/5



Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre