Begin typing your search above and press return to search.

భాయ్ తో మీటింగ్ కి అంత క్యూ!!

By:  Tupaki Desk   |   26 Feb 2016 11:00 PM IST
భాయ్ తో మీటింగ్ కి అంత క్యూ!!
X
బాలీవుడ్ మున్నాభాయ్ జైల్ నుంచి ఇంటికొచ్చేశాడు. మీడియా ముందు తన పడ్డ బాధను చెప్పుకుని, కన్నీళ్లు కూడా పెట్టుకున్న సంజయ్ దత్.. స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాడు. ఎరవాడ జైలు వాతావరణం నుంచి, ఆ పరిస్థితుల నుంచి మెల్లగా బయటపడుతున్నాడు ఈ హీరో. పాపం.. ఈ ఖల్ నాయక్ ని పరామర్శించడానికి బోలెడంత మంది సెలబ్రిటీలు, టాప్ స్టార్ లు ఇంటికి వచ్చేస్తున్నారు కూడా.

ఇప్పటి తరం వాళ్లే కాదు.. ఓ తరం వెనక వారు కూడా అంటే శిల్పాశెట్టి, అమీషా పటేల్ లాంటి సీనియర్ సుందరాంగులు కూడా సంజయ్ దత్ ఇంటికి క్యూ కట్టేస్తున్నారు. ఇదంతా చూస్తున్న జనాలకు అర్ధం కాని విషయం ఏంటంటే.. ఈ సినిమా హీరో ఏదో ప్రపంచాన్నో, దేశాన్నో ఉద్ధరించి జైలుకెళ్లి వచ్చినట్లుగా ఉంది పరిస్థితి. అప్పుడు అక్రమంగా ఆయుధాలు కలిగిఉండడం తప్పు. చేసిన తప్పుకు ఇరవై ఏళ్ల తర్వాత శిక్ష పడింది. కంటిన్యూ గా కాకపోయినా పలు దశలుగా 42నెలల పాటు జైల్లో ఉండొచ్చాడు సంజయ్ దత్.

మరి స్వాతంత్ర్య సమర యోధుడినో, కార్గిల్ యుద్ధ వీరుడినో పలకరించడానికి వెళ్తున్నట్లుగా.. ఇంతేసి మంది వరుసగా క్యూలు కట్టి ఇంటికెళ్లడమెందుకు అర్ధం కాని విషయం. అయినా.. సంజయ్ దత్ శిక్షా కాలం పూర్తయిపోయిందిగా.. మళ్లీ జైలుబాట పట్టాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఇంత హడావిడిగా ఒకరివెనుక ఒకరు క్యూ కట్టాల్సిన పని లేదేమో.