Begin typing your search above and press return to search.

తెలుగు తెరకి తేనె సొగసుల సుందరి!

By:  Tupaki Desk   |   25 Dec 2021 2:30 AM GMT
తెలుగు తెరకి తేనె సొగసుల సుందరి!
X
తెలుగు తెరపై విరిసే అందాలలో మలయాళ మందారాలు ఎక్కువ. అక్కడి అందాలలో ఏదో ప్రత్యేకత ఉంటుంది .. మరేదో ఆకర్షణ ఉంటుంది. అక్కడి అందాలు అభినయానికి దగ్గరలో పెరుగుతాయి .. ప్రతిభతో కలిసి ఎదుగుతాయి. అందువలన తమ ప్రతిభా పాటవాలతో వాళ్లంతా అన్ని భాషలను కవర్ చేసేస్తూ ఉంటారు. మనసున్న ప్రతి చోటుకు వెళ్లి కొల్లగొట్టేస్తూ ఉంటారు.

మలయాళం నేల నుంచి ఇక్కడి వరకూ ఎగురుతూ వచ్చిన ఈ అందాల హంసల వలస ఎప్పుడో మొదలైంది. మొన్న వచ్చిన నయనతార నుంచి నిన్న వచ్చిన నిత్యామీనన్ వరకూ అందరూ కేరళా కొబ్బరి ముక్కలే.

అందాల గంధాలను వెదజల్లడంలోను .. అభినయ సుగంధాలను పరచడంలోనూ వారికి వారే సాటి. మలయాళ నుంచి ఇంతవరకూ వచ్చిన సౌందర్య మాలికలను పరిశీలిస్తే, పలకరించి వెంటనే వెళ్లినవారు చాలా తక్కువమంది .. పాతుకుపోయినవారే ఎక్కువ. ఎందుకంటే అందాన్ని .. అభినయాన్ని విడదీసి చూడలేమన్నట్టుగా వాళ్లు తెరపై తమ ప్రత్యేకతను కనబరుస్తారు.

అలాంటి కథానాయికల జాబితాలో చేరిపోవడానికి ఇప్పుడు మలయాళం నుంచి మరో అందాల భామ దిగిపోయింది. పొడగరిగా .. సొగసరిగా కనిపిస్తున్న ఈ సుందరి పేరే సంయుక్త మీనన్.

ముందుగా వరుస మలయాళ సినిమాలు చేస్తూ వెళ్లిన ఈ బ్యూటీ, తెలుగు తెరకి అసలైన అందాల తాకిడి తగ్గిందనుకుని కాస్త తీరిక చేసుకుని ఇటు వైపు వచ్చింది. కొత్త అందాలకు ఆశ్రయాన్ని కల్పించడంలో తెలుగు తెర ఎప్పుడూ ముందే ఉంటుంది. అందువల్లనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ అమ్మాయి 'బింబిసార'లో ఛాన్స్ కొట్టేసింది.

కల్యాణ్ రామ్ జోడీగా ఆ సినిమాలో కనిపించనుంది. అయితే ఆ సినిమా రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ లోగానే ఈ అమ్మాయిని 'భీమ్లా నాయక్' నుంచి అవకాశం వెదుక్కుంటూ వెళ్లింది. ఈ సినిమాలో రానా సరసన అలరించనుంది.

ఈ సినిమాతో ఈ అమ్మాయి అందానికి మంచి మార్కులు .. మంచి సినిమాలు పడటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ లోగానే తెలుగు .. తమిళ భాషల్లో ధనుశ్ చేయనున్న 'సార్' సినిమాలో ఈ పిల్ల ఛాన్స్ కొట్టేసింది. నిన్ననే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ కూడా ఒక నిర్మాతగా ఉండటం విశేషం. త్వరలో తెలుగు తెరకి పరిచయం కానున్న కొత్త కథానాయికలలో మీనాక్షి చౌదరితో పాటు, సంయుక్త మీనన్ ల జోరు కూడా ఒక రేంజ్ లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.