Begin typing your search above and press return to search.

సంజ‌య్ - మాధురీ దీక్షిత్ః గుండెల్లో నిండైన ప్రేమ‌.. పెద‌వులు దాట‌లేక‌పోయింది!

By:  Tupaki Desk   |   15 Feb 2021 5:00 AM IST
సంజ‌య్ - మాధురీ దీక్షిత్ః గుండెల్లో నిండైన ప్రేమ‌.. పెద‌వులు దాట‌లేక‌పోయింది!
X
ప్రేమించే మ‌నసు అంద‌రికీ ఉంటుంది.. కానీ, ప్రేమించిన మ‌నిషిని పొందే అవ‌కాశం మాత్రం కొంద‌రికే ద‌క్కుతుంది. ఆ మిగిలిన వారిలో కొంద‌రి ఎడ‌బాటుకు మ‌నుషులు కార‌ణ‌మైతే.. మ‌రికొంద‌రికి ప‌రిస్థితులు శ‌త్రువులుగా మారుతాయి! ఇప్పుడు మ‌నం చెప్పుకోబోతున్న జంట ప్రేమ పండ‌క‌పోవ‌డానికి కార‌ణం ప‌రిస్థితులే! అవి ఎలా ఎదుర‌య్యాయి..? ఎటువైపు దారితీశాయి..? చివరకు వారి ప్రేమను ఎలా ముంచేశాయి? అన్న‌ది చూద్దాం.

సంజయ్‌ దత్.. బాలీవుడ్ లో అప్ర‌క‌టిత నాయ‌క్ అయితే.. మాధురీ దీక్షిత్ వెల్ నౌన్‌ క్వీన్. వీరిద్ద‌రి సినిమా వ‌స్తోందంటే.. ఫ్యాన్స్ కే కాదు.. మీడియాకు కూడా పండ‌గే. అవును.. మ‌రి వారి ప్రేమ క‌థ‌ల‌ను విరివిగా వండి వార్చే ఛాన్స్ ఉంటుంది. వీరిద్ద‌రూ.. తొలి సినిమా స‌గ‌టు హీరో హీరోయిన్ గానే కంప్లీట్‌ చేసినా.. ఐదో సినిమా వ‌చ్చే నాటికి ఆ క‌థే వేరుగా ఉంది. ఈ గ్యాప్ లో ఒక‌రిపై ఒక‌రు గుండెల నిండా ప్రేమ‌ను నింపేసుకున్నారు.

వీరి ఐదో సినిమా ‘సాజన్‌’. ఆ సినిమా ఏ స్థాయిలో హిట్ట‌య్యిందో.. వీరి ప్రేమ కూడా అదే రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టేందుకు సిద్ధ‌మైంది. వీరి ల‌వ్ గురించి ప్రేక్ష‌కులు మాట్లాడుకుంటున్నారు.. మీడియా మాట్లాడుతోంది.. బాలీవుడ్ కూడా మాట్లాడుతోంది.. కానీ.. వీరిద్ద‌రే మాట్లాడుకోలేదు. ఇద్ద‌రి మ‌న‌సులోనూ ఆకాశ‌మంత ప్రేమ ఉంది. కానీ.. అప్ప‌టి దాకా పైకి చెప్పుకోలేదంతే..

‘సాజన్’ సూపర్ హిట్ అయిన సమయంలో మీడియా అడిగింది.. ‘మీ ప్రేమ సంగతేంటీ..’ అని. దానికి.. మాధురి మాధుర్యమైన సమాధానాలే ఇచ్చింది. ‘సంజయ్ నన్ను నవ్విస్తాడు.. నా కోసం ఆలోచిస్తాడు.. అవసరం కోసం నటించే వాడు కాదు. స్వచ్ఛమైన మనిషి’ అని చెప్పింది. అంతేగానీ.. ఆయన్ను నేను ప్రేమిస్తున్నాను అని మాత్రం చెప్పలేదు. బహుశా సంజయ్ నోటి వెంటే వినాలని భావించింది కావొచ్చు.

అయితే.. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే.. సంజయ్‌ దత్‌కి అప్పటికే పెళ్లయింది. ఒక కూతురు కూడా ఉంది. అయితే.. అప్పటికే భార్యతో విభేదాలతో దూరంగా ఉంటున్నాడు సంజయ్. కానీ విడాకులు తీసుకోలేదు. ఈ క్రమంలోనే భార్య రీచా శర్మ క్యాన్సర్‌ బారిన పడింది. చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్లింది. సంజయ్ - మాధురి పై మీడియా రాస్తున్న ప్రేమ కథలు అమెరికా వరకూ పాకాయి. దీంతో.. వెంటనే కూతురితో ఇండియాకు వచ్చేసింది రీచా. ప్రేమ గురించి ఆరాతీస్తే.. అదేం లేదన్నాడు సంజయ్. మనిషి చెప్పకపోతేనేం.. ఆయన ప్రవర్తన చెప్పదా ఏమిటీ? అర్థం చేసుకున్న రీచా శ‌ర్మ తిరిగి అక్క‌డికే వెళ్లిపోయింది. కొన్నాళ్ల‌కు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు విడిచింది.

మాధురి - సంజయ్ ప్రేమ‌పై నెగెటివ్ గా మాట్లాడారు కొంద‌రు. వీరిలో చ‌నిపోయిన రిచా శ‌ర్మ చెల్లెలు కూడా ఉంది. ప్రాణాల‌తో పోరాడుతున్న మా అక్క‌ను వ‌దిలేసిన సంజ‌య్ ను.. మాధురి ఎలా కోరుకుంటుందో అర్థం కావ‌ట్లేదు అన్న‌ది ఆమె. అదే స‌మ‌యంలో మ‌రో ఇన్సిడెంట్ జ‌రిగింది. 1993లో చట్టవిరుద్ధంగా మారణాయుధం కలిగి ఉన్నందుకు టాడా కేసు న‌మోదైంది సంజ‌య్ మీద‌.

జైలుకు కూడా వెళ్లొచ్చాడు సంజ‌య్‌. ఈ ప‌రిణామాల‌న్నీ మాధురిని వెన‌క్కి లాగిన‌ట్టున్నాయ్‌. బాగా ఆలోచించిన‌ట్టుంది. చేస్తున్న‌ది రైట్ కాద‌నుకున్నట్టుంది. సంజయ్ ను మ‌న‌సులోంచి తుడిపేసిన‌ట్టుంది. అందుకే సైలెంట్ అయిపోయింది. జైల్లో ఉన్న సంజయ్‌ను కనీసం ప‌రామ‌ర్శించ‌లేదు. మాధురి నిర్ణయం సంజయ్ కు అర్థ‌మైన‌ట్టుంది. ఆయ‌న కూడా లోలోప‌ల తీవ్రంగా బాధ‌ప‌డిన‌ట్టుంది. బ‌య‌టికి మాత్రం ఏమీ లేద‌న్న‌ట్టుగానే ఉండిపోయాడు.

ఆ త‌ర్వాత మీడియా ఈ ప్రేమ టాపిక్ తెస్తే.. ‘మాధురితో సినిమాలోనే కాదు.. నా జీవితంలో కూడా ఓ ప్రేమ స‌న్నివేశం ఉంటే బాగుండు అని అనుకున్నాను. కానీ.. లేదు కదా’ అన్నాడు.. ఆవేదన మొత్తం మనసులోనే దాచుకుంటూ. చాలాకాలం తర్వాత 2018లో సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ వ‌చ్చింది. అప్పుడు మీడియా క‌ల్పించుకొని మ‌రీ మాధురికి పాత ల‌వ్ స్టోరీని గుర్తు చేసేందుకు ప్ర‌య‌త్నించింది. దీనికి ‘జీవితం చాలా గడిచిపోయింది. ఇప్పుడు ఆ విషయం అవసరం లేదు’ అని చెప్పింది మాధురి. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరు కలుసుకున్నారు. అయితే.. జీవితంలో కాదు.. సినిమాలో! 2019లో ‘కళంక్‌’ అనే సినిమాలో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించారు. మొద‌టి సినిమాలో ముక్కూ ముఖం తెలియ‌ని న‌టీన‌టులు ఎలా ఉంటారో.. ఆ విధంగా!

నిజంగా.. వీరిది ఎంత విచిత్ర‌మైన ప్రేమ క‌థ క‌దా..! ఒక‌రంటే ఒకరు ప్రాణంగా బ‌తికిన ప్రేమ‌.. రెండు గుండెల్లో నిండైన‌ ప్రేమ‌.. పెద‌వులు మాత్రం దాట‌లేక‌పోయింది. మ‌న‌సులోనే ఆగిపోయింది.. అలాగే అంత‌మైపోయింది.