Begin typing your search above and press return to search.

కల్ట్ క్లాసిక్ మూవీని 2022లో మళ్ళీ రిలీజ్ చేస్తారట...!

By:  Tupaki Desk   |   26 Aug 2020 5:35 PM GMT
కల్ట్ క్లాసిక్ మూవీని 2022లో మళ్ళీ రిలీజ్ చేస్తారట...!
X
టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలు సృష్టించటంతో పాటు అదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఒక్క సినిమాతో హీరో విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ సందీప్ నేషనల్ వైడ్ పాపులర్ అయ్యారు. లవ్ స్టోరీని ఈ విధంగా కూడా చెపొచ్చా అని ఫిలిం మేకర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే ఈ చిత్ర ప్రభంజనం ఆ తర్వాత బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా కొనసాగింది. బాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి'ని 'కబీర్ సింగ్' పేరుతో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు సందీప్. తమిళనాట కూడా 'ఆదిత్య వర్మ' పేరుతో రీమేక్ కాబడి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 'అర్జున్ రెడ్డి' విడుదలై మూడేళ్లవుతున్నా సినీ అభిమానుల్లో ఆ సినిమా సృష్టించిన అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది.

కాగా 'అర్జున్‌ రెడ్డి' విడుదలై మూడేళ్లయిన సందర్భంగా డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముందు ఈ సినిమాని 4 గంటల 20 నిమిషాల నిడివితో తెరకెక్కించామని.. ఆ తర్వాత కొన్ని కొన్ని సీన్స్ తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. ట్రిమ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్‌ గా 3గం. 45 నిమిషాల సినిమాను రెడీ చేశామని.. కానీ కొన్ని కారణాల వల్ల చివరికి 3 గంటల 'అర్జున్ రెడ్డి'ని మాత్రమే విడుదల చేశామని చెప్పుకొచ్చారు. అయితే ముందుగా అనుకున్నట్లు పూర్తి సినిమాని విడుదల చేస్తే మరింత సక్సెస్ అయ్యేదని సందీప్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 'అర్జున్ రెడ్డి' ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా కట్‌ చేసిన సీన్స్ తో కలిపి 2022 ఆగస్టు 25న రిలీజ్ చేయాలని ప్లాన్‌ చేస్తున్నామని సందీప్‌ తెలిపారు. మరి 'అర్జున్ రెడ్డి' రీ రిలీజ్ ఎన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తుందో చూడాలి.