Begin typing your search above and press return to search.

సంక్రాంతి వార్.. వాయిదాల‌తో రియ‌లైజేష‌న్

By:  Tupaki Desk   |   10 Jan 2022 5:30 AM GMT
సంక్రాంతి వార్.. వాయిదాల‌తో రియ‌లైజేష‌న్
X
సంక్రాంతి సీజ‌న్ అంటే రిలీజ్ ల‌కు పెద్ద పండ‌గ‌. కొత్త అల్లుళ్లు చుట్టాలు ప‌క్కాల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. బాక్సాఫీస్ గ‌ళ్లాపెట్టి నిండ‌టానికి స‌రైన సీజ‌న్ ఇది. అయితే క‌రోనా మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి సంక్రాంతి సీజ‌న్ కూడా ఉసూరుమంది. ఈ ఏడాది కూడా అదే ప‌రిస్థితి. ఇప్ప‌టికే పాన్ ఇండియా చిత్రాలు `ఆర్ ఆర్ ఆర్`..`రాధేశ్యామ్` లు వాయిదా ప‌డ్డాయి. దీంతో అన‌హ్యంగా మీడియం బ‌డ్జెట్ సినిమాల రిలీజ్ లు తెర‌పైకి వ‌చ్చి మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గాయి. జ‌న‌వ‌రి 14న రిలీజ్ అవ్వాల్సిన `శేఖ‌ర్`..`సామాన్యుడు`..`7 డేస్ 6 నైట్స్`..`సూప‌ర్ మ‌చ్చి`..`ఉనికి` చిత్రాలు కూడా వాయిదా వేసారు.

దీంతో `బంగార్రాజు`..` రౌడీ బాయ్స్`..`డీజే టిల్లు` మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని భావించారు. అయితే తాజాగా `డీజే టిల్లు` కూడా వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో భోగి రోజున కేవ‌లం రెండు చిత్ర‌లు మాత్ర‌మే రిలీజ్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ రెండింటి మ‌ధ్య‌నే పోటీ ఉంది. మ‌రి వాయిదా ప‌డిన సినిమాలు ఎందుకు రిలీజ్ తేదీ ప్ర‌క‌టించిన‌ట్లు? ఎందుకు మ‌ళ్లీ వాయిదా వేసారు? అన్న దానిపై స్ప‌ష్ట‌త లేదు. అయితే పాన్ ఇండియా చిత్రాలు రెండు వాయిదా ప‌డ‌టంతో కేవ‌లం డేట్లు లాక్ చేసుకోవ‌డం కోస‌మే ఆ చిత్రాలు రిలీజ్ తేదీ ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. కానీ అన్ని సినిమాలు జ‌న‌వ‌రి 14న పెట్టుకోవ‌డం ఓ కార‌ణ‌మైతే...అలా అన్ని రిలీజ్ అయితే థియేట‌ర్లు స‌రిగ్గా దొర‌క‌వు.

పైగా కోవిడ్ కాబ‌ట్టి అప్ప‌టి ప‌రిస్థితుల్ని బ‌ట్టి ప్ర‌భుత్వాలు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవడానికైనా అవ‌కాశం ఉంది. 50 శాతం అక్యుపెన్సీతో థియేట‌ర్లు ర‌న్ చేయాల‌ని అదేశాలిస్తే సినిమాలు రిలీజ్ చేయ‌డం క‌ష్టం. పైగా ఏపీలో త‌గ్గిన టిక్కెట్ ధ‌ర‌ల‌తో 50 శాతం అంటే న‌ష్టాలే వ‌స్తాయి. ఈ సినిమాల‌కు సంబంధించి ఇంత వ‌ర‌కూ బ‌జ్ కూడా తీసుకురాలేక‌పోయారు. డేట్లు అంటే ప్ర‌క‌టించారు గానీ రిలీజ్ ప్లానింగ్ ప‌క్కాగా లేదు. అందుకే నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తోంది. `బంగార్రాజు` అగ్ర హీరో సినిమా కాబ‌ట్టి ప‌బ్లిసిటీ కూడా పెద్ద‌గా అవ‌సరం లేదు. ఉన్న స‌మ‌యాన్ని స‌రిగ్గా స‌ద్వినియోగం చేసుకుని మ‌రింత మెరుగైన రిలీజ్ తేదీతో ముందుకొస్తార‌నే భావిస్తున్నారు.