Begin typing your search above and press return to search.

'బంగార్రాజు' విలన్ గా కటారి కృష్ణ?

By:  Tupaki Desk   |   26 April 2021 11:30 AM GMT
బంగార్రాజు విలన్ గా కటారి కృష్ణ?
X
'బంగార్రాజు' పేరు వినగానే, 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో పల్లెటూరి బుల్లోడుగా పంచెగట్టి .. ముల్లుగర్ర చేతబట్టి .. రేబాన్ గ్లాసులెట్టిన నాగార్జున రూపం కళ్లముందు కదలాడుతుంది. అంతగా ఆ పాత్ర జనంలోకి వెళ్లింది. అప్పటి నుంచి 'బంగార్రాజు' టైటిల్ తో సినిమా చేయడానికి నాగార్జున ఉత్సాహం చూపుతూనే వస్తున్నారు. అయితే కథ సెట్ కావడానికే చాలా సమయం పట్టింది. 'బంగార్రాజు' కథపైనే దర్శకుడు కల్యాణ్ కృష్ణ చాలా కాలంగా కసరత్తు చేస్తూ వచ్చాడు. చివరికి నాగార్జునతో ఓకే అనిపించాడు. దాంతో నాగ్ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు.

'బంగార్రాజు' సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల నాగార్జున చెప్పారు. దాంతో మొత్తానికి ఈ పాజెక్టు సెట్ అయిందనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక ఒక యువ జంట కూడ ఈ కథలో సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరబ్బా అనే ఆసక్తి అభిమానుల్లో తలెత్తడం సహజమే.

ఈ సినిమాలో బంగార్రాజు అవునంటే కాదంటూ ఆయనతో కయ్యానికి కాలుదువ్వే విలన్ పాత్రలో 'సముద్రఖని' కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. 'అల వైకుంఠపురములో' సినిమాలో 'అప్పలనాయుడు' పాత్రలో సముద్రఖని మెప్పించాడు. 'క్రాక్' సినిమాలో 'కటారి కృష్ణ' పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. 'బంగార్రాజు'లో విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ కావడంతో, సముద్రఖనినే తీసుకునే ఆలోచన చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.