Begin typing your search above and press return to search.

సినిమా పవరేంటో తెలిసేది థియేటర్లోనే

By:  Tupaki Desk   |   7 Nov 2021 3:33 AM GMT
సినిమా పవరేంటో తెలిసేది థియేటర్లోనే
X
సంతోష్ శోభన్ కొత్త కథలను .. కాన్సెప్టులను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన మారుతి దర్శకత్వంలో 'మంచిరోజులు వచ్చాయి' సినిమా చేశాడు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మంచి సందడిగా చేస్తోంది .. భారీ వసూళ్లను రాబడుతోంది. దాంతో ఈ సినిమా టీమ్ వైజాగ్ లో 'థ్యాంక్యూ మీట్' ను ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై సంతోష్ శోభన్ మాట్లాడాడు.

"ఈ రోజున ఏ థియేటర్ కి వెళ్లినా థియేటర్లలో నవ్వులనే చూశాము. అది మాకు ఎంత ఎనర్జీని ఇచ్చిందనేది మాటల్లో చెప్పలేను. మీ అందరితో కలిసి ఫొటోలు దిగాను .. అవన్నీ నాతో లైఫ్ లాంగ్ ఉంటాయి. మీరిచ్చిన ఈ ఎనర్జీని .. మీరు చూపిస్తున్న ఈ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. సక్సెస్ టూర్ పేరుతో రావడానికి కారణం, మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడం కోసమే. థియేటర్ కి సినిమా వస్తే దాని పవర్ ఎలా ఉంటుందనేది మీరు నిరూపించారు.

సినిమాను థియేటర్లలోనే చూడాలి .. అక్కడే ఎంజాయ్ చేయాలి అని నమ్మినవాడిని నేను. ఒక మంచి సినిమా చేస్తే మీరంతా తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. అందరూ కూడా ఫ్యామిలీస్ తో వెళ్లి ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన యూవీ క్రియేషన్స్ వారికీ .. మారుతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ ముగించాడు.

ఇక నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ .. "గతంలో ఎన్నో షూటింగులు వైజాగ్ లో చేశాము. ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్ ను వైజాగ్ లో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నేను సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఉండటానికి కారణం మారుతినే. నన్నే కాదు .. ఎంతోమందిని ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆయన మంచితనమే ఆయనను ఎప్పుడూ సక్సెస్ లో ఉంచుతుంది. కోవిడ్ తో భయపడుతూ ఇంట్లో కూర్చోగూడదు అనే ఉద్దేశంతో ఈ సినిమాను చేశాము. సాధారణంగా రెండు పాటలో .. నాలుగు ఫైట్లో తీయడానికి పట్టే సమయంలో మారుతి సినిమానే తీసేశాడంటే ఆయన టాలెంట్ ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు" అంటూ చెప్పుకొచ్చాడు.