Begin typing your search above and press return to search.

'గల్లీ రౌడీ' హడావిడి లేదేంటి..?

By:  Tupaki Desk   |   16 Aug 2021 8:33 AM GMT
గల్లీ రౌడీ హడావిడి లేదేంటి..?
X
'ప్రస్థానం' సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన యంగ్ హీరో సందీప్ కిషన్.. ఇప్పటి వరకు 25 చిత్రాల్లో నటించారు. ఇందులో 'వెంకటాద్రి ఎక్సప్రెస్' 'బీరువా' 'టైగర్' 'నిను వీడని నీడను నేను' వంటి చిత్రాలు సందీప్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత 'A1 ఎక్స్ ప్రెస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ పర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో కమెడియన్ సత్య ని హీరోగా పరిచయం చేస్తూ 'వివాహ భోజనంబు' అనే సినిమా నిర్మించాడు. అలానే హీరోగా ''గల్లీ రౌడీ'' అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు సందీప్.

కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి 'గల్లీ రౌడీ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. తమిళ నటుడు బాబీ సింహా - రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రచయిత కోన వెంకట్‌ సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ - ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ కామెడీ ఎంటర్టైనర్ ని నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా మే 21న రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు థియేటర్లు తెరుచుకొని చిన్న సినిమాలు విడుదల అవుతుండటంతో 'గల్లీ రౌడీ' చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ విషయం జనాలకు మాత్రం తెలియలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సాధారణంగా సందీప్ కిషన్ సినిమా అంటే ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. తన సినిమాని జానాల్లోకి తీసుకెళ్లడానికి గట్టి ప్రయత్నాలే చేస్తుంటాడు. కానీ 'గల్లీ రౌడీ' మూవీ విషయంలో యువ హీరో రూట్ మార్చినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. ఇంకా ఎక్కడా హ‌డావుడి కనిపించడం లేదు.

సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉంది కదా అని అనుకుంటున్నారో.. లేదా అప్పటికి థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందనో 'గల్లీ రౌడీ' గురించి పెద్దగా ప్రచారం చేయడం లేదని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి రాబోయే రోజుల్లో శరవేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేసి ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. ఇకపోతే 'గల్లీ రౌడీ' చిత్రానికి చౌరస్తా రామ్‌ మిరియాల సంగీతం సమకూరుస్తున్నాడు. సుజాత సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఛోటా కె.ప్రసాద్‌ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా సందీప్ కిషన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.