Begin typing your search above and press return to search.

సినిమా రిలీజే కాలేదు.. పెద్ద హీరో ఆఫరా?

By:  Tupaki Desk   |   24 Aug 2017 10:59 AM GMT
సినిమా రిలీజే కాలేదు.. పెద్ద హీరో ఆఫరా?
X
అర్జున్ రెడ్డి.. గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమవుతున్న సినిమా. లిప్ లాక్ పోస్టర్ల ద్వారా కావచ్చు.. ప్రోమోల్లోని బూతుల వల్ల కావచ్చు.. అడల్ట్ కంటెంట్ వల్ల కావచ్చు.. హీరో విజయ్ దేవరకొండ ‘అతి’ మాటల వల్ల కావచ్చు.. దీని చుట్టూ నెలకొన్న వివాదాల వల్ల కావచ్చు.. మొత్తానికి ఈ సినిమాకు హైప్ వచ్చిన మాట వాస్తవం. ఐతే ఈ హైప్ ఓపెనింగ్స్ కు ఉపయోగపడొచ్చేమో కానీ.. సినిమాను నిలబెట్టేయదు. కంటెంట్ ఉంటేనే ఏ సినిమా అయినా ఆడుతుంది. ఆసక్తికర టీజర్.. ట్రైలర్ కట్ చేసినంత మాత్రాన అదే స్థాయిలో సినిమా ఉంటుందని ఆశించలేం. ఐతే హీరో విజయ్ అయినా.. దర్శకుడు సందీప్ రెడ్డి అయినా.. తమ సినిమా గురించి ఓ రేంజిలో చెప్పుకుంటున్నారు.

హీరో విజయ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో.. ఆ తర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎలా రెచ్చిపోయాడో తెలిసిందే. అతడి సంగతెలా ఉన్నా.. దర్శకుడు కూడా అదే తరహాలో మాట్లాడటం కొంచెం అతిగానే అనిపిస్తోంది. ఈ సినిమా డ్రగ్ లాగా పని చేస్తుందని.. ఏళ్ల తరబడి నిలిచిపోతుందని అతనన్న మాటలు టూమచ్ అనిపించాయి జనాలకు. హీరో ఎంత మాట్లాడినా దర్శకుడు కొంచెం కామ్ గా ఉంటేనే మంచిది. దర్శకులు చాలా వరకు తమ సినిమా మాట్లాడాలి తప్ప తాము మాట్లాడాలని కోరుకోరు.

ఇక ‘అర్జున్ రెడ్డి’ కోసం ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూల్లో కూడా సందీప్ తన సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ చూపించాడు. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా అతను మాట్లాడేశాడు. ఒక పెద్ద హీరో నుంచి వరుసగా కాల్స్ వస్తున్నట్లు కూడా చెప్పాడు. ఐతే గత ఏడాది ‘పెళ్లిచూపులు’ సినిమా విడుదలైనపుడు తరుణ్ భాస్కర్ కూడా పెద్ద పెద్ద హీరోలతో పని చేయబోతున్నట్లు చెప్పాడు. నెక్స్ట్ హీరో వెంకటేష్ అని కూడా అన్నారు. కానీ ఏడాది గడిచాక కూడా అతడి తర్వాతి సినిమా కన్ఫమ్ కాలేదు. పెద్ద హీరోలెవరూ దొరక్క చివరకి నిఖిల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి సినిమా విడుదలకు ముందే ఓ పెద్ద హీరోతో సినిమా చేసే ఛాన్సులన్నట్లుగా చెబుతున్నాడు సందీప్. చూద్దాం మరి.. ‘అర్జున్ రెడ్డి’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో.. సందీప్ కు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడుతుందో?