Begin typing your search above and press return to search.

ఆ కమెడియన్ కూడా హీరో అయిపోతున్నాడహో

By:  Tupaki Desk   |   17 Jan 2016 4:28 AM GMT
ఆ కమెడియన్ కూడా హీరో అయిపోతున్నాడహో
X
తెలుగు పరిశ్రమలో కమెడియన్లు హీరోలవడం కొత్తేం కాదు. బ్రహ్మానందం దగ్గర్నుంచి.. బాబూమోహన్ - ఆలీ - సునీల్ ఇలా చాలామంది కమెడియన్ టర్న్ డ్ హీరోలను చూశాం. ఇప్పుడు ఇంకో స్టార్ కమెడియన్ హీరో కాబోతున్నట్లు సమాచారం. ఆ కమెడియన్ మరెవరో కాదు.. సప్తగిరి. ‘ప్రేమ కథా చిత్రమ్’ తర్వాత ఫుల్ బిజీ అయిపోయిన సప్తగిరి.. తెర మీద కనిపించగానే జనాలు కేకలు పెట్టే స్థాయిలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. సంక్రాంతికి వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’లో అతడి పాత్రకు అద్భుతమైన స్పందన వస్తోంది కూడా. ఇలాంటి సమయంలో సప్తగిరి హీరోగా సినిమా తెరకెక్కుతుండటం విశేషం.

సప్తగిరి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. 90ల్లో అమ్మదొంగా లాంటి హిట్లు ఇచ్చిన సాగర్.. 2000 తర్వాత కనుమరుగైపోయారు. అప్పుడెప్పుడో రవితేజ హీరోగా ఓ సినిమా తీసిన ఆయన.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలు చాలించేశారు. అలాంటాయన సప్తగిరి లాంటి కమెడియన్ని హీరోగా పెట్టి సినిమా తీయబోతుండటం చిత్రమైన విషయమే. వి.వి.వినాయక్ - శ్రీను వైట్ల లాంటి స్టార్ డైరెక్టర్లు సాగర్ శిష్యులే కావడం విశేషం. సాగర్ మరో శిష్యుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట.