Begin typing your search above and press return to search.

మహేష్ బాబు.. షుగర్ ఫ్యాక్టరీ?

By:  Tupaki Desk   |   30 Jan 2018 12:30 PM GMT
మహేష్ బాబు.. షుగర్ ఫ్యాక్టరీ?
X
మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేయాలంటే చాలా పెద్ద రేంజ్, ఇమేజ్ ఉన్న దర్శకుడే అయ్యుండాలని భావిస్తుంటారు అందరూ. ఐతే అలా పెద్ద అనుకున్న దర్శకులే మహేష్ కు గత కొన్నేళ్లలో దారుణమైన ఫలితాలనందించారు. ‘శ్రీమంతుడు’ మినహా గత నాలుగేళ్లలో మహేష్ నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్లయ్యాయి. మురుగదాస్ లాంటి టాప్ డైరెక్టర్ కూడా మహేష్ కు దారుణమైన ఫలితాన్నే అందించాడు.

ఈ నేపథ్యంలో దర్శకుడి ఇమేజ్ కంటే కూడా కంటెంటే కీలకం అన్న అభిప్రాయం మహేష్ అభిమానుల్లో ఏర్పడింది. బహుశా మహేష్ కూడా ఇప్పుడు ఇలాంటి అభిప్రాయంతోనే ఉండి ఉంటాడేమో. అందుకే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయడానికి మహేష్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ మహేష్ తో సందీప్ మీటింగ్ కూడా జరిగినట్లు గుసగుసలు వినిపించాయి.

ఐతే ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో రీమేక్ చేసే పనిలో ఉన్న సందీప్.. దాదాపు ఇంకో ఏడాది వరకు టాలీవుడ్ వైపు చూడకపోవచ్చు. మహేష్ కూడా ‘భరత్ అను నేను’ తర్వాత వంశీ పైడిపల్లి సినిమా చేయాల్సి ఉంది. ఐతే ఎప్పుడు వీలైతే అప్పుడు ఇద్దరం కలిసి సినిమా చేద్దామని మహేష్ సందీప్ కు హామీ ఇచ్చాడని.. తన తొలి సినిమాగా చేయాలనుకున్న ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనే స్క్రిప్టును మహేష్ కు సందీప్ చెప్పడంతో ఆసక్తి చూపించాడని.. దాన్ని మహేష్ ఇమేజ్ కు తగ్గట్లుగా మార్చి తీసే అవకాశాలున్నాయని అంటున్నారు. చూద్దాం మరి ప్రిన్స్ నిజంగా షుగర్ ఫ్యాక్టరీలోకి అడుగుపెడతాడేమో అని.