Begin typing your search above and press return to search.

సప్తగిరి కెరీర్ ఎలా మలుపు తిరిగింది?

By:  Tupaki Desk   |   16 Oct 2016 5:30 PM GMT
సప్తగిరి కెరీర్ ఎలా మలుపు తిరిగింది?
X
సప్తగిరి.. ప్రస్తుతం తెలుగులో లీడింగ్ కమెడియన్లలో ఒకడు. అతను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అసిస్టెంట్ డైరెక్టర్‌ గా. కానీ అనుకోకుండా ‘పరుగు’ సినిమాతో నటుడిగా మారాడు. ఆ తర్వాత ‘ప్రేమకథా చిత్రమ్’తో అతడి కెరీర్ మలుపు తిరిగింది. మరి దర్శకత్వ శాఖలో చేరిన అతడికి నటుడిగా ఎలా అవకాశం వచ్చిందో.. ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాకు ఎలా ఎంపికయ్యాడో.. అతడి కెరీర్ ఎలా మలుపు తిరిగిందో.. ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సప్తగిరి. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

‘‘నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి వచ్చాను. ‘ఎ ఫిలిం బై అరవింద్’ నా తొలి సినిమా. ఆ తర్వాత బొమ్మరిల్లు.. పరుగు.. ఓయ్ సినిమాలకు కూడా పని చేశాను. ‘బొమ్మరిల్లు’ చిత్రానికి అసిస్టెంటుగా పనిచేసే సమయంలో నా బాడీలాంగ్వేజ్‌.. నా మాటల్ని దర్శకుడు భాస్కర్‌ గారు బాగా ఎంజాయ్‌ చేసేవారు. ఆయనే ‘పరుగు’ సినిమాలో చిన్న క్యారెక్టర్ నాతో చేయించారు. బయట ఎలా ఉంటానో కెమెరా ముందు కూడా అలాగే ఉండమన్నారు. ‘ఇపుడు మన పొజీషనేంటి సార్‌’ అనే నా డైలాగ్ బాగా ఫేమస్ అయింది’’ అన్నాడు సప్తగిరి.

ఇక తన కెరీర్ ను మలుపు తిప్పిన ‘ప్రేమకథా చిత్రమ్’ గురించి చెబుతూ.. ‘‘నేను అసిస్టెంటుగా పనిచేసిన ‘ఎ ఫిలిం బై అరవింద్‌’ సినిమాకు మారుతిగారు కో-ప్రొడ్యూసర్‌. ‘ప్రేమకథా చిత్రమ్‌’లో క్యారెక్టర్‌ ఉందని పిలిస్తే షూటింగ్‌ లొకేషన్‌ కు వెళ్లాను. తొలి రోజు రాత్రి షూటింగ్‌. మారుతి గారు డైలాగ్‌ పేపర్‌ ఇచ్చారు. అది చదివాక డైలాగ్‌ బావుందని.. ఐతే నా స్టయిల్లో చెబుతానని అన్నాను. ఆ రోజు రాంత్రంగా షూటింగ్ జరిగింది. మా చిత్తూరు యాసలో ఏంది పిల్లకాయలు ఇట్లుండారు.. అంటూ డైలాగ్ చెప్పాను. షూటింగ్ స్పాట్లో ఉన్నోళ్లలో కొందరు నవ్వారు. కొందరు సైలెంటుగా ఉన్నారు. నాకు అసలు నా క్యారెక్టర్ ఉందో లేదో అన్న సందేహం కలిగింది. మరుసటి రోజు ఉదయం మారుతి.. తాను ఎలాంటి వాడి కోసం ఎదురు చూస్తున్నానో అలాంటోడిని నేనేనని... నా కామెడి టైమింగ్ అదిరిపోయిందని.. రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు చేయమని అన్నాడు. అదృష్టవశాత్తూ నేను చేసింది అందరికీ నచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్టయి నా కెరీర్ మలుపు తిరిగింది’’ అని సప్తగిరి చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/