Begin typing your search above and press return to search.

అమీర్ అందుకే వద్దన్నాడు

By:  Tupaki Desk   |   31 May 2018 5:30 PM GMT
అమీర్ అందుకే వద్దన్నాడు
X
బయోపిక్ ల హవా బాలీవుడ్లో ఎప్పటినుండో నడుస్తూనే ఉంది కాని అందులో సంజయ్ దత్ బయోపిక్ మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ లుక్ అప్పుడు రన్బీర్ ను చూసిన అందరూ సంజయ్ దత్ పాత్రకి బాగానే సెట్ అయ్యాడే అనుకుని వదిలేశారు. టీజర్ చూశాక బావుందే అనుకున్నారు కానీ ట్రైలర్ మాత్రం అదుర్స్ అంటున్నారు. ఈమధ్యనే విడుదల అయిన ట్రైలర్ పై వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.

ఈ సినిమాలో రన్బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రను పరేశ్ రావల్ పోషిస్తున్న సంగతి ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ మొదట సునీల్ దత్ పాత్రకోసం ఆమిర్ ఖాన్ ను అడిగారట. ఈవిషయాన్ని స్వయానా తానే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. "ఆమిర్ నాకు మంచి స్నేహితుడు. తనతో నా ప్రతి స్క్రిప్ట్ ను డిస్కస్ చేయడం నాకు అలవాటు. అలానే సంజు సినిమా స్క్రిప్ట్ కూడా చెప్పాను. తనకు చాలా బాగా నచ్చింది. అందుకే ధైర్యం చేసి సునీల్ దత్ పాత్ర చేస్తారా అని ఆడిగేసాను" అని చెప్తున్నాడు 3 ఇడియట్స్ - పీకే - మున్నా భాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ హిరాని.

కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఆమిర్ తనకు ఫోన్ చేసి ఇప్పటికే దంగల్ లో తండ్రి పాత్ర పోషించా కాబట్టి మళ్ళీ అలాంటి పాత్రలో కనిపిస్తే అలాంటి కారెక్టర్లకు పరిమితం చేసేస్తారు కాబట్టి ఈ సినిమా తాను చేయలేను అని సున్నితంగా తిరస్కరించడాట. అందులో కూడా నిజం ఉంది అందుకే తను ఇంకేం అనలేదు అని రాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు. స్టార్ కాస్ట్ తో రూపుదిద్దుకున్న సంజు చిత్రం జూన్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది.