Begin typing your search above and press return to search.

ప్రభాస్ ను చూసే హీరోను కావాలనుకున్నాను

By:  Tupaki Desk   |   30 Oct 2021 3:35 AM GMT
ప్రభాస్ ను చూసే హీరోను కావాలనుకున్నాను
X
సంతోష్ శోభన్ హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మంచి రోజులు వచ్చాయి' రెడీ అవుతోంది. నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ .. "ముందుగా ఈ ఫంక్షన్ కి వచ్చిన అరవింద్ గారికీ .. గోపీచంద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. నేను ఈ ఫంక్షన్ కి వస్తున్నప్పుడు .. నా స్నేహితులు 'ఒరేయ్ స్టేజ్ పై థ్యాంక్స్ కాకుండా ఇంకా ఏమైనా చెప్పారా .. బోరింగ్ స్పీచ్ లు ఇవ్వకు .. వైరల్ కంటెంట్ ఇవ్వరా ' అని అన్నారు. నిజంగా నాకు భయమేసింది.

నేను థ్యాంక్యూలు ఇన్నిసార్లు ఎందుకు చెబుతానంటే, ఈ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు గుర్తుకు వస్తుంది .. ఈ స్టేజ్ ఎక్కడానికి నేను ఎంత కష్టపడ్డానో. ఈ స్టేజ్ పై నన్ను నిలబెట్టడానికి మా అమ్మ పడిన కష్టం గుర్తుకు వస్తుంది .. అందుకే నాకు థ్యాంక్యూ చెప్పాలనిపిస్తుంది. ఒక ఐదారు ఏళ్ల క్రితం సినిమా ఆఫీసుల చుట్టూ ఆడిషన్స్ కోసం తిరిగాను. షేర్ ఆటోల్లో సమయానికి వెళ్లలేకపోతున్నామని తన బండిపై మా ఫ్రెండు నన్ను రోజు నాలుగైదు ఆఫీసుల చుట్టూ తిప్పేవాడు. ఆ రోజున మా టైమ్ బాగుంటే వెళ్లిన చోటున మంచి రెస్పాన్స్ వచ్చేది. ఆ రోజులు గుర్తొస్తున్నాయి కనుకనే థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది.

ఒకప్పుడు 'మిర్చి' సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నానక్ రామ్ గూడాలో జరిగింది. అక్కడికి వెళ్లడానికి పాసులు దొరికితే చాలని అనుకున్నాను. అలాంటి నాకు అదే సంస్థలో రెండో సినిమా చేసే అవకాశం దొరికింది. నిజంగా ఇది అదృష్టం .. ఇక్కడ థ్యాంక్యూ కి మించి ఏం చెప్పాలో నాకు కూడా తెలియడం లేదు. ఈ రోజున యూవీ క్రియేషన్స్ నా ఇల్లు .. నా కుటుంబంగా మారిపోయింది. ఇక నన్ను నమ్మి నేను ఈ పాత్రను చేయగలను అని ఈ పాత్రను ఇచ్చిన మారుతిగారికి థ్యాంక్స్ చెబుతున్నాను.

ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దానిని కూడా పాజిటవ్ గా ఎలా మార్చుకోవాలనేది మారుతి గారి నుంచి నేను నేర్చుకున్నాను. మెహ్రీన్ తో కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మిగతా నటీనటులంతా చాలా గొప్పగా చేశారు. అనూప్ రూబెన్స్ వండర్ఫుల్ మ్యూజిక్ ను ఇచ్చారు. నా చిన్నప్పుడు .. ఫిల్మ్ మేకింగ్ ఇలా ఉంటుంది అనేది తెలియకముందు, అప్పుడు నాకు తెలిసిన హీరో పేరు ప్రభాస్. ఆయనను చూసే హీరోను కావాలనుకున్నాను .. కమర్షియల్ సినిమాలను చేయాలనుకున్నాను.

సక్సెస్ మీట్లో మాట్లాడవలసిన మాటలు .. ప్రీ రిలీజ్ అప్పుడు మాట్లాడుతున్నాడని అనుకోకండి. ఎందుకంటే నా వరకు ఇది ప్రీ రిలీజ్ ఈవెంటే. చాలామందికి ఒక సినిమా తీసి ... అది విడుదలై .. అది ఆడి సూపర్ హిట్ అయితే సక్సెస్ ఏమో .. నాకు మాత్రం షూటింగుకి వెళ్లిన ప్రతి రోజున సక్సెస్ నే. ప్రతి రోజూ పనిచేయగలిగితే అదే నాకు పెద్ద సక్సెస్. తినడానికి ఫుడ్డు .. ఉండటానికి ఇల్లు .. మన సంతోషాలను .. బాధలను పంచుకోవడానికి మనకు ఒక ఫ్యామిలీ .. ఇవన్నీ ఉంటే అవే మంచి రోజులు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది .. థియేటర్స్ మొత్తం కూడా నవ్వులతో నిండిపోవాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.